After Inter: ఇంటర్మీడియెట్‌ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..

ఇంటర్మీడియెట్‌ తర్వాత ఏంటి..? అంటే.. ఇంజనీరింగ్‌ లేదా డిగ్రీలో చేరడం.. ఆ తర్వాత పీజీలో ప్రవేశం.. సాధారణంగా విద్యార్థుల నుంచి వచ్చే సమాధానం!! ఇందుకోసం మొదట డిగ్రీ స్థాయి కోర్సులో చేరి.. ఉత్తీర్ణత సాధించాలి. ఆ సర్టిఫికెట్‌ ఆధారంగా.. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్‌లో ర్యాంకు సొంతం చేసుకోవాలి. అలాకాకుండా.. ఇంటర్‌ తర్వాత ఒకే అడ్మిషన్‌ ప్రక్రియతో.. యూజీ(అండర్‌ గ్రాడ్యుయేట్‌), పీజీ కోర్సుల్లో ప్రవేశాన్ని ఖరారు చేసుకోవచ్చు! అదే.. ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల విధానం!! ప్రస్తుతం ఐఐటీలు, ఐఐఎంలు సహా ఎన్నో ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇంటర్‌ తర్వాత ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, ప్రయోజనాలపై ప్రత్యేక కథనం...
Intermediate: Integrated Courses After 12th, Professional Degree Courses and PG Coursed details here
  • బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పీజీ+పీహెచ్‌డీ 
  • ఐఐఎంల్లోనూ ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ ప్రోగ్రామ్స్‌
  • తాజాగా బీఈడీలోనూ అమల్లోకి ఇంటిగ్రేటెడ్‌ విధానం
  • ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్స్‌తో కలిసొచ్చే అంశాలెన్నో

టెక్నికల్‌ కోర్సులుగా పేర్కొనే బీటెక్‌లో చేరి.. ఆ తర్వాత ఎంటెక్‌ చదవాలంటే.. ముందుగా ఇంటర్‌ అర్హతతో ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ ద్వారా బీటెక్‌లో ప్రవేశం ఖరారు చేసుకోవాలి. ఆ తర్వాత బీటెక్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి మరో పరీక్షలో ర్యాంకు తప్పనిసరి. ఇదే విధంగా సంప్రదాయ కోర్సులైన బీఏ, బీఎస్సీ, బీకామ్‌ విషయంలోనూ ఇంటర్‌ అర్హతతో ముందుగా బ్యాచిలర్‌ డిగ్రీలో ప్రవేశం పొందాలి. డిగ్రీ ఉత్తీర్ణులయ్యాక.. ఆయా యూనివర్సిటీలు,ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లలో విజయం సాధించాలి. ఇలా కాకుండా ఒకే ప్రవేశ ప్రక్రియతో ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీకీ అవకాశం కల్పిస్తున్న విధానమే.. ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు. 

అన్ని విభాగాల్లోనూ

  • ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్‌లు అన్ని విభాగాల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి. 
  • పలు యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సులను అందిస్తున్నాయి.
  • టెక్నికల్‌ విభాగంలో.. ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌+ఎంటెక్‌ కోర్సులను అభ్యసించే అవకాశం ఉంది.
  • మేనేజ్‌మెంట్‌ నిపుణులను తీర్చిదిద్దే ఎంబీఏలోనూ..ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే ఇంటిగ్రేటెడ్‌ బీబీఏ+ఎంబీఏ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. 
  • తాజాగా.. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి కూడా ఇంటర్‌ అర్హతతోనే ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సుకు రూపకల్పన చేశారు.

ప్రయోజనాలు
ఇంటర్మీడియెట్‌ అర్హతగా ప్రవేశం కల్పించే ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్స్‌తో పలు ప్రయోజనాలు లభిస్తున్నాయి. వీటిలో ప్రధానమైంది..బ్యాచిలర్‌ డిగ్రీ తర్వాత మరో ఎంట్రన్స్‌ రాసే అవసరం లేకుండానే నేరుగా పీజీ చదివే అవకాశం లభించడం. అదేవిధంగా టెక్నికల్, ప్రొఫెషనల్‌ కోర్సుల పరంగా ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. ఉదాహరణకు.. టెక్నికల్‌ కోర్సులైన ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌+ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదేళ్లు. రెగ్యులర్‌ విధానంలో బీటెక్‌ నాలుగేళ్లు, ఆ తర్వాత ఎంటెక్‌కు మరో రెండేళ్లు చదవాలి. అంటే.. ఆరేళ్లు పడుతుంది. ఇంటిగ్రేటెడ్‌ పీజీ ద్వారా ఐదేళ్లలోనే అటు బీటెక్‌ పట్టాతోపాటు ఇటు ఎంటెక్‌ సర్టిఫికెట్‌ కూడా చేతికి అందుతుంది. ఎంతో విలువైన ఒక ఏడాది సమయం కలిసొస్తుంది. ఇది కెరీర్‌ పరంగా ముందంజలో నిలిచేందుకు దోహదపడుతుంది. 

  • ఇటీవల ప్రవేశ పెట్టిన ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సును పరిగణనలోకి తీసుకుంటే.. ఇంటర్మీడియెట్‌ అర్హతతో కేవలం నాలుగేళ్లలోనే బీఈడీ పట్టా అందుకోవచ్చు. సాధారణ విధానంలో బీఈడీ పూర్తి చేయాలంటే.. ముందుగా మూడేళ్లు బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత మరో రెండేళ్ల వ్యవధిలో బీఈడీ అభ్యసించాలి. అంటే.. మొత్తం అయిదేళ్లు వెచ్చించాలి. కానీ, ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ విధానంలో నాలుగేళ్ల వ్యవధిలోనే బీఈడీ పట్టా అందుకోవచ్చు. దీనివల్ల విద్యార్థులకు కెరీర్‌లో ఎంతో విలువైన ఒక సంవత్సరం కలిసొస్తుంది.
     

చ‌ద‌వండి: Inter Special: ఎంపీసీ.. అకడమిక్‌ సిలబస్‌తోపాటే పోటీ పరీక్షలకూ ప్రిపరేషన్‌!!

అయిదేళ్లు.. రెండు డిగ్రీలు
అయిదేళ్ల వ్యవధి ఉండే ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్‌లలో అడుగుపెట్టిన విద్యార్థులు.. తొలి మూడేళ్లు బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయి సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండేళ్లు పీజీ స్థాయి సబ్జెక్టులను అభ్యసించాలి. తొలి మూడేళ్లు బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయి సబ్జెక్టులను అభ్యసించిన విద్యార్థులు.. పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. మూడేళ్ల తర్వాత బ్యాచిలర్‌ డిగ్రీ సర్టిఫికెట్, అయిదేళ్ల తర్వాత పీజీ సర్టిఫికెట్‌ లభిస్తుంది. మూడేళ్ల తర్వాత పీజీ ప్రోగ్రామ్‌లో కొనసాగడం ఇష్టం లేకపోతే.. బ్యాచిలర్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ అందుకోవచ్చు.

బీటెక్‌+ఎంబీఏ
ఇటీవల కాలంలో ఎక్కువ మంది విద్యార్థులు బీటెక్‌ పూర్తికాగానే.. ఎంబీఏవైపు అడుగులు వేస్తున్నారు. అందుకే పలు ఇన్‌స్టిట్యూట్‌లు, బీస్కూల్స్‌లో బీటెక్‌+ఎంబీఏ పేరుతో ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లకు శ్రీకారం చుట్టాయి. ఫలితంగా విద్యార్థులకు ఒకవైపు టెక్నికల్‌ స్కిల్స్, మరోవైపు మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు లభిస్తున్నాయి.

సైన్స్‌ కోర్సులు
సెంట్రల్‌ యూనివర్సిటీలు, రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీలు.. సైన్స్‌ విభాగంలో.. ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ+ఎమ్మెస్సీ కోర్సులను అందిస్తున్నాయి. వీటిద్వారా విద్యార్థులకు ఐ.ఎమ్మెస్సీ పేరుతో సర్టిఫికెట్‌ లభిస్తోంది. ఈ విధానంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన విద్యార్థులకు.. సదరు యూనివర్సిటీలోనే పీహెచ్‌డీ ప్రవేశంలో ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ఈ విధానం అమలవుతోంది.

సోషల్‌ సైన్సెస్‌
సోషల్‌ సైన్సెస్‌ విభాగంలోనూ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి.సంప్రదాయ బీఏ కోర్సుల విద్యార్థులు.. భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవడానికి ఇవి అవకాశం కల్పిస్తున్నాయి. టిస్, జేఎన్‌యూ వంటి ప్రముఖ విద్యాసంస్థలు,సెంట్రల్‌ యూనివర్సిటీలు.. ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ పేరుతో పలు ప్రోగ్రామ్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో ఎంఏ స్థాయిలో సోషల్‌ వర్క్,సోషియాలజీ,రూరల్‌ డెవలప్‌మెంట్, ఎన్‌జీవో మేనేజ్‌మెంట్‌ వంటి స్పెషలైజేషన్లను అందిస్తున్నాయి. 

అయిదేళ్ల ‘లా’ కోర్సు
ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు కెరీర్‌ పరంగా చక్కటి బాట వేస్తున్న మరో కోర్సు.. అయిదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సు. ఇంటర్మీడియెట్‌ అర్హతతో క్లాట్‌ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత ఆధారంగా నేషనల్‌ లా యూనివర్సిటీల్లో న్యాయశాస్త్ర పట్టా చేతికందుతుంది. వాస్తవానికి ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పొందాలంటే.. మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ తర్వాత ఎంట్రన్స్‌ రాసి మరో మూడేళ్ల వ్యవధిలో ఎల్‌ఎల్‌బీ కోర్సు అభ్యసించాలి. అంటే.. మొత్తం ఆరేళ్లు లా డిగ్రీ కోసం వెచ్చించాలి. అదే ఇంటర్‌ అర్హతతో కేవలం అయిదేళ్లలోనే లా పట్టా పుచ్చుకోవచ్చు.

మేనేజ్‌మెంట్‌లోనూ ఇంటిగ్రేటెడ్‌
మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోనూ ప్రస్తుతం పలు యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌ అర్హతతో ఐదేళ్ల బీబీఏ+ఎంబీఏ కోర్సులను అందిస్తున్నాయి. వీటి ద్వారా విద్యార్థులకు బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలోనే మేనేజ్‌మెంట్‌ అంశాల బోధన సాగుతోంది. అయిదేళ్ల పాటు చదివే కోర్సు ఫలితంగా డిగ్రీ తర్వాత ఎంబీఏలో అడుగు పెట్టిన వారితో పోల్చుకుంటే.. ఎక్కువ పరిజ్ఞానం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంటిగ్రేటెడ్‌ బాటలో ఐఐటీలు, ఐఐఎంలు

  • టెక్నికల్, మేనేజ్‌మెంట్‌ కోర్సుల విషయంలో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన ఐఐటీలు, ఐఐఎంలు కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్‌ పీజీ విధానాన్ని ఆవిష్కరిస్తున్నాయి.
  • ఐఐఎం–ఇండోర్, రోహ్‌తక్, రాంచీ, జమ్ము, బో«ద్‌గయలు అయిదేళ్ల వ్యవధిలో ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అందిస్తున్నాయి.
  • ఐఐటీ–చెన్నై ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సును అందుబాటులోకి తెచ్చింది.
  • ఐఐటీ–ఖరగ్‌పూర్‌ ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌+ఎంబీఏ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. 
  • ఐఐటీ–కాన్పూర్, రూర్కీలు కూడా ఈ తరహా ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.
  • సైన్స్‌ కోర్సులకు ప్రత్యేకంగా ఏర్పాటైన ఐఐఎస్‌ఈఆర్‌ల్లో సైతం బీఎస్‌+ఎంఎస్‌ పేరుతో ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది.

లాంగ్వేజ్‌ ప్రోగ్రామ్స్‌
లాంగ్వేజ్‌ ప్రోగ్రామ్స్‌లోనూ ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులను పలు యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఆయా లాంగ్వేజ్‌ కోర్సుల పరంగా ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ–హైదరాబాద్, జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీలు ముందంజలో నిలుస్తున్నాయని చెప్పొచ్చు.

నైపుణ్యాలకు మార్గం
ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్‌ల విద్యార్థులకు విస్తృత నైపుణ్యాలు లభిస్తాయని భావిస్తున్నారు. వీరికి బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయి నుంచే ఆయా అంశాలపై లోతైన అవగాహన కల్పించేలా బోధన అందిస్తారు. ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్, ఎంబీఏ, లా, బీఈడీ, సోషల్‌ సైన్సెస్‌ వంటి కోర్సుల్లో బ్యాచిలర్‌ స్థాయి నుంచే ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కూడా లభిస్తోంది. ఫలితంగా విద్యార్థులు క్షేత్ర నైపుణ్యాల కోణంలో మరింత మెరుగైన అవగాహన పొందగలుగుతున్నారు.

పీహెచ్‌డీ కూడా ఇంటిగ్రేటెడ్‌గా
ఉన్నత విద్యలో అత్యున్నత డిగ్రీగా పేర్కొనే పీహెచ్‌డీలోనూ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్‌ విభాగాల్లో ఈ విధానం ఎక్కువగా అమలవుతోంది. ఐఐటీలు సహా పలు ప్రముఖ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంటెక్‌+పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. అదే విధంగా సైన్స్‌ కోర్సుల్లోనూ ఎమ్మెస్సీ+పీహెచ్‌డీ పేరిట ఐఐఎస్‌సీ, టీఐఎఫ్‌ఆర్‌ తదితర ఇన్‌స్టిట్యూట్‌లు ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.

ఇంటిగ్రేటెడ్‌ పీజీ.. ముఖ్యాంశాలు..

  • ఇంటర్మీడియెట్‌ అర్హతతో ఒకే ఎంట్రన్స్‌ విధానంతో బ్యాచిలర్‌+పీజీ కోర్సులో అడుగు పెట్టే అవకాశం
  • ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌+ఎంటెక్‌ విధానంలో అయిదేళ్ల వ్యవధిలోనే ఎంటెక్‌ సర్టిఫికెట్‌
  • ట్రెడిషనల్‌ కోర్సుల విషయంలో మూడేళ్ల తర్వాత ఎగ్జిట్‌ అవకాశం. ఆ సమయంలో బ్యాచిలర్‌ సర్టిఫికెట్‌ అందించేలా నిబంధనలు
  • మేనేజ్‌మెంట్, లా, బీఈడీల్లోనూ ఇంటిగ్రేటెడ్‌ విధానం
  • ఐఐఎంలు, ఐఐటీల్లోనూ ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ లేదా డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు
  • ఇటీవల బోధన విద్యలోనూ అమల్లోకి వచ్చిన ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ విధానం
  • పీహెచ్‌డీ విషయంలో ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లు.
  • గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంటెక్‌+పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

సద్వినియోగం చేసుకోవాలి
ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ముఖ్యంగా వారికి కెరీర్‌ కోణంలో బహుళ నైపుణ్యాలు లభిస్తాయి. డిగ్రీ నుంచే పీజీ స్థాయిలో ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్లకు సంబంధించిన కోర్సులను చదివే వెసులుబాటు లభిస్తుంది. అదేవిధంగా ఇంజనీరింగ్, సైన్స్‌ విద్యార్థుల కోణంలో ఆలోచిస్తే.. బ్యాచిలర్‌ స్థాయి నుంచే విద్యార్థుల్లో రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ పెరుగుతుంది. 
– ప్రొ‘‘హెచ్‌.వెంకటేశ్వర్లు, వైస్‌ ఛాన్స్‌లర్, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ
 

చ‌ద‌వండి: After Inter: ఇంటర్‌తోనే.. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు..

#Tags