Skip to main content

School Students Bags news: లేత భుజం.. మోత భారం

School Students Bags Latest news  Burden of Books  Government regulations on textbooks
School Students Bags Latest news

కడప ఎడ్యుకేషన్‌: అడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో పుస్తకాల భారం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఏటా పై తరగతికి వెళ్తుంటే... పుస్తకాల సంఖ్య కూడా దానికి తగ్గట్టుగానే పెరుగుతోంది.

ప్రైవేటు స్కూళ్లలో వాటిని మోస్తూ పిల్లలు పడే బాధలు అన్నీఇన్నీ కావు. బ్యాగు నిండా పుస్తకాలతో నాలుగైదు అంతస్తుల మెట్టు ఎక్కేందుకు నానా తంటాలు పడుతున్నారు. పుస్తకాల భారం తగ్గించాలని 2006లో చట్టం చేసినా అమలుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు.

ప్రైవేటుగానూ కొనుగోలు..

ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు విధిగా ప్రభుత్వం ముద్రించిన పాఠ్యాపుస్తకాలతోనే విద్యార్థులకు పాఠాలు బోధించాలి. స్టేట్‌, సీబీఎస్‌ఈ సిలబస్‌ మినహా మరే ఇతర పాఠ్యాంశాలను బోధించరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఐఐటీ కోచింగ్‌, స్మార్ట్‌ క్లాసులు, రివిజన్‌ టెస్టుల పేరుతో సాధారణ పాఠ్యపుస్తకాలతో పాటు ప్రైవేటు ముద్రణ సంస్థల పుస్తకాలను కొనుగోలు చేయాల్సిందిగా తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

అనవసరమైనవే ఎక్కువ..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరు సబ్జెక్టులకు ఆరు పాఠ్యపుస్తకాలు, మరో ఆరు నోటు బుక్స్‌, కాపీరైట్‌కు సంబంధించి నాలుగు పుస్తకాలు ఉంటాయి. ప్రైవేటు పాఠశాలలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తల్లిదండ్రులపై ఫీజులు, విద్యార్థులపై పుస్తకాల భారం మోపుతున్నాయి.

ఒకటో తరగతి చదివే విద్యార్థికి సాధారణంగా 14 పుస్తకాలు ఉండాలి. కానీ 32 నుంచి 34 ఉంటున్నాయి. ప్రింటెడ్‌ కాపీరైట్‌, ప్రింటెడ్‌ కలర్‌ కంపోజింగ్‌, హోం స్కూల్‌ ఎక్సర్‌సైజ్‌, రైటింగ్‌ ఇంప్రూమెంట్‌, లాంగ్వేజ్‌ డిక్షనరీ, డ్రాయింగ్‌ తదితరాలను అదనంగా జోడిస్తున్నాయి.

అనవసర పుస్తకాలు మోస్తున్న చిన్నారుల వెన్నెముకపై తీవ్రమైన ప్రభావం పడి ఎదుగుదల సక్రమంగా జరగకపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో 2845 ప్రభుత్వ,ప్రైవేట్‌ పాఠశాలల్లో 3,32,224 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో 119684 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 41085 మంది, ఉన్నత పాఠశాలల్లో 1,57,211 మంది, హై స్కూల్‌ ప్లస్‌లో 14244 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 1,82,137 మంది విద్యార్థులు చదువుతున్నారు.

నిబంధనలు బేఖాతరు..

ఏటా డీవీఓ ద్వారా వార్షిక విద్యా ప్రణాళిక విడుదలవుతుంది. పాఠ్యంశాలు, పరీక్ష, సాంస్కృతిక, ఆరోగ్య పరిరక్షణ కింద పలు అంశాలతో పట్టిక రూపొందించాల్సి ఉన్నప్పటికి అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.

ప్రైవేటు పాఠశాలల కోసం ప్రత్యేక నిబంధనలతో పట్టిక విడుదల చేసి ఆయా పాఠశాలల్లో రోజువారీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిరంతరం తనిఖీలు చేపట్టాల్సి ఉండగా రక్షేతస్థాయిలో అమలు కావడం లేదు.

వైద్య నిపుణుల సూచనలు..

● పిల్లల్లో సాధారణంగా 15 ఏళ్ల లోపే శరీరంలో వివిధ మార్పులు చోటు చేసుకుంటాయి. పాఠశాలల వయసులో మోయాల్సిన భారం కంటే అధిక బరువు మోయడం వల్ల స్కోలియోసిస్‌ (వెన్నెముక ఒకవైపు వంగి పోవడం) వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

● అధిక బరువుతో కూడిన పెద్ద సైజు కాకుండా పుస్తకాలు సరిపడా తేలికై నవి కొనుగోలు చేయాలి.

విద్యార్థి బరువులో పుస్తకాల బరువు 15 శాతానికి మించరాదు. ఉదాహరణకు 20 కిలోల బరువున్న విద్యార్థి 3 కిలోలకు మించి మోయరాదు.

● ఎక్కువ పుస్తకాలున్న పక్షంలో ఉపాధ్యాయుల సలహా మేరకు ఏ రోజున అవసరమైన పుస్తకాలను ఆ రోజున తీసుకెళ్లేలా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి.

● బ్యాగును రెండు భుజాలపై సమాన బరువుపడే రీతిలో తగిలించుకోవాలి. ఒకవైపు తగిలించుకుంటే భుజం, మెడ నొప్పి వస్తాయి.

● నిత్యం వ్యాయామం చేయడం వల్ల శారీరకపరమైన ఇబ్బందులు అధిగమించవచ్చు.

ఏటా పెరుగుతున్న పుస్తకాలు

నిర్దేశించినవి కొనాల్సిందేననిపాఠశాలల ఒత్తిడి

వయస్సుకు మించి భారం

ఎదుగుదలకు ఆటంకం

విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలుతలెత్తే ప్రమాదం

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయాలి

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడమే నిజ మైన విద్య. అది పుస్తకాల వల్ల రాదు. సర్వతోముఖ ప్రక్రియల ద్వారానే విద్యార్థుల్లో సృజనాత్మకతలు వెల్లి విరుస్తాయి. అందులో భాగమే నో స్కూల్‌ బ్యాగ్‌ డే. ఆ రోజు ప్రత్యేకంగా సృజనశీలత కార్యక్రమాలు నిర్వహించాలి. – ఉండేల నాగమునిరెడ్డి, రిటైర్డ్‌ డిప్యూటీ డీఈఓ. కడప

తల్లిదండ్రుల్లో మార్పు రావాలి

తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు రావాలి. పుస్తకాలు ఎక్కువగా ఉంటే తమ పిల్లలు గొప్పగా చదువుకుంటారని అనుకుంటున్నారు. అలాంటి పాఠశాల కూడా గొప్పదని భావిస్తున్నారు. మోసే పుస్తకాలకు చదివే చదువులకు సంబంధమే ఉండదు. ఇటీవల క్వశ్చన్‌ బ్యాంకులనూ తీసుకెళ్తున్నారు. ఇవి మరింత భారంగా మారుతున్నాయి. –ఓ.వెంకటేశ్వరెడ్డి, సైకాలజిస్టు, కడప

లేత భుజం.. మోత భారం

Published date : 25 Jun 2024 09:52AM

Photo Stories