UGC-NET 2022 December Notification: బోధన, పరిశోధనలకు మార్గం.. నెట్‌

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌-నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌! సంక్షిప్తంగా.. యూజీసీ-నెట్‌!! పరిశోధన అభ్యర్థులకు సుపరిచితమైన పరీక్ష! ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే.. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌), అదేవిధంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. తాజాగా యూజీసీ-నెట్‌ 2022, డిసెంబర్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. యూజీసీ నెట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..
  • యూజీసీ-నెట్‌ 2022, డిసెంబర్‌ నోటిఫికేషన్‌ విడుదల
  • 83 సబ్జెక్ట్‌లలో జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌కు పరీక్ష
  • కొత్తగా ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్‌ సబ్జెక్ట్‌ 

సైన్స్, టెక్నాలజీ తదితర విభాగాల్లో రీసెర్చ్‌ అభ్యర్థులకు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కానీ హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ విభాగాల్లో మాత్రం ఆశించిన మేరకు అవకాశాలు లేవు. ఈ సమస్యకు పరిష్కారంగా యూజీసీ అందుబాటులోకి తెచ్చిన విధానమే.. యూజీసీ-నెట్‌. ముఖ్యంగా హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌లో పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో యూజీసీ నెట్‌ను నిర్వహిస్తున్నారు.

మొత్తం 83 సబ్జెక్ట్‌లు

యూజీసీ నెట్‌-2022, డిసెంబర్‌ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 83 సబ్జెక్ట్‌లలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్, అదేవిధంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌లకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పరీక్ష నిర్వహించనున్నారు. ఏటా రెండుసార్లు నిర్వహించే యూజీసీ-నెట్‌లో గతంలో 82 సబ్జెక్ట్‌లో ఉన్నాయి. కొత్తగా ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్‌ అనే సబ్జెక్ట్‌ను చేర్చారు.

అర్హత

  • పీజీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయసు: జేఆర్‌ఎఫ్‌ అభ్యర్థులకు 01.12.2022నా టికి 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీ-ఎన్‌సీఎల్, ఇతర రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌ అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.

చ‌ద‌వండి: Higher Education: పీహెచ్‌డీకి మార్గాలివిగో..!

రెండు కేటగిరీల్లో

  • యూజీసీ-నెట్‌ పరీక్షను అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అనే రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తాము ఏ కేటగిరీ పరీక్షకు హాజరవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేయాల్సి ఉంటుంది. 
  • రీసెర్చ్‌/జేఆర్‌ఎఫ్‌ పట్ల ఆసక్తి ఉన్న వారు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకోవాలి. 
  • అధ్యాపక వృత్తికి మాత్రమే పరిమితం అవుదామనుకునే వారు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్షన్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. 
  • అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ప్రాథమ్యం ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు.

రెండు పేపర్లు.. 300 మార్కులు

  • యూజీసీ నెట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు 300 మార్కులకు ఉంటాయి. 
  • పేపర్‌-1లో 50 ప్రశ్నలకు-100 మార్కులు ఉంటాయి. ఇందులో అభ్యర్థుల్లోని టీచింగ్‌/రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్, జనరల్‌ అవేర్‌నెస్, భిన్నమైన ఆలోచన సరళిపై ప్రశ్నలు ఎదురవుతాయి.
  • పేపర్‌-2లో 100 ప్రశ్నలు-200 మార్కులకు ఉంటాయి. ఈ పేపర్‌ అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌పై ఉంటుంది. అభ్యర్థుల్లోని డొమైన్‌ నాలెడ్జ్‌ను పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలు అడుగుతారు. 
  • రెండు పేపర్లకు కలిపి మొత్తం మూడు గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు.

పేపర్‌ ఎంపిక

  • పేపర్‌-1కు అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. 
  • పేపర్‌-2ను అభ్యర్థులు తమ పీజీ స్పెషలైజేషన్‌ ఆధారంగా యూజీసీ నెట్‌లో అర్హత ఉన్న సబ్జెక్ట్‌కు సంబంధించిన పరీక్షగా నిర్వహిస్తారు. ఉదాహరణకు పీజీ స్థాయిలో హిస్టరీ స్పెషలైజేషన్‌ చదివిన అభ్యర్థులు హిస్టరీ సబ్జెక్ట్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

అర్హత మార్కులు

యూజీసీ నెట్‌కు సంబంధించి అర్హత మార్కుల నిబంధన అమలవుతోంది. రెండు కేటగిరీల అభ్యర్థులు(జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌) అర్హత పొందాలంటే.. తాము రాసిన పేపర్లలో కనీస అర్హత మార్కులు సాధించాలి. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో కలిపి 40 శాతం మార్కులు, రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం మార్కులు స్కోర్‌ చేయాలి.

చ‌ద‌వండి: After Inter: ఇంటర్మీడియెట్‌ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..

ఆరు శాతం మందికే అవకాశం

యూజీసీ నెట్‌.. మొత్తం హాజరైన అభ్యర్థుల్లో ఆరు శాతం మందినే నెట్‌ ఉత్తీర్ణులుగా ప్రకటిస్తుంది. కనీస అర్హత మార్కుల శాతం ఆధారంగా ఉత్తీర్ణులను ప్రకటించే క్రమంలో.. పలు స్లాట్లలో పరీక్షను నిర్వహించడాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా నార్మలైజేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు.

విజయం సాధించాలంటే

యూజీసీ-నెట్‌లో విజయం సాధించాలంటే.. అభ్యర్థులకు పరిశోధనల పట్ల ఆసక్తితోపాటు ఎంచుకున్న సబ్జెక్ట్‌పై సంపూర్ణ అవగాహన ఉండాలి.

ఉమ్మడి పేపర్‌కు సన్నద్ధత

అభ్యర్థులందరికీ ఉమ్మడిగా నిర్వహించే పేపర్‌-1లో టీచింగ్, రీసెర్చ్‌ ఆసక్తులను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పది విభాగాలు(టీచింగ్‌ ఆప్టిట్యూడ్, రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్‌ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, పీపుల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌-గవర్నెన్స్, పాలిటీ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌) నుంచి ఒక్కో విభాగంలో అయిదు ప్రశ్నలు చొప్పున అడుగుతారు.

సబ్జెక్ట్‌ పేపర్‌కు ఇలా

  • అభ్యర్థుల పీజీ స్పెషలైజేషన్‌ ఆధారంగా నిర్వహించే పేపర్‌-2 సబ్జెక్ట్‌ పేపర్‌లో ప్రశ్నలు పీజీ స్థాయిలో ఉంటాయి. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి ఇంటర్మీడియెట్‌ నుంచి పీజీ వరకు అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. 
  • అభ్యర్థులు ఆయా సిలబస్‌ అంశాలను అప్లికేషన్‌ ఓరియెంటేషన్, ప్రాక్టికల్‌ అప్రోచ్‌తో చదవడం లాభిస్తుంది. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు ప్రాక్టికల్‌ థింకింగ్, అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌ ఎంతో కీలకంగా నిలుస్తోంది. క్రిటికల్‌ థింకింగ్, అనలిటికల్‌ అప్రోచ్‌ ఉపయుక్తంగా ఉంటుంది. ఫలితంగా ప్రశ్నలు ఏ తీరుగా అడిగినా.. సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. 

సోషల్‌ సైన్సెస్, హ్యుమానిటీస్‌

పరిశోధనలు అనగానే సైన్స్, టెక్నాలజీలకు సంబంధించినవే అనే అభిప్రాయం ఉంది. కాని ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ వంటి సబ్జెక్ట్‌లు చదివిన వారికి కూడా పరిశోధనలతోపాటు, జేఆర్‌ఎఫ్‌కు మార్గం వేస్తుంది యూజీసీ-నెట్‌. పీజీ స్థాయిలో నాన్‌-సైన్స్‌ చదివిన అభ్యర్థులకు యూజీసీ-నెట్‌ చక్కటి అవకాశమని చెప్పొచ్చు.

యూజీసీ నెట్‌తో ప్రయోజనాలివే

యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత సాధించి తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు పలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అవి..

  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హోదాతో అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టొచ్చు. యూజీసీ నిబంధనల ప్రకారం-నెట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేటగిరీలో ఉత్తీర్ణత సాధించిన వారినే ఈ పోస్ట్‌లకు ఎంపిక చేయాలి. 
  • ఐఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, ఇతర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీ, రీసెర్చ్‌ అభ్యర్థుల ఎంపికలో నెట్‌ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది.
  • జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే ప్రముఖ రీసెర్చ్‌ లేబొరేటరీల్లో మూడేళ్లపాటు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా పనిచేయొచ్చు. 
  • మొదటి రెండేళ్లు జేఆర్‌ఎఫ్‌ హోదాలో నెలకు రూ.31 వేల ఫెలోషిప్‌ లభిస్తుంది.
  • జేఆర్‌ఎఫ్‌ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎస్‌ఆర్‌ఎఫ్‌ రెండేళ్లపాటు నెలకు రూ.35 వేల చొప్పున అందుతుంది. 
  • జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ విభాగాల్లో సైంటిస్ట్‌లుగా కెరీర్‌ ప్రారంభించే అవకాశం లభిస్తుంది. 
  • సైంటిస్ట్‌లుగా ఎంపికైన వారికి వారి గ్రేడ్‌ ఆధారంగా ప్రారంభంలోనే నెలకు రూ.ఎనభై వేల వరకూ వేతనం అందుతుంది. 
  • ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ సబ్జెక్ట్‌లలో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే.. పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పురావస్తు శాఖ, ఆర్థిక గణాంక శాఖలు, సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ వంటి పలు ప్రభుత్వ విభాగాల్లో రీసెర్చ్‌ స్కాలర్స్‌గా అవకాశాలు లభిస్తాయి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 17, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులో సవరణ అవకాశం: జనవరి 19-20 తేదీల్లో
  • పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు(రోజుకు రెండు షిఫ్ట్‌లలో)
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in

చ‌ద‌వండి: Higher Education: డిగ్రీతోనే పీహెచ్‌డీలో చేరేలా..!

#Tags