PG College Admissions: సీట్లు ఖాళీ.. విద్యార్థులేరీ.. ఈ కాలేజీల్లో చేరేందుకు మాత్రమే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు!

ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలో ప్రతి ఏటా పీజీ కాలేజీల సంఖ్య పెరుగుతోంది. కానీ విద్యార్థులు మాత్రం చేరడం లేదు. అన్ని వర్సిటీల పరిధిలో 272 పీజీ కాలేజీలు ఉండగా అందులో 29 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. హాస్టల్‌ వసతి, అధ్యాపకుల కొరత కారణంగా పీజీ కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదు.

కాగా.. నేటి సాయంత్రం టీజీసీపీజీఈటీ–2024 కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించిన విద్యార్థుల చివరి జాబితాను విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ ప్రొ.పాండురంగా రెడ్డి తెలిపారు.

కామారెడ్డిలోని ఆర్ట్స్‌ అండ్‌ కాలేజీ (అటానమస్‌)లో బీఎస్సీ బాటనీ అర్హతతో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రవేశ పెట్టిన ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సులో 60 సీట్లకు కేవలం 5 మంది మాత్రమే విద్యార్థులు చేరినట్లు కన్వీనర్‌ పేర్కొన్నారు.

చదవండి: Admissions: ANUలో ‘టీవీ అండ్‌ ఫిలిం’ పీజీ కోర్సుకు దరఖాస్తులు.. చివ‌రి తేదీ ఇదే

యూనివర్సిటీల కాలేజీలకే ప్రాధాన్యం

రాష్ట్రంలోని అన్ని వర్సిటీల క్యాంపస్‌ కాలేజీల్లో చేరేందుకు మాత్రమే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని, ప్రభుత్వ, ప్రైవేటు పీజీ కాలేజీల్లో విద్యార్థులు చేరడం లేదని ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. అన్ని వర్సిటీల్లో 50 వేల సీట్లకు రెండు విడతల్లో జరిగిన కౌన్సెలింగ్‌లో మొత్తం 18,120 సీట్లు భర్తీ కాగా అందులో అమ్మాయిలు రెండింతలు అధికంగా 13,458 మంది పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందగా అబ్బాయిలు కేవలం 4,662 మంది మాత్రమే చేరినట్లు వివరించారు.

సుమారు 32 వేల సీట్లు మిగిలినట్లు చెప్పారు. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థుల్లో రెండు వేల వరకు రూ.800 ఫీజును చెల్లించి చేరలేదు. మరో 4,651 మందికి సీట్లు వచ్చినా చేరలేదన్నారు. రాష్ట్ర ఉన్నత విద్య మండలి అధికారులకు ఈ విషయం తెలిసినా కొత్త కాలేజీలకు అనుమతించడం దారుణమని సీనియర్‌ ప్రొఫెసర్లు పేర్కొన్నారు. కాలేజీ సంఖ్యను కుదించి ఉన్నత విద్య ప్రమాణాలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.

#Tags