Kerala Shalini Teacher: స్కూల్‌ను రీ ఓపెన్ చేసాక పిల్లలు కోరింది షాలినీ టీచర్‌నే.. ఎవరి షాలిని టీచర్‌?

వాయనాడ్‌ వరదలకు రెండు నెలల ముందు షాలినీ టీచర్‌ ట్రాన్స్‌ఫర్‌ అయి వెళ్లిపోయింది. స్కూల్‌ పిల్లల యూనిఫామ్‌లోనే సైకిల్‌ మీద తిరుగుతూ పిల్లలతో ఆడిన ఆమె వీడియో ఇంటర్నెట్‌లో ఎందరికో ఇష్టం. తర్వాత వరదలు వచ్చాయి. వీడియోలో ఉన్న పిల్లలు ముగ్గురు చనిపోయారు. ‘నేను ఎప్పటికీ ఆ స్కూల్‌కి వెళ్లలేను’ అని బాధపడింది షాలినీ టీచర్‌. కాని వారం క్రితం స్కూల్‌ తెరిచాక పిల్లలు కోరింది షాలినీ టీచర్‌ కావాలనే. వారి టీచర్‌ వారికి దొరికింది. ఇక గాయం తప్పక మానుతుంది.
  • టీచర్ల జీవితంలో అత్యంత కఠినమైన సందర్భం ఏమిటో తెలుసా? 
  • విగత జీవులుగా ఉన్న పిల్లల ముఖాలను గుర్తు పట్టమని వారిని పిలవడం.

జూలై 30 వాయనాడ్‌లోని కొండ్రప్రాంత పల్లెలు ముండక్కై, చూరలమల వరదల్లో పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఊహించని వరద నిద్రలో ఉన్నవారిని నిద్రలోనే తీసుకెళ్లింది. ముండక్కైలో చిన్న ఎలిమెంటరీ స్కూల్‌ ఉంది. ఆ గవర్నమెంట్‌ స్కూల్‌ మొత్తం బురదతో నిండిపోయింది.

దాని చుట్టూ ఉండే ఇళ్లు ధ్వంసమైపోయాయి. స్కూల్లోని 9 మంది విద్యార్థులు మరణించారు. వారిలో ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరణించారు. మృతదేహాల ఆచూకీ దొరికాక వారిని గుర్తించడానికి టీచర్లనే పిలిచారు. అక్కడ పని చేసిన షాలినీ టీచర్‌కు ఆ ఘటన ఎంత మనోవేదన కలిగించిందో! మిగిలిన టీచర్లు మళ్లీ ఈ స్కూల్‌ ముఖం చూడకూడదని ఎంతగా ఏడ్చారో!!

చదవండి: Teacher Suresh: విద్యార్థి ప్రాణం కాపాడి.. తాను అస్వస్థతకు గురైన‌ ఉపాధ్యాయుడు.. కార‌ణం ఇదే..

షాలినీ టీచర్‌ది కొట్టాయం. కాని పట్నంలో పాఠాలు చెప్పడం కన్నా వాయనాడ్‌ ప్రాంతం ఆహ్లాదంగా ఉంటుంది... ప్రజలు అమాయకంగా ఉంటారని ముండక్కైలో ఎలిమెంటరీ స్కూల్లో అడిగి మరీ టీచర్‌గా చేరింది. అక్కడ పిల్లలకు ఆమె ఇష్టమైన టీచర్‌. వారి యూనిఫారమ్‌లాంటి చుడిదార్‌ వేసుకుని స్కూల్‌కు వచ్చి పిల్లల్లో కలిసిపోయేది.

చిన్న స్కూలు... పిల్లల సంఖ్య తక్కువ కావడంతో అందరి ఇళ్లు, తల్లిదండ్రులు తెలుసు. ఒకరోజు గేమ్స్‌ పిరియడ్‌లో ఒక పాప సైకిల్‌ను ఆసక్తిగా చూడటం గమనించింది షాలినీ టీచర్‌. ఆ పాప స్లోచైల్డ్‌. తానుగా సైకిల్‌ తొక్కలేదు. షాలినీ టీచర్‌ అది గమనించి ‘సైకిల్‌ ఎక్కుతావా’ అని వెనుక నిలబెట్టి తాను తొక్కుతూ గ్రౌండ్‌లో ఒక రౌండ్‌ వేసింది. పిల్లలందరూ చుట్టూ చేరి ఎంజాయ్‌ చేశారు.

ఎవరో ఇది షూట్‌ చేయగా ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యింది. రెండేళ్లు పని చేశాక షాలినీ టీచర్‌కి జూన్‌ నెలలో దగ్గరలోనే ఉన్న మీనన్‌గడి అనే ఊరికి ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. పిల్లలు ఆమె వెళ్లడానికి ఒప్పుకోలేదు. కాని వెళ్లక తప్పలేదు.

చదవండి: Rajarshi Shah, IAS: ఉపాధ్యాయులు సమాజ మార్గదర్శకులు.. ఉపాధ్యాయురాలి వద్దకు వెళ్లి అవార్డు ప్రదానం

ఆ రోజు షాలినీ టీచర్‌ అనుకోలేదు.. వారిలో కొందరిని మళ్లెప్పుడూ చూడలేనని. వాయనాడ్‌ వరదలు పిల్లలకూ ఆమెకూ మధ్య శాశ్వత దూరం తెచ్చాయి. చనిపోయిన పిల్లలను గుర్తు పట్టమని పోలీసులు ఆమెను పిలిచినప్పుడు ఆమె హృదయం బద్దలైంది. 

వాయనాడ్‌ కోలుకుంది. సెప్టెంబర్‌ 2న ముండక్కైలోని స్కూల్‌ను రీ ఓపెన్‌ చేస్తూ సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి వి.శివకుట్టి హాజరయ్యారు. దారుణమైన విషాదాన్ని చవిచూసిన ఆ పిల్లల ముఖాలను చూసిన మంత్రి ‘మీకు ఏం కావాలో అడగండి చేస్తాను’ అన్నారు.

వెంటనే పిల్లలు ‘మా షాలినీ టీచర్‌ను మా దగ్గరకు పంపండి’ అన్నారు. ఇలాంటి సమయంలో వారికి ఇష్టమైన టీచర్‌ తోడుంటే బాగుంటుందనుకున్న మంత్రి వెంటనే ఆదేశాలు ఇచ్చారు. షాలినీ తన స్కూల్‌కు తాను తిరిగి వచ్చింది.
ఆమెను చూసిన పిల్లలు కేరింతలు కొట్టారు. ఆమె కన్నీరు కార్చింది చనిపోయిన పిల్లలను తలుచుకుని. కాని ఆనందించింది తన స్కూలుకు తాను వచ్చానని.
ఆ స్కూల్‌ను తిరిగి ఆటపాటలతో నింపడమే ఆమె లక్ష్యం.
పిల్లల మోముల్లో చిర్నవ్వును పూయించడమే కర్తవ్యం.
షాలిటీ టీచర్‌ తప్పక సాధిస్తుంది.

#Tags