Appointment of VCs for 10 Telangana Universities: వర్సిటీలకు నెలాఖరులోగా కొత్త వీసీలు.. మొత్తంగా ఇన్ని దరఖాస్తులొచ్చాయి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు కొత్త ఉప కులపతులను నియమించే ప్రక్రియ ఊపందుకుంది.

వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. వీసీల నియామకాన్ని చేపట్టే అత్యంత కీలకమైన సెర్చ్‌ కమిటీలను కూడా నియమించినట్లు అధికారులు చెప్పారు. ఒక్కో వర్సిటీకి ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈమేరకు విద్యాశాఖ మే 15న‌ వేర్వేరు జీవోలను జారీచేసింది. యూనివర్సిటీల పాలకమండలి నామినీ, ప్రభుత్వ నామినీ, యూజీసీ నామినీలతో సెర్చ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. మూడు, నాలుగు రోజుల్లోనే ఈ సెర్చ్‌ కమిటీలు సమావేశం కానున్నాయి.

చదవండి: Aligarh University VC: అలీగఢ్‌ వర్సిటీలో తొలి మహిళా వీసీగా ఘనత!

ఒక్కో వర్సిటీ వీసీ పోస్టుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను ఈ కమిటీ గవర్నర్‌కు పంపిస్తుంది. అయితే రెండు పర్యాయాలు వీసీలుగా పనిచేసిన వారిని, 70 ఏళ్లు నిండిన వారిని వీసీలుగా నియమించొద్దని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.

యూజీసీ నిబంధనల ప్రకారమే వీసీలను నియమించనుండగా, వీసీలకు పోటీపడే వారి నేపథ్యంపై ఇప్పటికే ఇంటెలిజెన్స్‌ విభాగంతో విచారణ చేయించారు.

కొత్తగా నియమితులయ్యే వీసీలకు న్యాయ, పరిపాలన పరమైన అంశాలపై ఐఐటీలు, ఐఐఎంల పూర్వ డైరెక్టర్లు, ప్రముఖ విద్యావేత్తలతో శిక్షణ ఇప్పిస్తారు. 10 వర్సిటీల వీసీ పోస్టులకు 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేశారు. ఒక్కో ప్రొఫెసర్‌ మూడు, నాలుగు వర్సిటీల వీసీలకు పోటీపడటంతో మొత్తంగా 1,380 దరఖాస్తులొచ్చాయి.

చదవండి: Artificial Intelligence: ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌పై పట్టు సాధించాలి

ఎన్నికల కమిషన్‌ అనుమతి

రాష్ట్రంలోని 10 వర్సిటీ వీసీ పోస్టులు మే 21తో ఖాళీకానున్నాయి. దీనికన్నా ముందే వీసీలను నియమించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే జనవరిలోనే ప్రక్రియను ప్రారంభించింది. కానీ పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారడంతో వీసీల నియామకానికి అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇందుకు మే 14న‌ ఈసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో వీలైనంత త్వరగా నియామక ప్రక్రియనంతా పూర్తిచేసి ఈనెల 21లోపు లేదా మే నెలాఖరులోగా కొత్త వీసీలను నియమిస్తామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. కొత్త వీసీలు వచ్చేలోపు ఐఏఎస్‌ అధికారులను లేదా ఇప్పుడున్న వీసీలను ఇన్‌చార్జి వీసీలుగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.   

#Tags