Skip to main content

Teacher Jobs: సాగని బోధన.. 2 వేలకుపైగా ఖాళీలు..

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లాలో రెండు నెలల పాటు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల హడావుడిగా సాగింది.
Teacher Jobs

దీంతో చాలా చోట్ల పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. దీని ప్రభావం బోధనపై పడింది. అయితే ఆయా ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉండగా ఈ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు మరింత సమయం పట్టనుంది. గతంలో ఖాళీగా ఉన్న పోస్టుల స్థానంలో విద్యా వలంటీర్లను నియమించేవారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం వారిని నియమించడం లేదు.

విద్యార్థులకు విద్యా బోధనలో ఇబ్బందులు తలెత్తకుండా వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఈ మేరకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న దగ్గర నుంచి బదిలీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా ఉమ్మడి జిల్లాలో సుమారు 350 నుంచి 500 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చదవండి: School Education Department: పని సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు

పేటకు ప్రత్యేక పోస్టులు..

ఉమ్మడి జిల్లాలో 2వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి స్థానంలో అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు అనుమతి ఇచ్చింది. ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి కేవలం ఒక్క నారాయణపేటకు 233 మందిని తీసుకునేందుకు ఆదేశించింది.

ఈ భర్తీని త్వరలోనే చేపట్టనున్నట్లు నారాయణపేట డీఈఓ అబ్దుల్‌ఘనీ పేర్కొన్నారు. ఎస్‌ఏ పోస్టులకు బీఈడీ, టెట్‌ వంటి అర్హతలు, ఎస్జీటీ పోస్టులకు డీఎడ్‌, టెట్‌ వంటి అర్హతలు నిర్ధారించారు. స్థానికంగా ఉండే వారికి అవకాశం ఇవ్వనున్నారు. వీరు డీఎస్సీ ద్వారా భర్తీ జరిగే వరకు పని చేయనున్నారు.

చదవండి: Telangana Anganwadi 11000 jobs Notification: గుడ్‌న్యూస్‌ అంగన్‌వాడీలో 11వేల ఉద్యోగాలు

2 వేలకుపైగా ఖాళీలు..

2018లో చివరిసారిగా ప్రభుత్వం టీచర్‌ పోస్టులను భర్తీ చేసింది. ఆ తర్వాత గతేడాది డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది.

తక్కువ పోస్టుల భర్తీకి అనుమతివ్వడంతో అభ్యర్థులు నిరసన బాటపట్టారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 1,131 పోస్టుల భర్తీకి అనుమతించింది. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్‌ 273, పండిట్లు 102, పీఈటీలు 25, ఎస్జీటీలు 584, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో 147 పోస్టులు ఉన్నాయి.

అయితే వాస్తవ ఖాళీలు 2 వేలకు పైగా ఉండటంతో చాలాచోట్ల ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు బోధన కష్టతరంగా మారింది. ఎక్కువగా నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, గద్వాల వంటి ప్రాంతాల్లో సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయులు లేదు.

ఈ ప్రభావం ఎస్సెస్సీ పరీక్షలపై పడే అవకాశం ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యా వలంటీర్లనైనా నియమించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

తెలంగాణ– కర్ణాటక సరిహద్దు గ్రామమైన బోయలగూడెం మండల పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు బోధిస్తున్నారు. ఇందులో 453 మంది చదువుకుంటుండగా కేవలం ఐదుగురు గణితం– 1, ఎస్జీటీ ఉపాధ్యాయులు నలుగురు మాత్రమే ఉన్నారు.

అయితే తెలుగు, హిందీ, సోషల్‌ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు ఎస్జీటీ పోస్టులు, ఇంగ్లిష్‌, జీవశాస్త్రం పోస్టులు ప్రభుత్వం మంజూరు చేయలేదు.

ప్రభుత్వ ఆదేశాలు..

నారాయణపేట జిల్లాలో 545 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ ప్రభావం విద్యా బోధనపై పడొద్దని ప్రభుత్వం 233 అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి అనుమతిచ్చింది. వాటికి అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తాం. మరిన్ని పోస్టుల్లో వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కలెక్టర్‌ అనుమతితో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.

– అబ్దుల్‌ఘనీ, డీఈఓ, నారాయణపేట

కలెక్టర్‌ అనుమతితో..

జిల్లాలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నచోటి నుంచి అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా బదిలీ చేసేందుకు ప్రక్రియ కొనసాగుతుంది. కలెక్టర్‌ అనుమతితో ఈ బదిలీలు చేపడుతాం. జిల్లాలో అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.

– రవీందర్‌, డీఈఓ, మహబూబ్‌నగర్‌
 

Published date : 19 Aug 2024 03:37PM

Photo Stories