UPSC Civils Ranker Success Story : ప‌ట్టు ప‌ట్టా.. సివిల్స్‌లో కొలువు కొట్టానిలా.. ఇప్పటి వరకు 8 సార్లు..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇటీవ‌లే విడుద‌ల చేసిన సివిల్స్ ఫైన‌ల్‌ ఫ‌లితాల్లో ఎంద‌రో పేదింటి బిడ్డ‌లు త‌మ స‌త్తాచాటారు. ఈ ఫ‌లితాల‌ల్లో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. తెలంగాణ‌లోని షాద్‌నగర్‌ వాసి శశికాంత్ సివిల్స్‌లో సత్తా చాటాడు. ఈ నేప‌థ్యంలో శశికాంత్ స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామ పరిధిలో చాకలిదాని తండాకు చెందిన రాములు నాయక్‌, సీతమ్మ దంపతుల పెద్దకుమారుడు శశికాంత్‌. తండ్రి రాములు నాయక్‌ హాస్టల్‌లో వార్డెన్‌గా పని చేస్తూ షాద్‌నగర్‌ పట్టణంలోని విజయ్‌నగర్‌ కాలనీలో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. ఆయన 2008లో అకస్మాత్తుగా మృతి చెందడంతో అప్పటి నుంచి తల్లి పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

☛ Civils 2023 Ranker Hanitha Inspire Success Story : కాలం కదలలేని స్థితిలో పడేస్తే.. ఈమె సంకల్పం సివిల్స్ కొట్టేలా చేసిందిలా.. కానీ..

ఎడ్యుకేష‌న్ :
శశికాంత్‌ షాద్‌నగర్‌ పట్టణంలోని మరియారాణి ఉన్నత పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత నాగర్‌కర్నూల్‌ జిల్లా వట్టెం నవోదయలో 9, 10వ తరగతులు చదివారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని మియాపూర్‌ గుంటూరు వికాస్‌లో ఇంటర్‌, విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌(ఈఈఈ) పూర్తి చేశారు.

రూ.12 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. కానీ..

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగిన శశికాంత్‌ ఎన్ని ఉద్యోగాలు వచ్చినా వాటిని వదలుకున్నారు. 2011లో ఇన్ఫోసిస్‌లో ఏడాదికి రూ. 11లక్షల ప్యాకేజీతో, 2012లో పశ్చిమ బెంగాల్‌లో స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఏటా రూ.12 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అయినా వాటిల్లో చేరకుండా సివిల్స్‌ వైపు దృష్టి మళ్లించారు. 

☛ UPSC Civils 18th Ranker Wardah Khan : ల‌క్ష‌ల్లో వ‌చ్చే జీతాన్ని వ‌దిలి.. ల‌క్ష్యం కోసం వ‌చ్చి సివిల్స్ కొట్టానిలా.. అతి చిన్న వ‌య‌స్సులోనే..

ఆరో ప్రయత్నంలో..
శశికాంత్ 2013లో ఢిల్లీ వెళ్లి సివిల్స్‌కు సిద్ధం అయ్యారు. మూడుసార్లు ప్రిలిమినరీ వరకు వచ్చారు. 2019లో కేవలం 6 మార్కుల తేడాతో అవకాశం కోల్పోయారు. 2020లో ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో 695 ర్యాంకు సాధించిన శశికాంత్‌ను యూపీఎస్సీ అధికారులు ఐఆర్‌టీఎస్‌ (ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌)కు కేటాయించారు. ప్రస్తుతం అస్సాంలో రైల్వేశాఖలో పని చేస్తున్నారు. అస్సాం రాష్ట్రంలోని రింగియా డివిజన్‌లో రైల్వే విభాగంలో అసిస్టెంట్‌ ఆపరేషన్‌ మేనేజర్‌గా శశికాంత్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. 

ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతోనే..

కేంద్ర ప్రభుత్వ శాఖలో విధులు నిర్వర్తిస్తూనే మరోసారి సివిల్స్‌కు ప్రయత్నించారు. ఇప్పటి వరకు 8 సార్లు పరీక్షలు రాసిన శశికాంత్‌ మూడు సార్లు ర్యాంకులు సాధించారు. ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మొత్తం 1,016 మందిని ఎంపిక చేయగా శశికాంత్‌ 891వ ర్యాంకు సాధించి శెభాష్‌ అనిపించుకున్నారు. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగం సాధించాలని ఎందరో కలలు కంటారు. దానికి నిర్దిష్టమైన ప్రణాళిక రచించి, కఠోర సాధన చేస్తే తప్ప అందుకోవడం సాధ్యం కాదు. అలాంటి కలను షాద్‌నగర్‌వాసి సాకారం చేసుకున్నాడు. 

#Tags