AP Government Teacher Problems 2024 : చాలా చోట్ల సబ్జెక్ట్ టీచర్లు లేక ఇబ్బందులు.. డీఎస్సీలో పోస్టుల సంఖ్య పెంచాల్సిందే.. లేదా..!
ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అలసత్వ వైఖరి విద్యార్థులకు శాపమైంది. దీనివల్ల విద్యా వ్యవస్థపై నిర్లక్ష్యపు నీడ అలముకుంటోంది.
ప్రాథమిక స్థాయి నుంచే ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడిన విద్య అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సబ్జెక్ట్ టీచర్లతో బోధనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉన్నత పాఠశాలలో సమీపంలోని ప్రాథమిక పాఠశాలలను విలీనం చేసింది. ఈ మేరకు వివిధ పాఠశాలల్లో అదనంగా ఉన్న సబ్జెక్ట్ టీచర్లను అవసరం ఉన్న పాఠశాలలకు డిప్యుటేషన్ వేసింది. తాజాగా విద్యా సంవత్సరం ప్రారంభమైనా సబ్జెక్ట్ టీచర్లను సర్దుబాటు చేయడంలో కూటమి ప్రభుత్వం అంతులేని జాప్యం చేస్తోంది.
☛➤ AP Mega DSC 2024 Problems : ఇక మెగా డీఎస్సీ లేనట్టేనా..! అలాగే ప్రభుత్వ టీచర్లుకు కూడా..
కార్పొరేట్ స్కూళ్లకు వత్తాసు పలికేలా..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల సర్దుబాటు ప్రక్రియను స్కూళ్లు తెరుచుకోవడానికి ముందే చేపట్టారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు 45 రోజులు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టకపోవడం శోచనీయం. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా, కార్పొరేట్ స్కూళ్లకు వత్తాసు పలికేలా కూటమి ప్రభుత్వం విధానాలు ఉన్నాయి.
జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 1,578 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 1,256 ప్రాథమిక, 87 ప్రాథమికోన్నత, 235 ఉన్నత పాఠశాలలు వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్నాయి. మండల, జెడ్పీ యాజమాన్య పరిధిలో 1,207 ప్రాథమిక, 81 ప్రాథమికోన్నత, 206 ఉన్నత పాఠశాలలు, మున్సిపల్ యాజమాన్య పరిధిలో 49 ప్రాథమిక, మూడు ప్రాథమికోన్నత, 10 ఉన్నత, ప్రైవేట్ ఎయిడెడ్ యాజమాన్య పరిధిలో మూడు ప్రాథమికోన్నత, నాలుగు ఉన్నత పాఠశాలలు ఉండగా, ప్రభుత్వ యాజమాన్య పరిధిలో ఎనిమిది, ఏపీఆర్‌ఐ సొసైటీ స్కూల్స్ యాజమాన్య పరిధిలో ఒకటి, ఏపీఎస్ డబ్ల్యూఆర్‌ఐ సొసైటీ స్కూల్స్ పరిధిలో ఆరు ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులు లేరు. ప్రధానంగా ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉంది.
ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంతో..
జిల్లాలో వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 6,273 ఉపాధ్యాయ పోస్టులు ఉండాలి. ఇందులో వివిధ క్యాటగిరీలకు చెందిన 464 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఎస్‌ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎస్జీటీ పోస్టులు ఖాళీలు అధికంగా ఉన్నాయి. 60 ఏళ్ల ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంతో 2022 జూన్ నుంచి ఉద్యోగ విరమణ చేయాల్సిన వారు ఈ ఏడాది జూన్‌లో ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఖాళీలు మరింత పెరిగాయి. ఉద్యోగ విరమణ చేసిన పోస్టుల్లో నిబంధనల ప్రకారం పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉంది. పదోన్నతులకు సైతం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది.
ఒక పక్క ప్రైవేట్ పాఠశాలల్లో బోధన వేగంగా ఉంటే..
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఇంకా దృష్టి సారించలేదు. ఒక పక్క ప్రైవేట్ పాఠశాలల్లో బోధన వేగం అందుకుంది. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం నత్తనడకన సాగుతోంది. జిల్లాలో విద్యార్థులు లేనిచోట ఉపాధ్యాయులు అధికంగా ఉంటే, విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో సరిపడా టీచర్లు లేని పరిస్థితి. గత ప్రభుత్వం ఈ సమస్యను అధిగమించేందుకు జీఓ జారీచేసి టీచర్ల సర్దుబాటు ప్రక్రియ చేపట్టింది. తాజాగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ ప్రక్రియపై ఇంత వరకూ దృష్టి సారించలేదు. టీచర్లు సర్దుబాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మెగా డీఎస్సీ డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అప్పటి వరకు పేదలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇంతేనా అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఈ పాఠశాలలో ఒక్క విద్యార్థి మాత్రమే..
రావులపాలెం మండలం వెదిరేశ్వరం మండల పరిషత్ నంబర్–1 ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:1గా ఉంది. 20 మంది విద్యార్థుల వరకూ ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అయితే ఈ పాఠశాలలో ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నారు. ఒకటి, రెండు తరగతుల వరకూ ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒక్క విద్యార్థి ఉన్నాడు. నిన్నటి వరకూ ఇద్దరు విద్యార్థులు ఉండగా, ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థి రికార్డు షీట్ తీసుకుని కూనవరం వెళ్లగా, ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న ఒక్క విద్యార్థి మాత్రమే ఉన్నట్లు పాఠశాల ఉపాధ్యాయురాలు పి.నిర్మలకుమారి శ్రీసాక్షిశ్రీకి తెలిపారు.
మెగా డీఎస్సీ వెంటనే ప్రకటించాలి.. లేదా
నేను ఎంఏ బీఈడీ చదువుకుని ఖాళీగా ఉన్నా. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్ తేదీ ప్రకటించడంతో డీఎస్సీ ఆగిపోయింది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాను. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీపై సంతకం చేశారు. ఉద్యోగం వస్తుందని ఆశ పడ్డాను. వెంటనే ప్రభుత్వం డీఏస్సీ తేదీ ప్రకటించాలి. అలాగే పోస్టుల సంఖ్య కూడా పెంచాలి.
–గంటి చిరంజీవి, బడుగువారిపేట, కామనగరువు, అమలాపురం రూరల్‌స్టూడెంట్
కిట్ల పంపిణీలోనూ..
ఉప్పలగుప్తం మండలం గొలవిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్ట్ పోస్టులతో పాటు ఒక ఫిజికల్ డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. దీనివల్ల విద్యార్థుల కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంబాజీపేట మండలం గంగకుర్రు ఉన్నత పాఠశాలలో గణితం, తొండవరం హైస్కూల్‌లో బయలాజికల్ సైన్స్ పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. స్టూడెంట్ కిట్ల పంపిణీలో భాగంగా కొన్ని చోట్ల విద్యార్థులకు షూలు సరిపోక పంపిణీ ఆగిపోయింది.