TS High Court: విద్యాహక్కు చట్టం అమలు ఏ దశలో ఉంది

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిల్లల ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం–2009ను రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎందుకు అమలుచేయడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అసలు చట్టం అమలు ఇప్పుడు ఏ దశలో ఉందో పూర్తి వివరాలు తెలుసుకొని చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

‘రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. చట్టంలో 121 సీ ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంది. అలా ఎక్కడా జరగడం లేదు.

దీనిని ప్రభుత్వం కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలి’అని కోరుతూ న్యాయవాది యోగేష్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం జూన్ 18న‌ విచారణ చేపట్టింది.

చదవండి: High Court Recruitment 2024 Notification Out: డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. హైకోర్టులో ఉద్యోగాలు

ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో ప్రైవేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇస్తున్నట్టు ఎక్కడా లేదని, రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు ఎంత వరకు వచ్చి0దో చెప్పాలని ఏఏజీ ధర్మాసనం ఆదేశించింది. 

కాగా, విద్యాహక్కు చట్టంపై తమకు సాయం చేసేందుకు అమికస్‌గా నియమితులైన సీనియర్‌ న్యాయవాది సునీల్‌ బి.గణు సేవలను ధర్మాసనం ప్రశంసించింది.

మరో పిటిషన్‌ విచారణ సందర్భంగా ప్రభుత్వ హాస్టళ్లలో బాత్‌రూమ్‌లు, టాయిలెట్లు, పరుపులు, దిండ్లు లాంటి ఏర్పాట్లపై కూడా వివరాలు అందజేయాలని చెబుతూ, విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

#Tags