Prime Minister's Awards for Excellence: ఏపీకి ప్రైమ్‌ మినిస్టర్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్న విద్యా బో­దనకు గాను ‘ప్రైమ్‌ మినిస్టర్‌ ఎక్స్‌లెన్స్‌’ అవార్డుకు ఆంధ్రప్రదేశ్‌ ఎంపికైంది.

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక విద్యకు శ్రీకారం చుడుతూ సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన విద్యా విప్లవానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. బ్లాక్‌ బోర్డు స్థానంలో తెచ్చిన ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌(ఐఎఫ్‌పీ), బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల ద్వారా ఆధునిక బోధనకు గాను రాష్ట్రాన్ని ఈ అవార్డు వరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అమర్చిన ఐఎఫ్‌పీలు, 8, 9వ తరగతుల విద్యార్థుల చేతుల్లో ఉన్న ట్యాబ్‌ల ద్వారా విద్యాబోధన, సందేహాల నివృత్తికి బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులను పాఠశాలలకు అనుసంధానం చేస్తూ ప్రవేశపెట్టిన ‘ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఎక్స్‌పర్ట్స్‌’ కార్యక్రమం బెస్ట్‌ ఇన్నోవేషన్‌ కేటగిరీలో అ­వా­ర్డు ఎంపికలో కీలకపాత్ర వహించింది.

చదవండి: Tabs for Students: సాంకేతిక నైపుణ్యం పెంచేందుకు డిజిటల్‌ బోధన

దేశంలోనే అత్యుత్తమ విద్యాబోధన చేస్తున్న రాష్ట్రంగా అ­త్యు­న్నత అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఇద్దరు అధికారులను రాష్ట్రానికి పంపింది. కేంద్ర డిప్యూటీ కార్యదర్శులు ఆశిష్‌ సక్సేనా, హరీష్‌ రాయ్‌తో కూడిన బృందం గురువారం గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం వెనిగండ్ల జెడ్పీ హైసూ్కల్, గుంటూరు చౌ­త్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ప­ట్టాభిపురంలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠ­శాలలను సందర్శించింది. విద్యాశాఖ ముఖ్య కార్యద­ర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ వీరికి పాఠశాలల్లో అమలు చేస్తు­న్న సాంకేతిక విద్యా బోధన గురించి వివరించారు. 

‘ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఎక్స్‌పర్ట్స్‌’పై ప్రశంసలు 

కార్పొరేట్‌ను తలదన్నేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధునిక బోధన పద్ధతులు, వసతులను తిలకించిన అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐఎఫ్‌పీలు, ట్యాబ్‌ల ద్వారా విద్యాబోధన అందించడంతో పాటు దేశంలోనే తొలిసారిగా ఇంజినీరింగ్‌ విద్యార్థులను పాఠశాలలకు అనుసంధానం చేస్తూ ప్రవేశపెట్టిన ‘ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఎక్స్‌పర్ట్స్‌’ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారు. విద్యార్థులతో మాట్లాడిన ఆశిష్‌ సక్సేనా, హరీష్‌ రాయ్‌లు.. వారిలోని అద్భుతమైన మేధస్సు, సబ్జెక్టుల వారీగా పట్టు, ఇంగ్లిష్‌ భాష పరిజ్ఞానంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ట్యాబ్‌ల ద్వారా ఇన్నోవేటివ్‌ ట్రెండ్స్, స్విఫ్ట్‌చాట్‌ యాప్, బైజూస్‌ కంటెంట్‌ను ఇంజినీరింగ్‌ విద్యార్థులు బోధిస్తున్న తీరును, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, మెషీన్‌ లెర్నింగ్‌ తదితర సాంకేతిక నైపుణ్యాలపై పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పింస్తున్న తీరును పరిశీలించారు. ఐఎఫ్‌పీల ద్వారా ఉపాధ్యాయుల బోధనను ప్రత్యక్షంగా తిలకించారు. ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఎక్స్‌పర్ట్స్‌ కార్యక్రమం ద్వారా ఏ ఏ అంశాలను నేర్చుకుంటు­న్నదీ విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు.

తరగతులను బోధిస్తున్న బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులతోనూ మాట్లాడారు. మూడు పాఠశాలల సందర్శన ముగించుకున్న అధికారుల బృందం.. సంబంధిత విద్యార్థులు చదువుతున్న కళ్లం హరనాథరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలకు వెళ్లి యాజమాన్యంతో చర్చించారు. సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి, ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో పి.శైలజ, సీఎస్‌­ఈ ఐటీ సెల్‌ ప్రతినిధి రమేష్, హెచ్‌ఎంలు ఉన్నారు.

#Tags