Exams 2024: పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.....

Exams 2024: పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.....
Exams 2024: పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.....

గుంటూరు : పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు ఎల్లప్పుడు కంగారు పడుతూనే ఉంటారు. ఇంటర్‌, పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనున్న నేపథ్యంలో వారి భోజన విషయంలో తల్లిదండ్రులు మరింత కంగారు పడిపోతుంటారు. చదువు ధ్యాసలో పడి విద్యార్థులు సరిగ్గా భోజనం తినకపోతే నీరసించి పరీక్షలు రాయలేకపోతారు. అలాంటి సమయాల్లో తల్లిదండ్రులే తమ పిల్లల డైట్‌ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను గుంటూరు జీజీహెచ్‌ చీఫ్‌ డైటీషియన్‌ కె.వి.గిరిధర్‌ ‘సాక్షి’ కి వివరించారు. ఆయన మాటల్లోనే...

టిఫిన్‌గా నూనె పదార్థాలు వద్దు...

ఉదయం తీసుకునే అల్పాహారంలో నూనె వస్తువులు లేకుండా చూసుకోవాలి. ఆయిల్‌ ఫుడ్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవటం వల్ల తరచుగా దాహం వేసి పరీక్షల సమయంలో విద్యార్థులు పరీక్ష మూడ్‌లో డిస్‌టర్బ్‌ అవుతారు. తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. లేకపోతే బ్లడ్‌ గ్లూకోజ్‌ లెవల్స్‌ పడిపోయి త్వరగా నీరశించి పోతారు. సుళువుగా అరిగే ఆహార పదార్థాలను టిఫిన్‌గా తీసుకోవాలి. ఇడ్లీ చాలా మంచింది. మిక్సిడ్‌ వెజిటబుల్‌ కిచిడి, గోధుమరవ్వ ఉప్మా కూడా బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. టిఫిన్‌ తిన్నాక పాలు తాగటం మర్చిపోవద్దు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటలలోపు బ్రేక్‌ఫాస్ట్‌ ముగించాలి.

జ్ఙాపకశక్తి కోసం బి–12 ఆహారం..

విద్యార్థులు చదవింది గుర్తుపెట్టుకోటానికి విటమిన్‌ బి12 ఉపయోగపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుదలకు ఉపయోగపడే ఈ విటమిన్‌ మాంసపు ఉత్పత్తుల్లో అధికంగా లభిస్తుంది. అయితే చికెన్‌, మటన్‌లను వేపుళ్లుగా తినకుండా కూరలాగా తింటే పరీక్షల సమయంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. మాంసం తినటానికి ఇష్టపడని వారు రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తినటం మంచిది. మధ్యాహ్నం భోజనంలో ఒక ఆకుకూర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. కూరగాయలతో చేసిన కూర, పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. భోజనం అనంతరం ఏదైనా ఒక పండు తింటే మంచిది. సాయంత్రం నాలుగు గంటలకు స్నాక్స్‌ తీసుకోవాలి. ఫాస్ట్‌ ఫుడ్స్‌, చాక్లెట్లు వద్దు. వేరుశనగ పప్పులతో చేసిన ఉండలు తీసుకుంటే మంచిది.

రాత్రి 7.30కల్లా భోజనం ముగించాలి...

రాత్రి తీసుకునే భోజనం 7.30 గంటలకల్లా ముగిస్తే చాలా మంచిది. పప్పు, కూర, రసం, సాంబారు, పెరుగు, మజ్జిగ భోజనంలో ఉండేలా చూసుకోవాలి. నిద్రకు గంట ముందుగా గ్లాసు పాలు తాగటం ఉత్తమం. రాత్రిళ్లు ఎక్కువ సమయం వేచి ఉండవద్దు. సరిపడా నిద్ర లేకపోతే అనేక అనర్ధాలు తలెత్తుతాయి. కనీసం ఏడు గంటలు నిద్ర పోటవటం మంచిది. సీజన్‌లో లభించే పండ్లు, ముఖ్యంగా విటమిన్‌ సి ఎక్కువగా లభించే పండ్లు తీసుకోవటం చాలా మంచిది.

విద్యార్థులకు భోజనం విషయంలో జాగ్రత్తలు అవసరం.. నూనె పదార్థాలు, వేపుళ్ల జోలికి పోకూడదు జ్ఞాపకశక్తికి విటమిన్‌ బి–12 ఉండే ఆహారం తీసుకోవాలి

#Tags