After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్‌ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!

పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ తర్వాత ఎంతో మంది ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం తక్షణమే ఉపాధికి ఊతమిచ్చే కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు! పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే ఉద్యోగం సాధించాలంటే..అందుకు తగ్గ నైపుణ్యాలు పెంచుకోవాలి. దీనికి చక్కటి మార్గం.. సర్టిఫికేషన్‌ కోర్సులు!! ఈ కోర్సులు పూర్తి చేసుకుంటే.. టెన్త్, ఇంటర్‌తోనే చక్కటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఇటీవల పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఉపయోగపడేలా.. జాబ్‌ ఓరియెంటెడ్‌ సర్టిఫికేషన్‌ కోర్సులపై ప్రత్యేక కథనం..
  • పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్‌ కోర్సులు
  • ఈ కోర్సులతో తక్షణ ఉద్యోగావకాశాలకు మార్గం
  • టెక్‌ మొదలు ట్రెడిషనల్‌ వరకు కొలువులు

నేటి కార్పొరేట్‌ యుగంలో టెక్నికల్‌ నుంచి ట్రెడిషనల్‌ వరకూ.. వివిధ రంగాల్లో అవకాశాలు అందుకునేందుకు వీలుంది. ఐటీ మొదలు ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, బ్యుటీషియన్, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాల్లో ఉపాధి లభిస్తోంది. ఆరు నెలల నుంచి సంవత్సరం వ్యవధిలో ఉండే స్వల్పకాలిక కోర్సులను పూర్తి చేసుకుంటే.. క్షేత్ర నైపుణ్యాలు సొంతమవుతాయి. ఫలితంగా ఉద్యోగ సాధనతోపాటు మెరుగైన వేతనాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.

చదవండి: Career Opportunities: సైబర్‌ సెక్యూరిటీ.. భవితకు భరోసా!

సైబర్‌ సైక్యూరిటీ
నేటి డిజిటల్‌ యుగంలో సైబర్‌ సెక్యూరిటీ కీలకంగా నిలుస్తోంది. సంస్థలు ఆన్‌లైన్‌ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో.. సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో పదో తరగతి, ఇంటర్‌ అర్హతలతోనే ఉద్యోగాలు పొందే అవకాశం లభిస్తోంది. ఇందుకోసం సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ ఫోరెన్సిక్స్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ వంటి వాటిపై అవగాహన తప్పనిసరి. ఈ స్కిల్స్‌ కోసం ఆరు నెలల నుంచి సంవత్సరం వ్యవధిలో సర్టిఫికేషన్‌ కోర్సులు చేయొచ్చు. పలు సంస్థలు ఆరు నెలల సర్టిఫికెట్‌ ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ కోర్సును అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో సాఫ్ట్‌వేర్‌ భద్రత, ఎథికల్‌ హ్యాకింగ్, సైబర్‌ సెక్యూరిటీ అనాలిసిస్, అప్లికేషన్స్‌ ఆఫ్‌ అటా క్స్, అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ అనాలిసిస్, డేటా ప్రొటెక్షన్,హార్డ్‌వేర్‌ ప్రొటెక్షన్‌ తదితరాలపై శిక్షణ ఇస్తారు. ఈ సర్టిఫికేషన్‌ పూర్తి చేసుకున్న వారికి ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు, ఇతర రంగాల్లోని సంస్థల్లో ఐటీ విభాగాల్లో సైబర్‌ సెక్యూరిటీ టీమ్‌ అసిస్టెంట్స్, అసోసియేట్స్‌ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.

హార్డ్‌వేర్‌ నిపుణులు
పదో తరగతి, ఇంటర్మీడియెట్‌తో ఐటీ రంగంలోని హార్డ్‌వేర్‌ విభాగాల్లో ఉపాధి పొందే అవకాశం ఉంది. ఇందుకు హార్డ్‌వేర్‌ మెయింటనెన్స్‌ ప్రధాన మార్గంగా నిలుస్తోంది. కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేయడానికి అవసరమైన సీపీయూ మెయింటనెన్స్, నెట్‌ వర్కింగ్, లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌ నిర్వహణ వంటి నైపుణ్యాలు హార్డ్‌వేర్‌ విభాగంలో చాలా కీలకం. దీనికి సంబంధించి ప్రస్తుతండిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ అండ్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేషన్, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ రిపెయిర్‌ అండ్‌ మెయింటనెన్స్‌ ఆఫ్‌ సిస్టమ్స్‌ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, నిమ్స్‌మే, సెట్విన్‌ వంటి సంస్థలు ఈ కోర్సులను బోధిస్తున్నాయి. వీటిని పూర్తి చేసుకుంటే.. చిన్న, మధ్య తరహా సంస్థల్లో హార్డ్‌వేర్‌ నెట్‌వర్కింగ్‌ అసిస్టెంట్స్, సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.

చదవండి: Coding and Programming Skills: ఐటీలో కొలువులు.. లక్షల్లో వేతనం..

కంప్యూటర్‌ కోర్సులు
పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే కంప్యూటర్‌పై అవగాహన పెంచుకునేందుకు పలు సర్టిఫికేషన్స్‌ అందుబాటులో ఉన్నాయి. నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో.. సీసీఎన్‌ఏ, సీసీఎన్‌పీ, ఎస్‌ఏపీ, కోర్‌–జావా ప్రోగ్రామింగ్, అడ్వాన్స్‌డ్‌ జావా ప్రోగ్రామింగ్, డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్, సీ++, ఎంఎస్‌ ఆఫీస్‌ అండ్‌ ఇంటర్నెట్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌ వంటి కోర్సులున్నాయి. ఇవి మూడు నెలల నుంచి సంవత్సరం వ్యవధిలో ఉంటాయి. ఎన్‌ఎస్‌డీసీ ఐటీ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలోనూ ఈ కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంది. వీటిని పూర్తి చేసుకుంటే.. ఐటీ, ఐటీ అనుంబంధ విభాగాల్లో అసిస్టెంట్స్, సపోర్టింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.

మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ స్పెషలిస్ట్‌
సంస్థలు, కార్యాలయాల్లో క్లరికల్‌ కేడర్‌లో కొలువులు పొందేందుకు ఉపయోగపడే కోర్సు.. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ స్పెషలిస్ట్‌. ఈ కోర్సు ద్వారా ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ టూల్స్‌గా పేర్కొనే వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్‌ తదితర బేసిక్‌ కంప్యూటర్‌ స్కిల్స్‌ లభిస్తాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే సీహెచ్‌ఎస్‌ఎల్, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో సైతం స్కిల్‌ టెస్ట్‌ పేరుతో కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. ఎంఎస్‌ ఆఫీస్‌ స్పెషలిస్ట్‌ నైపుణ్యాలను పొందితే ఈ సీపీటీలోనూ విజయం సాధించొచ్చు. పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సులను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ విధానంలో అందిస్తున్నాయి. ఈ సర్టిఫికేషన్‌ చేతిలో ఉంటే ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాల్లో ప్రాధాన్యత లభిస్తుంది. అడ్మినిస్ట్రేషన్‌ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వంటి కొలువుల్లో చేరితే నెలకు కనీసం రూ.12 నుంచి రూ.15 వేల ప్రారంభ వేతనం లభిస్తుంది.

చదవండి: Best Courses After Inter: ఇంటర్‌ తర్వాత చదవడానికి అవకాశం ఉన్న టాప్‌ 100 కోర్సులు.. వాటి వివరాలు..

డీటీపీ
ప్రస్తుత కంప్యూటర్‌ యుగంలో యువత ఉపాధికి మార్గంగా నిలుస్తున్న మరో టెక్‌ అనుబంధ కోర్సు.. డెస్క్‌టాప్‌ పబ్లిషింగ్‌. దీనికోసం డాక్యుమెంటేషన్, లెటర్‌ రైటింగ్, ఎంఎస్‌ ఆఫీస్‌ టూల్స్, టైపింగ్, ఫోటోషాప్‌ వంటివి నేర్చుకోవాలి. డీటీపీలో సర్టిఫికేషన్లు పూర్తి చేస్తే.. డేటాఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్లుగా ఉపాధి లభిస్తుంది. సొంతంగా డీటీపీ సెంటర్‌ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందొచ్చు.

వీడియో ఎడిటింగ్‌
వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలతో చక్కటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. పదో తరగతి,ఇంటర్మీడియెట్‌ అర్హతతో పలు స్వల్పకాలిక కోర్సులు పూర్తి చేసుకునే అవకాశముంది. వీడియో ఎడిటింగ్‌కు సంబంధించి యుడెమీ,ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్‌ ఆఫ్‌ ఓపెన్‌ లెర్నింగ్, కోర్సెరా, టెక్‌ మహీంద్రా స్మార్ట్‌ అకాడమీ వంటి సంస్థలు మూడు నెలల నుంచి ఏడాది వ్యవధిలో వీడియో ఎడిటింగ్, లీనియర్, నాన్‌–లీనియర్‌ ఎడిటింగ్‌ వంటి కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసుకోవడం ద్వారా.. మీడియా, యానిమేషన్‌ సంస్థలు, అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీలలో కొలువులు సొంతం చేసుకోవచ్చు.

చదవండి: Best Career Options After 10th Class: పది తర్వాత.. కోర్సులు, కెరీర్‌ ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!

హోటల్‌ మేనేజ్‌మెంట్‌
ఇటీవల కాలంలో ఉద్యోగ కల్పనలో ముందంజలో నిలుస్తున్న మరో విభాగం.. హోటల్‌ మేనేజ్‌మెంట్‌. ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ, టూరిజం వంటి స్వల్పకాలిక కోర్సుల్లో చేరొచ్చు. ఈ కోర్సులను పూర్తి చేసుకోవడం ద్వారా హోటల్స్, రిసార్ట్స్, టూరిజం సంస్థల్లో అసిస్టెంట్‌ చెఫ్, స్టివార్ట్, గైడ్, బిల్లింగ్‌ ఎగ్జిక్యూటివ్, గెస్ట్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ వంటి ఉద్యోగాలు పొందొచ్చు. అదే విధంగా డిప్లొమా ఇన్‌ ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ ప్రొడక్షన్, డిప్లొమా ఇన్‌ ఫుడ్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ, డిప్లొమా ఇన్‌ ఫ్రంట్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లలో వీటిని అభ్యసించొచ్చు.

ఫొటోగ్రఫీ
ఫొటోగ్రఫీలో ఆరు నెలల షార్ట్‌ టర్మ్‌ కోర్సులతోపాటు డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా ఫోటో జర్నలిజం, కమర్షియల్‌ ఫోటోగ్రఫీ, అడ్వరై్టజింగ్, ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ, ఇండస్ట్రియల్‌ ఫోటోగ్రఫీ, వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రఫీ, ఏరియల్‌ ఫోటోగ్రఫీ, సైంటిఫిక్‌ ఫోటోగ్రఫీ తదితర విభాగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మీడియా, పబ్లిషింగ్‌ సంస్థలు, అడ్వర్టయిజింగ్‌ కంపెనీలు ప్రధాన ఉపాధి వేదికలు. సొంతంగా స్టూడియోలను ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఫ్రీలాన్స్‌ ఫోటోగ్రాఫర్‌గా కూడా పని చే యవచ్చు. సత్యజిత్‌ రే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్, ఏఏఎఫ్‌టీ వంటి పలు సంస్థలు ఫోటోగ్రఫీలో డిప్లొమా కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి.

చదవండి: Career opportunities: డేటా స్కిల్స్‌.. భలే డిమాండ్‌!

బ్యుటీషియన్‌
అందానికి మెరుగులు దిద్దే బ్యూటీ షియన్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. ప్రస్తుతం బ్యుటీషియన్‌ విభాగంలో సర్టిఫికెట్, డిప్లొమా స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారు మీడియా సంస్థలు, ఫిల్మ్‌ ఇండస్ట్రీలో.. హెయిర్‌ డ్రెస్సర్, స్కిన్‌ కేర్‌ స్పెషలిస్ట్, మేకప్‌ ఆర్టిస్ట్, కాస్మొటిక్‌ కన్సల్టెంట్‌ అండ్‌ బ్యూటీ అడ్వైజర్, సెలూన్‌ అండ్‌ స్పా డైరెక్టర్, నెయిల్‌ టెక్నీషియన్‌ అండ్‌ మేనిక్యూరిస్ట్, బ్యూటీ కన్సల్టెంట్, బ్యూటీ స్కూల్‌ ఇనస్ట్రక్టర్, కాస్మోటాలజిస్ట్, డెర్మటాలజీ అసిస్టెంట్, మార్కెటింగ్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ స్పెషలిస్ట్‌ ఇన్‌ బ్యూటీ ఇండస్ట్రీ, ఆర్మో థెరపిస్ట్‌లుగా స్థిరపడవచ్చు. సొంతంగా బ్యూటీపార్లర్‌ నిర్వహించవచ్చు. వివాహాలు, జన్మదిన వేడుకలు వంటి సందర్భాల్లో బ్యుటీషియన్లకు ఆదాయం లభిస్తోంది. సెట్విన్, నిమ్స్‌మే వంటి సంస్థలు గ్రూమింగ్, పర్సనల్‌ గ్రూమింగ్, బ్యుటీషియన్, అడ్వాన్స్‌ బ్యుటీషియన్, బ్యూటీ కేర్‌ కోర్సులను అందిస్తున్నాయి.

చదవండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

యానిమేషన్‌
వీడియో గేమ్స్, కార్టూన్స్, మోషన్‌ కార్టూన్స్‌ పట్ల పిల్లల నుంచి పెద్దల వరకు ఆసక్తి పెరుగుతుండడంతో యానిమేషన్‌ రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. దీంతో.. ఈ విభాగంలో నైపుణ్యాలు సొంతం చేసుకున్న వారికి ఉపాధి లభించే అవకాశముంది. ప్రస్తుతం 3డి గేమింగ్, వీడియోలకు ప్రాధాన్యం పెరిగింది. వీటికి సంబంధించి మాడ్యులర్‌(మోడలింగ్‌), రిగ్గింగ్, టెక్స్చరింగ్‌ సెట్‌ డిజైనర్‌(ఎ–యానిమేటర్, బి–లిప్సింగ్‌), కంపోజిటింగ్‌ కోర్సులు ముఖ్యమైనవి. నిమ్స్‌మే తదితర సంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసుకుంటే.. వీడియో గేమింగ్‌ సంస్థలు, మీడియా సంస్థలు, యానిమేషన్‌ సంస్థలు, ఫిల్మ్‌ ఇండస్ట్రీలో అవకాశాలు లభిస్తాయి.

#Tags