Sumit Sunil IPS: డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తూనే.. ఐపీఎస్‌ అయ్యానిలా..

డాక్టర్, పోలీసు.. ప్రజా సేవకు అవకాశం ఉన్న వృత్తులు. అందుకే ఆ రంగాలంటే చాలా ఇష్టం. ఎంబీబీఎస్‌ పూర్తి చేసి డాక్టర్‌గా సేవలందిస్తూనే ఐపీఎస్‌ అయ్యా..అని డీసీపీ–1గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గరుడ సుమిత్‌ సునీల్‌ అన్నారు. సాక్షితో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..
Garud Sumit Sunil, Visakhapatnam City DCP1

ప్రకాశం జిల్లాలో ట్రైనీగా పనిచేస్తున్నప్పుడు..
జీవితంలో మనకు తెలియకుండా జరిగే తప్పులు కొన్నైతే.. భాష రాకపోతే జరిగే పరిణామాలు ఒక్కోసారి ఇబ్బంది పెడుతుంటాయి. తాను మహారాష్ట్రలో పుట్టడంతో ఆంగ్లం, హిందీ భాషలే బాగా వచ్చు. వైద్య వృత్తి చేస్తూ ఐపీఎస్‌ అయ్యాను. దాదాపు అంతా ఆంగ్లంనే బోధన.. పైగా నా స్నేహితులు కూడా ఇంగ్లిష్, హిందీ వచ్చినవాళ్లే.. దీంతో మిగిలిన భాషలు నేర్చుకునే అవకాశం రాలేదు.. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో ట్రైనీగా పనిచేస్తున్నప్పుడు ఓ ఎస్‌ఐ పనితీరు బాగోలేదని  ఫిర్యాదు(తెలుగులో) వచ్చింది.

చేసిన పొరపాటు గుర్తించానిలా..
అయితే తెలుగు రాకపోవడంతో ఏ ఎస్‌ఐ మీద ఫిర్యాదు వచ్చిందో అతడికే విచారించమని ఫార్వర్డ్‌ చేశా.. తరువాత ఆ ఫిర్యాదును ఇంగ్లిషులోకి తర్జుమా చేసి చెప్పాలని సహచర ఉద్యోగికి చెప్పగా. .చేసిన పొరపాటు గుర్తించా.. ఆరోజే డిసైడయ్యా.. తెలుగు కచ్చితంగా నేర్చుకోవాలని.  ఇప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నాను. గ్రేహౌండ్స్‌ అసల్ట్‌ కమాండర్‌గా, విశాఖ రేంజ్‌ పరిధిలో నర్సీపట్నం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్‌ఈబీ ఏఎస్పీగా ఓఎస్‌డీగా, శ్రీకాకుళం ఏఎస్పీగా, కాకినాడ ఏపీఎస్పీ మూడవ బెటాలియన్‌ కమాండెంట్‌గా పనిచేశా.. దీంతో తెలుగు రాయడం, చదవడం బాగా వచ్చింది.
 
ఎవరైనా ఫోన్‌ చేస్తే..
పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్‌ నేరాలు కూడా రోజు రోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన మూడేళ్లలో నగరంలో సైబర్‌ నేరాలు పరిశీలిస్తే..ఆన్‌లైన్‌లో రుణాలు, ఉద్యోగాలు, ఆకర్షణీయమైన ఆఫర్లు, లక్కీడ్రాల పేర్లతో అధిక శాతం మంది యువతే మోసపోతున్నారు. అలాగే బ్యాంకు తరహా మోసాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. బ్యాంకుల నుంచి అని ఎవరైనా ఫోన్‌ చేస్తే ఎవరూ నమ్మవద్దు. బ్యాంకు అధికారులు వ్యక్తిగత సమాచారం ఎట్టిపరిస్థితుల్లో అడగరు. ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. 

ఇక్కడ పరిస్థితులకు..
నగర డీసీపీ–1గా బాధ్యతలు స్వీకరించి కొద్ది రోజులు అవుతోంది. ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడ్డా. ఇప్పటికే పలువురు తమ తమ సమస్యలు, వినతులు ఇస్తున్నారు. స్పందన కు వచ్చిన ప్రతి సమస్య త్వరితగతిన పరిష్కరించేందుకు కృషిచేస్తా. ప్రతి సోమవారం స్పందనలో ప్రజలు తమ తమ సమస్యలను చెప్పుకోవచ్చు. అంతే కాకుండా ప్రతి రోజు ప్రజలు డీసీపీ–1 కార్యాలయంలో సమస్యలు చెప్పుకోవచ్చు.

#Tags