Ramagiri Dilip Kumar: విద్యార్థులకు వినూత్న బోధన..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రామగిరి దిలీప్‌కుమార్.. ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్ టీచర్) బోధనలో తనదైన ముద్ర వేస్తున్నారు. గత 13ఏళ్లుగా మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణం క్లబ్ రోడ్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బోధించారు. గత జూలైలో ముల్కల్లగూడ స్కూల్‌కు బదిలీ అయ్యారు.
విద్యార్థులూ మూకుమ్మడిగా టీసీ తీసుకుని సారు వెంటే మేము అంటూ కొత్త బడిలో చేరిపోయారు. ఏకంగా 105మంది విద్యార్థులు వెళ్లారంటే సారు బోధన తీరును అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత స్కూల్ కంటే దూరమైనా విద్యాబోధన నచ్చి విద్యార్థులు ఆటోలో వెళ్లి వస్తున్నారు.
దిలీప్‌కుమార్ మొదట కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కోపుగూడ, మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొమ్ముగూడెంలో పని చేశారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో చిన్నారులు బడికి తక్కువగా వచ్చేవారు. దీంతో గ్రామాల్లో పర్యటించి విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెంచేలా చేశారు.
చదవండి: Junagari Vasantha: మూత‘బడి’ని తెరిపించి.. ఇంటింటికి వెళ్లి విద్యార్థులను బడిలో చేర్పించారు
ఆర్థికసాయం, స్కూల్ సౌకర్యాల పెంపునకు కృషి చేశారు. కనీస సౌకర్యాలు లేని చోట గిరిజన విద్యార్థులకు చదువు చెప్పారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇటీవల రూ.4లక్షల వ్యయంతో ప్రొజెక్టర్లు తెచ్చి సర్కారు స్కూల్‌లోనూ డిజిటల్ బోధన చేస్తున్నారు.
నిరుపేద విద్యార్థులకు చదువు నేర్పాలనే తపనతో స్కూల్‌కు గంట ముందే వెళ్లి గంట ఆలస్యంగా వస్తుంటారు. 4వ, 5వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా గురుకుల, నవోదయ ప్రవేశ పరీక్షల్లో సీటు వచ్చేలా చేశారు. టీచర్‌పై తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడి 11మంది విద్యార్థులు ఉన్న సంఖ్య ఆయన రాకతో ప్రస్తుతం 250కి చేరింది.
ఎంతో కొంత మేలు చేయాలని..
మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది నిరుపేద విద్యార్థులు ఉన్నారు. వారికి ఎంతో కొంత మేలు చేస్తే చదువులో రాణిస్తారు. బోధన వృత్తిలో ఉన్నప్పుడు పేద విద్యార్థులకు ఏదైనా చేయాలనేదే నా చిన్న ప్రయత్నం.
–రామగిరి దిలీప్‌కుమార్, ఎస్జీటీ