TS Inter Public Exams Alert 2024 : ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం.. ఈ నిబంధన సడలింపు.. ఈ ఏడాది కొత్తగా..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ ఇంటర్‌ బోర్డు మార్చి 1వ తేదీన‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌ పరీక్షల నేపథ్యంలో.. ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థుల్ని పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది.

ఈ మేరకు.. నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌లకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8:45 గంటలకు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతి చేస్తామన్నారు.

ఈ నిబంధన కారణంగా..
ఇప్పటివరకు పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకుండా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధన కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారనే విమర్శలు ఎక్కువగా వినవస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ ఇంటర్‌ విద్యార్థి ఈ నిబంధన కారణంగా పరీక్షకు అధికారులు అనుమతించకపోవడంతో.. తండ్రికి సూసైడ్‌ లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర విషాదాన్ని నింపింది.

తెలంగాణ‌లో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,78,718 మంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,02,260 మంది ఉన్నారు. రెండో ఏడాది ప్రైవేటుగా పరీక్షలు రాసేవారు 58,071 మంది ఉన్నారు. ఈ ఏడాది కొత్తగా ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ కూడా నిర్వహించారు. 

1,521 పరీక్ష కేంద్రాలు... 

ఇంటర్‌ పరీక్షలకు 1,521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 407 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను, ప్రభుత్వ ఆ«దీనంలో ఉండే 407 కాలేజీలను, 880 ప్రైవేటు కాలేజీలను పరీక్ష కేంద్రాలకు ఎంపిక చేశారు. 1521 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను, ఇదే సంఖ్యలో ప్రభుత్వ అధికారులను పరీక్షలకు వినియోగిస్తున్నారు. 27,900 మంది ఇన్విజిలేటర్లు పరీక్ష విధుల్లో ఉండబోతున్నారు. 200 సిట్టింగ్‌ స్క్వాడ్లు, 75 ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించుతున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రాలకు తరలించారు. పరీక్షల ఫోబియో వెంటాడుతూ ఆందోళనకు గురయ్యే విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి ఇంటర్‌ బోర్డ్‌ ‘టెలీ మానస్‌’పేరుతో టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసింది. విద్యార్థులు 14416 లేదా 040–24655027 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.

#Tags