AP Jobs: నోటిఫికేషన్‌ల విడుదలకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ), ఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ), కుటుంబ సంక్షేమ, ప్రజారోగ్య విభాగాలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నాయి.
Notifications for Medical Health Jobs

డీఎంఈ పరిధిలో ఖాళీగా ఉన్న 1,952, కొత్తగా సృష్టించిన 2,190, ప్రజారోగ్య విభాగం పరిధిలో ఖాళీగా ఉన్న 2,918, కొత్తగా సృష్టించిన 1,285, ఏపీవీవీపీ పరిధిలో ఖాళీగా ఉన్న 2,520, వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలో 560 ఫార్మసిస్ట్‌ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల్లో కొన్నింటిని సంబంధిత విభాగాలు నేరుగా, మరికొన్ని ఉద్యోగాలను జిల్లా ఎంపిక కమిటీలు (డీఎస్‌సీ) ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు, ప్రొఫెసర్‌లు, ఇతర వైద్యుల ఉద్యోగాలను రాష్ట్రస్థాయిలో, మిగిలిన ఉద్యోగాలను జిల్లాస్థాయిలో డీఎస్‌సీల ద్వారా భర్తీ చేయనున్నారు. రాష్ట్రస్థాయి నియామకాలు అన్నీ ఆన్‌లైన్‌ విధానంలోనే భర్తీ చేపట్టనున్నారు. జిల్లా స్థాయిల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ విధానాల్లో భర్తీ ప్రక్రియ ఉంటుంది. తొలుత డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లు పూర్తి అయ్యాక, శాఖపరంగా ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేపట్టనున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదలవుతాయి.

ICAR Exams‌: రాష్ట్ర విద్యార్థులకు ర్యాంకులు

శని, ఆదివారాల్లో నోటిఫికేషన్‌లు
పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ఉంటుంది. గతేడాది కూడా ఉద్యోగాల భర్తీ చేపట్టాం. ఇప్పటికే అన్ని ఉద్యోగాల నియామకానికి నియమ, నిబంధనలు పొందుపరిచాం. దీంతో కొత్తగా నియమ, నిబంధనలు పొందుపరచాల్సిన అవసరం లేదు. కేవలం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ నిర్దేశించాల్సి ఉంది. రిజర్వేషన్‌లు ఫైనల్‌ చేయడానికి ఆయా విభాగాలు కసరత్తు చేస్తున్నాయి. స్టాఫ్‌ నర్సులతో పాటు, మరికొన్ని ఖాళీలను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. వీటికి మినహా మిగిలిన ఉద్యోగాల భర్తీకి శని లేక ఆదివారాల్లో నోటిఫికేషన్‌ ఇస్తాం.
– కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌

Exams: అసెస్‌మెంట్‌ పరీక్షల తేదీల మార్పు

900లకు పైగా పీజీ సీట్ల పెరుగుదలకు అవకాశం
ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ప్రస్తుతం వెయ్యికి పైగా పీజీ సీట్లు ఉన్నాయి. ఎంసీఐ నిబంధనల ప్రకారం వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ, అదనపు ఉద్యోగాల సృష్టి వల్ల పీజీ వైద్య సీట్లు పెరగనున్నాయి. గతేడాది 180 పీజీ సీట్ల మంజూరు కోసం దరఖాస్తు చేశాం. విడతల వారీగా ఈ సీట్లు మంజూరు అవుతున్నాయి. ప్రభుత్వం మరికొన్ని పోస్టులు సృష్టించింది. దీంతో 900లకు పైగా పీజీ సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెరగడానికి ఆస్కారం ఉంది.     
– డాక్టర్‌ మానుకొండ రాఘవేంద్రరావు, డీఎంఈ

#Tags