Para Medical College: న్యాల్‌కల్‌లో పారా మెడికల్‌ కాలేజీ

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌) : న్యాల్‌కల్‌ ప్రాంతంలో పారా మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేసే బాధ్యత తనదేనని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

మండల పరిధిలోని పంచవటి క్షేత్రం ఆవరణలో నిర్మించిన 75 పడకల శ్రీకాశీనాథ్‌బాబా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆదివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. న్యాల్‌కల్‌, ఖేడ్‌, మనూర్‌, రేగోడ్‌ ప్రాంతంలో పాలిటెక్నిక్‌, ఐటీఐ, ఇంటర్‌నేషనల్‌ స్కూల్‌ను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. అలాగే ప్రతీ నియోజకవర్గానికి ఒక నర్సింగ్‌ కళాశాలను, జిల్లాకు పారా మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

చదవండి: ITDA PO B Rahul: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

సంగారెడ్డిలో రూ.250 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించబోతున్నామని పేర్కొన్నారు. మంత్రి మాట్లాడుతున్న సమయంలో.. మా ఆస్పత్రికి ఒక అంబులెన్స్‌ కావాలని ఓ భక్తుడు కోరారు. స్పందించిన మంత్రి రెండు రోజుల్లో పంపిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఖేడ్‌ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, పంచవటి క్షేత్రం పీఠాధిపతి కాశీనాథ్‌బాబా, కాంగ్రెస్‌ పార్టీ జహీరాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఉజ్వల్‌రెడ్డి, టీఎస్‌ఐడీసీ మాజీ చైర్మన్‌ మమ్మద్‌ తన్వీర్‌, నాయకులు భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాంకాల్‌ సుభాష్‌ పాల్గొన్నారు.

#Tags