Gandhi Medical College: ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేత.. కార‌ణం ఇదే..

గాంధీ ఆస్పత్రి : ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీ యాంటీ ర్యాగింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.

 కాలేజీ ప్రిన్సిపాల్‌, కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ రమేష్‌రెడ్డి నేతృత్వంలో యాంటీ ర్యాగింగ్‌ కమిటీ జ‌నవ‌రి 8న‌ ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. నాలుగు నెలల క్రితం గాంధీ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌కు పాల్పడిన 11 మంది విద్యార్థులను నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) ఆదేశాల మేరకు కళాశాల నుంచి ఏడాది పాటు సస్పెండ్‌ చేసిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పలుమార్లు అభ్యర్థించడంతో పాటు మరోమారు ర్యాగింగ్‌కు పాల్పడమని లిఖితపూర్వకంగా వినతులు సమర్పించారు. ఈ క్రమంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యాంటీ ర్యాగింగ్‌ కమిటీ సమావేశమైంది. నెల రోజుల్లో పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.

చదవండి: Study Abroad Scholarships: స్టడీ అబ్రాడ్‌ విద్యార్థులకు అందుబాటులో ఉన్న పలు స్కాలర్‌షిప్‌ల వివరాలు ఇవే..

విద్యార్థులు, వారి తల్లితండ్రులు అఫిడవిట్‌ సమర్పించాలని, కళాశాలలో నిర్వహించే తరగతులు, పరీక్షలు హాజరు కావచ్చని అంగీకరిస్తూ, హాస్టల్‌లో ఉండేందుకు నిరాకరించింది. సస్పెన్షన్‌కు గురైన విద్యార్థులతో కమిటీ ప్రతినిధులు నేరుగా మాట్లాడారు. మరోమారు ర్యాగింగ్‌కు పాల్పడితే కళాశాల నుంచి శాశ్వతంగా తొలగించి, పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా గాంధీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ కాపాడేందుకు వారిపై ఉన్న సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందన్నారు. ర్యాగింగ్‌ ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని, ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.

సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో గాంధీ కళాశాల విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తూ, కమిటీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణమోహన్‌, గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు, పలు విభాగాల హెచ్‌ఓడీలతోపాటు యాంటీ ర్యాగింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

#Tags