గురుకుల పనివేళల్లో మార్పులు

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని విద్యా సంస్థలు ఇక నుంచి... ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పనిచేయనున్నాయి.
సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్

పనివేళలను మారుస్తూ సొసైటీ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ ఆగస్టు 1న ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు బోధన జరిగేది. ఇక నుంచి ఉదయం ఒక గంట ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయి వినతులు, పరిస్థితుల మేరకే నిర్ణయం తీసుకున్నామన్నారు. మారిన పనివేళలకు అనుగుణంగా టైమ్‌టేబుల్‌ ఖరారు చేసి విడుదల చేశారు.

చదవండి: గురుకులాల్లో అధ్యాపకులకు దరఖాస్తులు.. చివ‌రి తేదీ ఇదే..

విద్యార్థుల కోణంలో...

ఎస్సీ గురుకుల సొసైటీ పనివేళల్లో మార్పులు 2018–19 విద్యా సంవత్సరంలో జరిగాయి. ఎక్కువ సమయం బోధన, అభ్యసన కార్యక్రమాలు నిర్వహించాలని పనివేళలను ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4.30వరకు నిర్దేశించారు. తరగతుల నిర్వహణ ముందుకు మారడంతో అందుకు అనుగుణంగా విద్యార్థులు సన్నద్ధం కావడం ఆలస్యమవుతోంది. టాయిలెట్లు పరిమిత సంఖ్యలో ఉండటం, డైనింగ్‌ హాల్‌ విస్తీర్ణం తక్కువగా ఉండటంతో స్నానాలు, ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ విషయంలో జాప్యం జరుగుతోంది. దీంతో విద్యార్థులు మొదటి పీరియడ్‌కు ఆలస్యంగా వస్తున్నారు. ఈ అంశాన్ని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు సైతం పలుమార్లు సొసైటీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎట్టకేలకు స్పందించిన యంత్రాంగం పనివేళల్లో మార్పు చేసింది. విద్యా సంస్థల పనివేళల మార్పుపై టీఎస్‌ యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం(టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ) అధ్యక్షుడు సీహెచ్‌ బాలరాజు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

చదవండి: కొత్తగా 86 గురుకుల జూనియర్ కాలేజీలు

#Tags