Private Schools: ప్రైవేట్‌ పాఠశాలల్లో పుస్తకాల దందా

Private Schools: ప్రైవేట్‌ పాఠశాలల్లో పుస్తకాల దందా

భైంసా: ప్రైవేట్‌ పాఠశాలల్లో పుస్తకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. నర్సరీ, యూకేజీ మొదలు పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులే కాకుండా స్టేషనరీ, యూనిఫాంలు కూడా పాఠశాల ఆవరణలోనే విక్రయిస్తున్నారు. మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు సమీపంలో గదులను అద్దెకు తీసుకుని పుస్తకాల దందా సాగిస్తున్నారు. ఏటా ఇదే తంతు జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన సందర్భాల్లో తనిఖీలు చేసి నామమాత్ర చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆయా ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు షరామామూలే అన్నచందంగా దందా సాగిస్తున్నాయి. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంలు, స్టేషనరీ విక్రయించవద్దు. కానీ, నో ప్రాఫిట్‌–నో లాస్‌ నిబంధన సాకుతో పాఠశాలల ఆవరణలోనే కొన్ని యాజమాన్యాలు తమ పాఠశాలల పేరు ముద్రించిన పాఠ్య, నోటు పుస్తకాలు విక్రయిస్తున్నాయి.

Also Read:  హైకోర్టు ఫైర్.. ప్రైవేట్​ స్కూళ్లలో పేద పిల్లలకు 25% సీట్లు ఎందుకు ఇవ్వ‌డం లేదు..?

వేలల్లో ధరలు

ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే పిల్లలు తప్పనిసరిగా తమ పాఠశాలల్లోనే విక్రయించే పుస్తకాలు కొనుగోలు చేయాలని సూచిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు మారు మాట్లాడకుండా అక్కడే కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు మార్కెట్‌లో ఎక్కడా లభించని పాఠ్య పుస్తకాలనే విక్రయిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు చేసేది లేక వారు చెప్పిన ధరకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇదే అదనుగా ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకు సైతం వేల రూపాయలు తీసుకుని పాఠ్య పుస్తకాలు అంటగడుతున్నారు. అవసరమున్నా లేకున్నా టై, బెల్టు, ఐడెంటిటీ కార్డు, డైరీల పేరిట అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

అడిగేవారు లేరని..

ప్రైవేట్‌ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ విక్రయాలతోపాటు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నారు. అధిక ఫీజులకు తోడు అడ్మిషన్‌ఫీజు కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ఈ విషయం బహిరంగ రహస్యమే అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదుకు వెనుకాడుతుండడంతో ఇదే అలుసుగా భావిస్తున్న యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల వ్యాపారం చేస్తున్నాయి. ఏటా విద్యార్థి సంఘాలు ప్రైవేట్‌ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల విక్రయం, అధిక ఫీజుల వసూలుపై ఆందోళన చేపడుతున్నా పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలు పాటించేలా చూడాలని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

 

#Tags