Intermediate Students: 12లోగా ఇంటర్‌ సర్టిఫికెట్లు అందజేయాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2022–23 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ పాసైన విద్యార్థులకు పాస్‌ సర్టిఫికెట్లను అక్టోబర్ 12లోపు విద్యార్థులకు గానీ, వారి తల్లిదండ్రులకు గానీ అందచేయాలని జిల్లా వృత్తి విద్యాధికారి బీ.ప్రభాకర రావు ఆదేశించారు. ఇంటర్‌ పాసైన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందచేసే కార్యక్రమాన్ని ఆదివారం ఏలూరు వృత్తి విద్యాధికారి కార్యాలయంలో నిర్వహించారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌, సోషల్‌ వెల్ఫేర్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌తో సహా అన్ని యాజమాన్యాల ప్రిన్సిపాల్స్‌కు వారి విద్యా సంస్థల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పాస్‌ సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా ప్రభాకర రావు మాట్లాడుతూ 2014 నుంచి 2023 వరకూ ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్లు డిజిలాకర్‌ సిస్టంలో భద్రపరిచామని, వాటిని ఓపెన్‌ చేసి వారికి డిజిటల్‌ సర్టిఫికెట్లను ఇచ్చామన్నారు. డిజిలాకర్‌ సిస్టం ద్వారా సర్టిఫికెట్లు పొందే విధానం వివరంగా తెలపాలని ఆయా విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. కార్యక్రమంలో పెదపాడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జీ సుబ్రహ్మణ్యేశ్వర రావు, పీడీబీటీ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జీ సూర్యనారాయణ, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.పేర్రాజు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బీవీ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: Intermediate Exams: నేటి నుంచి కళాశాలల్లో ఇంటర్‌ మార్కుల లిస్టులు

#Tags