IAS Officer Ashok Success Story : నా జీవితంలో మలుపుతిప్పిందన ఘటన ఇదే... ఇందుకే కలెక్టర్ అయ్యా.. కానీ..
కానీ నా జీవితంలో కొత్త ప్రపంచంలోకి నడిపించే శైశవదశలో ప్రతి విషయం ఓ మధుర జ్ఞాపకమే అన్నారు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్. ఈ నేపథ్యంలో అశోక్ ఐఏఎస్ ఆఫీసర్ సక్సెస్ జర్నీ మీకోసం .
నా చిన్నతనంలో...
బాల్యంలో జరిగిన ఒక సంఘటన తన జీవితాన్ని మలుపుతిప్పింది. మా సొంతూరు మహారాష్ట్రలోని బీడ్. నేను 6వ తరగతి చదువుతున్న రోజులవి. స్కూల్‌లో ఉన్న సమయంలో గుజరాత్‌లోని భుజ్‌లో భారీ భూకంపం వచ్చిందని మా టీచర్లు చెప్పారు. స్కూల్‌లో ఉదయం ప్రతిజ్ఞ చేసే సమయంలో వార్తలు చదివేవాళ్లం. దేశం యావత్తూ భుజ్ భూకంప బాధితులకు సహాయం చేసేందుకు ముందుకొస్తోందని.. మనం కూడా సాయమందిద్దామని టీచర్లు చెప్పారు. ఫండ్ కలెక్ట్ చేసేందుకు టీమ్ లీడర్‌గా నన్ను ఎంపిక చేశారు.
అప్పట్లోనే నేను..
ప్రతి విద్యార్థి నుంచి ఫండ్ కలెక్ట్ చేస్తూ.. దానికి సంబంధించిన లెక్కలను ఎప్పటికప్పుడు హెడ్ సర్‌కి చెప్పేవాడిని. అప్పుడే ఒక ఆర్థిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, సమయపాలన అలవర్చుకున్నాను. ఫండ్ ఎంత ఎక్కువగా ఇస్తే.. అంత మందికి సాయం చేయగలమన్న ఆలోచన నాలో వచ్చింది. అందుకే ప్రతి విద్యార్థీ వీలైనంత పెద్ద మొత్తంలో డబ్బులు అందించేలా ప్రోత్సహించాను. ప్రతి క్లాస్‌కు వెళ్లి మోటివేషన్ స్పీచ్ ఇచ్చేవాడిని. అది అందర్నీ ఆకట్టుకుంది. అప్పట్లోనే మా స్కూల్ తరఫున దాదాపు రూ.5 లక్షల వరకు సేకరించగలిగాం. దీంతో నన్ను టీచర్లు అభినందించారు.
అప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలంటే..
ఈ రూ.5 లక్షలను జిల్లా కలెక్టర్‌కు అప్పగించే బాధ్యతను కూడా నాకే అప్పగించారు. అప్పుడే మొదటిసారి కలెక్టరేట్‌కు వెళ్లాను. అక్కడ కలెక్టర్ చాంబర్ చూశాను. ఐఏఎస్ అధికారి ఎలా ఉంటారన్నది చూసిన నాకు అక్కడ వాతావరణం ప్రేరేపించింది. నాలో కొత్త ఆలోచనలను రేకెత్తించేలా చేసింది. ఐఏఎస్ అధికారి కావాలన్న లక్ష్యాన్ని నాలో కలిగించిందీ ఆ సంఘటనే.. అప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలని మా టీచర్లను, తల్లిదండ్రులను అడిగేవాడిని. వారు చెప్పినదానికనుగుణంగా ప్లాన్ చేసుకున్నాను.
ప్రణాళికాబద్ధంగా బాల్యంను ఆస్వాదిస్తే.. ప్రతి ఒక్కరు..
ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాను. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా చదివాను. తర్వాత 2018లో సివిల్స్‌కు ఎంపికై .. నా కలను నెరవేర్చుకున్నాను. ప్రణాళికాబద్ధంగా శైశవదశను ఆస్వాదిస్తే.. ప్రతి ఒక్కరి బాల్యం మనకు కథ అవుతుంది. భావితరాలకు చరిత్రగా మారుతుంది అని జేసీ మయూర్ అశోక్ చెప్పారు.
నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గెటప్‌లో..
చిల్డ్రన్స్ డే రోజున ఏదో ఒక గేమ్‌లో ప్రైజ్‌లు వచ్చేవి. నాకు బాగా గుర్తుంది.. ఒకటో తరగతిలో స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలపై పోటీలు నిర్వహించారు. నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గెటప్‌లో వెళ్లి డైలాగ్‌లు చెప్పాను. దీనికి నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని అశోక్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.