High Court: స్థానికత నిబంధనను పక్కకు పెట్టి.. దరఖాస్తులు స్వీకరించండి

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల్లో ప్రస్తుతానికి స్థానికత నిబంధనల అంశాన్ని పక్కకు పెట్టి పిటిషనర్ల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది.

నేటితో దరఖాస్తుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో పిటిషనర్లు తమ వద్ద ఉన్న ఫార్మాట్‌లో స్థానికత సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. పిటిషనర్లు తమ పిటిషన్‌ వివరాలను సంబంధిత అధికారులకు ఇవ్వాలని చెప్పింది.

ఈ నెల 24లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుతాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ‘ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల్లో తెలంగాణ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కాలేజీల అడ్మిషన్‌ నిబంధనలు– 2017లోని రూల్‌ 3(ఏ)ను సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌ ప్రగతినగర్‌కు చెందిన కల్లూరి నాగ నరసింహా అభినామ్‌తోపాటు మరో 13 మంది తరఫున న్యాయవాది కొండపర్తి కిరణ్‌ కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

చదవండి: NEET UG Counselling 2024 : ఆగ‌స్టు 14న నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రారంభం.. తాత్కాలిక షెడ్యూల్ విడుద‌ల‌..!

‘ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ గత నెల 19న రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన జీవో 33 చట్టవిరుద్ధం. జీవో ప్రకారం విద్యార్థులు 9, 10తోపాటు ఇంటర్‌ స్థానికంగా చదివి ఉండాలి. పరీక్షలు ఇక్కడే రాయాలి. ఇది చట్టవిరుద్ధం. స్థానికతపై కొత్త రూల్స్‌ అంటూ వైద్యారోగ్య శాఖ జారీ చేసిన ఈ జీవోను కొట్టివేయాలి’ అని విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సుజోయ్‌పాల్, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం బుధవారం ఇరుపక్షాల వాద నలు వినింది. ప్రస్తుతానికి స్థానికత నిబంధనను పక్క కుపెట్టి దరఖాస్తులు స్వీకరించాలని, తుది తీర్పునకు లోబడి చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

#Tags