BA Honours: బీఏ ఆనర్స్‌కు పెరిగిన ఆదరణ

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్‌ కోర్సులకు విద్యార్థుల నుంచి మంచి ఆదరణ కన్పిస్తోంది.
బీఏ ఆనర్స్‌కు పెరిగిన ఆదరణ

నాలుగు కళాశాలల్లో మొత్తం 320 సీట్లు ఉంటే, ఇప్పటివరకు 285 మంది దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల కౌన్సెలింగ్‌లో 120 సీట్లు కేటాయించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఆక్టోబర్‌ 5వ తేదీ వరకు ఉన్న ప్రవేశాల గడువును పొడిగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆర్ట్స్‌ గ్రూపులకు ఆదరణ తగ్గుతుండటం, ఆనర్స్‌ కోసం రాష్ట్ర విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లడాన్ని గమనించి కొత్తగా బీఏ ఆనర్స్‌లో రాజనీతి శాస్త్రం, ఆర్థికశాస్త్రంను ప్రవేశపెట్టారు. తొలిదశలో కోటి ఉమెన్స్ కాలేజ్, నిజామ్‌ కాలేజ్, సిటీ కాలేజ్, బేగంపేట ఉమెన్స్ కళాశాల్లలో వీటిని ప్రవేశపెట్టారు. వాస్తవానికి రెండు కాలేజీల్లోనే 2021లో అమలు చేసి, వచ్చే సంవత్సరం మరికొన్ని కాలేజీలకు విస్తరించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. విద్యార్థుల నుంచి ఒత్తిడి పెరగడంతో మరో రెండు కాలేజీల్లో ప్రారంభించారు. ఆనర్స్‌ కోరుకునే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కోర్సులను నాణ్యతతో నిర్వహించాలని భావిస్తున్నారు. అవసరమైన పాఠ్య ప్రణాళికను రూపొందించేందుకు ఉన్నతస్థాయి కసరత్తు జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో కోర్సు విధివిధాలు ఏ విధంగా ఉన్నాయనేదానిపై ఇప్పటికే ఓ నివేదిక రూపొందించారు. ఆనర్స్‌ కోర్సులను తరగతి బోధన కన్నా, సామాజిక అవగాహన పెంచేలా రూపొందించాలని భావిస్తున్నారు. వివిధ రంగాల్లో నిపుణుల చేత, రాజకీయ ప్రముఖుల చేత అతిథి బోధన చేయించాలని నిర్ణయించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏయే అంశాలపై ఎవరెవరిని ఆహా్వనించాలో త్వరలో ఓ నిర్ణయానికి వచ్చే వీలుందని, నెలవారీగా క్లాసుల టైంటేబుల్‌ ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. 

#Tags