Free Electricity: ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌.. సరఫరా చేయాలా.. లేదా.. కోరే వెసులుబాటు వీరికి మాత్రమే

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ‌ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు కొత్త పథకాన్ని అమల్లోకి తెస్తూ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ సెప్టెంబర్ 5న‌ ఉత్తర్వులు జారీ చేశారు. సకాలంలో నిధులు విడుదల కాక సర్కారీ బడులు, కళాశాలలు కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  

ప్రత్యేక ఆన్‌లైన్‌ వెబ్‌ పోర్టల్‌ 

సర్కారీ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు ప్రత్యేక ఆన్‌లైన్‌ వెబ్‌ పోర్టల్‌ను రూపొందించనున్నాయి. విద్యాసంస్థలు ఏ ప్రభుత్వ శాఖ పరిధిలోకి వస్తే ఆ శాఖ విభాగాధిపతి (హెచ్‌ఓడీ)కి ఆ పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యే సదుపాయం కల్పిస్తాయి.

చదవండి: MBBS, BDS Admissions: స్థానికంగా ఉంటే అనుమతించండి
తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల వివరాలను వెబ్‌ పోర్టల్‌లో చేర్చేందుకు లేదా తొలగించేందుకు అవసరమైతే సవరణలు (యాడ్‌/డిలీట్‌/ఎడిట్‌) చేసేందుకు హెచ్‌ఓడీలకు అవకాశం ఉంటుంది. అవసరాన్నిబట్టి ఆయా విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని లేదా నిలిపివేయాలని కోరే వెసులుబాటు వారికి ఉంటుంది.  

ఇన్‌చార్జీలకు ‘ఉచిత’బిల్లులు 

విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేసి ప్రతినెలా క్రమం తప్పకుండా మీటర్‌ రీడింగ్‌ తీసి ఇన్‌చార్జి అధికారికి బిల్లులు జారీ చేస్తారు. దీనివల్ల ఉచిత విద్యుత్‌ దుర్వినియోగం కాకుండా వారు చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఎన్ని యూనిట్ల విద్యుత్‌ వాడారు? ఎంత బిల్లు వచ్చిందనే వివరాలు అందులో ఉండనున్నాయి. అయితే ఆ బిల్లులను సదరు పాఠశాల/కళాశాల/విద్యాసంస్థ చెల్లించాల్సిన అవసరముండదు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించిన బిల్లులను సంబంధిత విభాగాధిపతులు తమ శాఖ బడ్జెట్‌ నిధుల నుంచి ప్రతి నెలా డిస్కంలకు చెల్లించనున్నారు.

చదవండి: Head Master Uppalaya: ఏ స్కూల్‌కు వెళ్లినా రూపురేఖల మార్పు
సంబంధిత విభాగాధిపతులు బడ్జెట్‌ కేటాయింపుల నుంచి విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికి వీలుగా పోర్టల్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖతో సైతం అనుసంధానించనున్నారు. విభాగాధిపతులు తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల విద్యుత్‌ వినియోగం, బిల్లుల మొత్తం, గత కాలానికి సంబంధించిన వినియోగం, జారీ అయిన బిల్లులు, జరిపిన చెల్లింపులు, చెల్లించాల్సిన బకాయిల వంటి సమాచారంతో కూడిన నివేదికలను వెబ్‌ పోర్టల్‌లో చూసుకోవడానికి వీలుండనుంది. విద్యాసంస్థ, మండలం, జిల్లావారీగా సైతం ఈ నివేదికలు ఆన్‌లైన్‌లో జనరేట్‌ కానున్నాయి.   

#Tags