Shiksha Saptah 2024: పాఠశాలల్లో ‘శిక్షా సప్తాహ్‌’

కెరమెరి(ఆసిఫాబాద్‌): కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ– 2020) ప్రవేశపెట్టి నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నేటి నుంచి వారోత్సవాలు నిర్వహించేందుకు విద్యాశాఖ సమాయత్తమైంది. సోమవారం నుంచి ఈ నెల 28 వరకు శిక్షా సప్తాహ్‌ పేరుతో జిల్లాలో పలు కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

2020లో ఎన్‌ఈపీ(నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ)ని ప్రవేశపెట్టగా 2020 జూలై 29న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జాతీయ విద్యావిధానాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో నేటి నుంచి వారం రోజులపాటు శిక్షా సప్తాహ్‌ నిర్వహించనున్నారు.

జిల్లాలో మొత్తం 739 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 45 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు భాగస్వాములు చేయాలని జిల్లా అధికారులు సూచించారు.

చదవండి: Change of School Working Hours: హైస్కూళ్ల పనివేళల్లో మార్పు

రోజువారీ కార్యక్రమాలు ఇలా..

22న సామగ్రి ప్రదర్శన: తొలిరోజు బోధన సామగ్రి ప్రదర్శన నిర్వహించాలి. ఉపాధ్యాయులు స్థానికంగా లభించే వనరులతో రూపొందించిన బోధన అభ్యసన సామగ్రిని ప్రదర్శిస్తారు.

23న పునాది అభ్యసన: ఒకటో తరగతి నుంచి భాషపై పట్టు సాధించేందుకు పునాది అభ్యసనం, గణితంలోని సంఖ్యాశాస్త్రం, నైపుణ్యాల అభివృద్ధి అమలుపై చర్చిస్తారు.

24న క్రీడా దినోత్సవం: విద్యార్థులకు శారీరక దారుఢ్యం ప్రాధాన్యం తెలిపేలా పలు రకాల క్రీడాంశాలపై పోటీల్లో నిర్వహించడం, ప్రాధాన్యత వివరించడం.

25న సాంస్కృతిక దినోత్సవం: భిన్నత్వంలో ఏకత్వం భావాన్ని పెంపొందించడం, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు(ఫ్యాన్సీ డ్రెస్‌, పాటలు, నృత్య ప్రదర్శన, నాటికలు) నిర్వహించడం.

చదవండి: Sports School: స్పోర్ట్స్‌ స్కూల్‌లో సౌకర్యాల కల్పనకు కృషి

26న సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం: ఉద్యోగావకాశాల కల్పన నేపథ్యంలో అన్ని తరగతుల వారికి నూతన నైపుణ్యల అవసరాన్ని గుర్తించడం. విధుల్లో సాంకేతిక అభివృద్ధిని గుర్తించేలా చర్చించడం.

27న పర్యావరణ పరిరక్షణ దినోత్సవం: పర్యావరణ పరిరక్షణ సంకల్పయాత్ర, కృత్యాల(మిషన్‌ టైప్‌ యాక్టివిటీస్‌) కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో పోషణ్‌ దినోత్సవం నిర్వహణ, ఎకోక్లబ్‌ల ఏర్పాటు, విద్యార్థులు, వారి తల్లులు, మాతృభూమి మధ్య బంధాన్ని బలోపేతం చేయడంపై అవగాహన, బడిలో అధిక సంఖ్యలో మొక్కలు నాటించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి.

28న సామాజిక భాగస్వామ్య దినోత్సవం: విద్యార్థుల సామాజిక భావోద్వేగ శ్రేయస్సు కోసం స్థానికులు, తల్లిదండ్రుల కమిటీలు, ఉపాధ్యాయుల సంఘాల సహకారంతో పుట్టిన రోజులు, ప్రత్యేక సందర్భాల్లో సహపంక్తి భోజనం చేయడం.

విజయవంతం చేయాలి

నేటి అన్ని పాఠశాలల్లో విద్యా వారోత్సవాల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులను ‘శిక్షా సప్తాహ్‌’లో భాగస్వాములు చేయాలి. ఫొటోలు, వీడియోలు సంబంధిత పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎంఈవోలు, ఎన్‌ఎన్‌వో చొరవ చూపాలి

– పి.అశోక్‌, డీఈవో

#Tags