PM Poshan Scheme: విద్యార్థులకు మళ్లీ రాగి జావ

సాక్షి, సిటీబ్యూరో: ఉదయం పూట విద్యార్థుల ఆకలి తీర్చేందుకు, పోషక విలువలతో కూడిన ఆహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పాఠశాలల్లో రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని గత విద్యా సంవత్సరం ప్రారంభించింది.

ఈ విద్యా సంవత్సరం జూన్‌ మాసం వరకు ఈ కార్యక్రమం కొనసాగగా, మూడు నెలలు (జులై, ఆగష్టు, సెప్టెంబర్‌)గా నిలిచిపోయింది. రాగి జావ అందించడం వల్ల మంచి ఫలితాలున్నాయని భావించిన ప్రభుత్వం ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయాలని నిర్ణయించింది.

తాజాగా పీఎం పోషణ్‌ పథకంలో భాగంగా సర్కారు పాఠశాలల్లోనూ తిరిగి ప్రారంభించాలని ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దసరా సెలవులు ముగిసిన తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ అందనుంది.

చదవండి: APAAR.. విద్యా మంత్రిత్వ శాఖ ప్రతీ విద్యార్థికి అందించే గుర్తింపు నంబర్‌

గ్రేటర్‌ జిల్లాల్లో ఇలా..

హైదరాబాద్‌ నగరంతో సహా మేడ్చల్‌– మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 2,497 ప్రభుత్వ పాఠశాలల్లో 3.81లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రతి రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. వీటితో పాటు ఉదయం వేళ వంట ఏజెన్సీల ద్వారా రాగిజావ కూడా అందించనున్నారు. దీంతో ఉదయం వేళ ఆహారం తీసుకోకుండా వచ్చే విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఒక్కో విద్యార్థికి 10 గ్రాముల రాగి పిండి, బెల్లంతో కలిపి మరగబెట్టిన జావను వారంలో మూడు రోజుల పాటు అందించనున్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

చర్యలు చేపడతాం..

విద్యార్థులకు మళ్లీ రాగి జావ అందించాలని ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం నుంచి అవసరమైన పిండి, బెల్లం సరఫరా కాగానే పాఠశాలలకు చేరవేసి, అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం.

– విజయకుమారి, మేడ్చల్‌– మల్కాజిగిరి డీఈఓ

#Tags