కళాశాలల భవనాలు శిథిలాల్లో చదివేదెలా?

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఎప్పుడు కూలుతాయో తెలియక విద్యార్థులు, అధ్యాపకులు క్షణక్షణం భయం భయంగా గడుపుతున్నారు. ఇక వర్షం వస్తే గోడలకు చెమ్మపట్టి మరింత దెబ్బతింటున్నాయి. నిర్వహణలేక మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి.

జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా, వాటిలో కొత్తగూడెం, టేకులపల్లి, పినపాక, బూర్గంపాడు తదితర కళాశాలల భవనాలు మరీ అధ్వానంగా మారాయి. దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో శిథిలావస్థకు చేరాయి. కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి మొత్తం 900 మంది విద్యార్థులు ఉన్నారు.

ఈ కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులతోపాటు ఒకేషనల్‌, పారామెడికల్‌ కోర్సులు బోధించే తరగతి గదుల పరిస్థితి భయంకరంగా ఉంది. పైకప్పునకు పాకురు పట్టింది. పైన పిచ్చి మొక్కలు మొలిచాయి. గోడలకు పగుళ్లు వచ్చి, వర్షాలకు తడిచి చెమ్మ పట్టి ఉన్నాయి.

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోనని అధ్యాపకులు సైతం ఆందోళన చెందుతున్నారు. స్టాఫ్‌ రూమ్‌లు సైతం అదే పరిస్థితిలో ఉండటంతో భయంభయంగా కాలం గడుపుతున్నారు. కళాశాలకు ప్రహరీ లేకపోవడంతో రాత్రి వేళల్లో గేదెలు కళాశాల ఆవరణలోకి ప్రవేశించి అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. ఆకతాయిలు కూడా ఆవరణలోకి ప్రవేశించి ఆగమాగం చేస్తున్నారు.

చదవండి: Encouraging Students: చదువుతో ఉన్నత స్థాయికి చేరాలి..

మరుగుదొడ్లు అధ్వానం..

కొన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మరుగుదొడ్లు పని చేయడంలేదు. దీంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని కళాశాలల్లో నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. టాయిలెట్స్‌కు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

తద్వారా విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. కళాశాలల ప్రిన్సిపాల్స్‌ నిర్లక్ష్యం వీడి టాయిలెట్స్‌ నిర్వహణ సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

పని చేయని మరుగుదొడ్ల స్థానంలో కొత్తవి నిర్మించేలా అధికారులు చొరవ తీసుకోవాలని పేర్కొంటున్నారు. జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారులు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని కళాశాలలకు నూతన భవనాలు, మరుగుదొడ్లు నిర్మించాలని, సుజాతనగర్‌, అన్నపురెడ్డిపల్లి మండల్లాల్లో కళాశాలలు ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు.

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల తరగతి గదులు కొన్ని శిథిలావస్థకు చేరాయి. వాటిని వినియోగించడంలేదు. బాగున్న గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రతి కళాశాలలో టాయిలెట్లు పని చేసేలా చూడాల్సిన బాధ్యత ప్రిన్సిపాళ్లపై ఉంది. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం.

–హెచ్‌.వెంకటేశ్వరరావు, ఇంటర్మీడియట్‌

నోడల్‌ అధికారి కాగితాలకే పరిమితం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు, అధ్యాపకులు ఏళ్లతరబడి అవస్థలు పడుతున్నారు. ప్రసుత్తం జిల్లాలో మొత్తం 14 కళాశాలు ఉండగా, సుజాతనగర్‌, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో నూతన కళాశాలలు నిర్మించాలని రెండేళ్ల క్రితం ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్ణయించి ప్రతిపాదనలు సైతం తీసుకుంది. కానీ ఇంత వరకు ఆ కళాశాలలకు మోక్షం కలుగలేదు. దీంతో ఆ మండలాల్లోని విద్యార్థులు ఇంటర్మీడియట్‌ చదివేందుకు దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడి ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడంలేదు.

#Tags