TG High Court: ఆ పేరుతో సర్టిఫికెట్‌ మార్చి ఇస్తాం

సాక్షి, హైదరాబాద్‌: పేరు మార్చుకున్నప్పటికీ ప్రభుత్వం తన విద్యా సర్టిఫికెట్లలో ఆ మేరకు మార్పు చేయట్లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన ఓ వ్యక్తికి చివరకు న్యాయం లభించింది.

రెండు వారాల్లోగా పిటిషనర్‌కు ఎస్‌ఎస్‌సీ బోర్డు కొత్త సర్టిఫికెట్‌ జారీ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. పిటిషనర్‌ విజ్ఞప్తిని సర్కార్‌ అంగీకరించినందున విచారణ ముగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. 

ఇదీ నేపథ్యం.. 

తన పేరు మార్చుకున్నట్లు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయినప్పటికీ తెలంగాణ‌ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ బోర్డు, ఉస్మానియా యూనివర్సిటీ ఆ మేరకు సర్టిఫికెట్లలో మార్పులు చేయట్లేదంటూ రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన వి. మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ చర్య 1961 నాటి జీవో 1263 ప్రకారం చట్టవిరుద్ధమన్నారు. 

చదవండి: NMC's Guidelines: ప్రైవేట్‌ వైద్య కళాశాల నిర్వహణకు ఇవి తప్పనిసరి.. తనిఖీల్లో బయటపడిన వాస్తవాలు..

ఇది వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు. దీంతో ఆ విద్యార్థికి చెందిన సర్టిఫికెట్లలో పేరు మార్చడానికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు గత విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై మరోసారి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. 

పిటిషనర్‌ తరఫున న్యాయవాది కె.అరవింద్, ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ ఎస్‌.రాహుల్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్‌ కోరినట్లు మారిన పేరుపై రెండు వారాల్లో సర్టిఫికెట్‌ జారీ చేస్తామని ఎస్‌జీపీ బదులిచ్చారు. దీంతో ధర్మాసనం.. పిటిషన్‌లో విచారణను ముగించింది.

#Tags