10th Class: ‘అంతర్గత’ మార్కులు ఇష్టారాజ్యం!
- టెన్త్ విద్యార్థుల అంతర్గత మార్కుల పరిశీలన పూర్తి
- తనిఖీల్లో వెలుగుచూసిన విస్తుబోయే నిజాలు
- ఇష్టానుసారంగా మార్కులు వేసినట్లు గుర్తింపు
- పలు పాఠశాలల విద్యార్థుల రికార్డులు వెనక్కి పంపిన అధికారులు
Also read: 10th Class Exams: ఆ రోజుల్లో పది పరీక్షలు ఇలా ఉండేవి.. టెన్త్ పాసైతే..
విద్యార్థి భవిష్యత్‌ను నిర్దేశించి పదో తరగతి పరీక్షలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు విద్యాశాఖ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని 17 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 96 ప్రైవేట్ పాఠశాలల్లో అంతర్గత మార్కుల పరీక్షలు చేపట్టారు. 22 ప్రత్యేక తనిఖీ బృందాలు ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల మార్కులు, రికార్డులను పరిశీలించారు. తనిఖీల్లో పలు పాఠశాలల్లో విద్యార్థులకు మార్కులు ఇష్టానుసారంగా వేసినట్లు తేలింది.
బంజారాహిల్స్: టెన్త్ విద్యార్థులకు పలుచోట్ల అత్యుత్సాహంతో అత్యధికంగా ఏ1 గ్రేడ్‌లు ఇవ్వగా, మరో వైపు విద్యార్థులు రాయకున్నా అక్కడ ఉపాధ్యాయులు మాత్రం చక్కగా మార్కులు వేసినట్లు బహిర్గతం అయింది. ప్రతి పేపర్ వంద మార్కులు ఉండగా పబ్లిక్ పరీక్షల్లో 80 మార్కులు కేటాయిస్తారు. మరో 20 మార్కులు విద్యార్థుల అంతర్గత ప్రావిణ్యాల ఆధారంగా పాఠశాలలు కేటాయించే మార్కులను విద్యాశాఖ కలుపుతుంది.
- ఆయా విద్యాసంస్థలు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ ఎఫ్‌ఏ పేరిట ప్రతి విద్యార్థి చేసే ప్రాజెక్ట్ వర్క్, పాఠశాలలు నిర్వహించే రాత పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా వీటిని కేటాయించారు.
- వీటితో సంబంధం లేకుండా విద్యార్థి రాత, ప్రాజెక్ట్ వర్క్ చూడకుండానే అత్యధికంగా మార్కులు వేశారన్నది ఈ తనిఖీల్లో వెల్లడైంది.
- గతేడాది పలు పాఠశాలల్లో విద్యార్థులకు అత్యధికంగా మార్కులు రావడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో విద్యాశాఖాధికారులు క్షేత్ర స్తాయిలో ప్రత్యేక బృందాలతో ఈ సారి వాస్తవ మార్కుల పరిశీలనకు ఆదేశాలు జారీ చేసింది.
- ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, షేక్‌ఫేట, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్, వెంగళ్‌రావునగర్, ఎర్రగడ్డ, బోరబండ, అమీర్‌ఫేట సనత్‌నగర్ డివిజన్ల పరిధిలో ఒక్కో బృందానికి అయిదు నుంచి ఏడు పాఠశాలలను అప్పగించారు.
- జోన్ పరిధిలో జరిగిన తనిఖీల్లో ర్యాంకుల కోసమే తప్ప విద్యార్థులకు కనీస సామర్థ్యాలు అందించేందుకు కొన్ని పాఠశాలలు విఫలమైనట్లుగా తేలింది.
- తనిఖీ బృందాలు సేకరించిన నివేదికల ఆధారంగానే ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్‌లో మార్కులను నమోదు చేశారు. చాలా పాఠశాలలకు చెందిన అంతర్గత మార్కులను తనిఖీ బృందాలు తిప్పి పంపాయి. సరిగ్గా మార్కులు వేసుకొని రండి అంటూ ఆదేశించారు.
Also read: 10th Class Question Paper Leaked: ప్రశ్నాపత్రాల లీకేజీ.. పాపమంతా వీరిదే..
తనిఖీల్లో తేలిన విషయాలివీ...
విద్యార్థులకు సామర్థ్యం లేకున్నా ర్యాంకుల కోసం చాలా పాఠశాలలు తమ విద్యార్థులకు 20 మార్కులను కేటాయించాయి.
ఇప్పటికీ బట్టీ విధానాన్ని కొనసాగించడం, క్షేత్ర స్థాయిలో వెళ్లి పాజెక్ట్‌లను రూపొందించకపోవడాన్ని గుర్తించారు.
రికార్డులను తయారు చేయడంలో స్వయంగా చిత్రాలు గీయకపోవడం జిరాక్స్ పత్రాలు ఉపయోగించారు.
చాలా మంది జవాబు పత్రాలు ఒకేలా ఉండటంతో చూచి రాతను ప్రోత్సహించినట్లుగా గుర్తించారు.
ఇంకొందరు విద్యార్థులు ఇతరులతో రాయించినట్లుగా తేలింది. కొందరు విద్యార్థులకు ఆయా సబ్జెక్టులలో రికార్డులు రాయకున్నా ఎక్కువ మార్కులు కేటాయించారు.
ఈ విషయాలను తనిఖీ బృందాలు స్కూల్ యాజమాన్యాలను ప్రశి్నంచగా నీళ్లు నమిలారు.
Also read: TSPSC Group 1 Notification: 503 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ప్రాక్టీస్ టెస్ట్స్, గైడెన్స్ వివరాలు