Teacher Jobs Notification: భారీగా ఉపాధ్యాయ పోస్టులు
నిజామాబాద్: టీచర్ కొలువులకు సంబంధించిన పోస్టులు జిల్లాలో పెరిగాయి. గతంలో మంజూరైన టీఆర్‌టీ(టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) పోస్టులను రెట్టింపు చేస్తూ తాజాగా అనుమతులు జారీ చేసింది. దీంతో జిల్లాలో నిరుద్యోగులకు ఊరట లభించినట్లయ్యింది.
2017లో నిర్వహించిన టీఆర్ టీ తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించలేదు. దీంతో టెట్ ఉత్తీర్ణత సాధించిన వేలమంది అభ్యర్థులు టీఆర్‌టీ కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం ఎట్టకేలకు టీచర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు పరీక్ష నిర్వహణకు షెడ్యూల్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేయడంతో ఊపిరిపించుకున్నారు.
పరీక్షతేదీని కూడా ప్రకటించారు. కానీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో వాయిదా పడింది. ప్రస్తు తం ఏర్పడిన కొత్త ప్రభుత్వం పోస్టుల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలో పోస్టుల సంఖ్య పెరిగింది.
పెరిగిన పోస్టులు
జిల్లాలో గత ప్రభుత్వం 309 పోస్టులు ప్రకటించి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా నిలిచిపోవడంతో.. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం పోస్టులను 601కి పెంచింది. అంతేకాకుండా తొలిసారిగా స్పెషల్ ఎడ్యూకేషన్ కింద 43 పోస్టులు మంజూరు చేసింది. ఈ పోస్టులు ఎస్‌ఏ, ఎస్టీటీ ఖాళీల్లోనే కలిపి చూపించారు.
దీనికి ప్రత్యేక బీఈడీ పూర్తి చేసినవారు అర్హులవుతారు. ఇందులో సోషల్ స్టడీస్ ప్రభుత్వ విభాగంలో రెండు పోస్టులు, లోకల్‌బాడి విభాగంలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి.
ఎస్జీటీ విభాగంలో తెలుగులో నాలుగు, లోకల్‌బాడి విభాగంలో 24, ఉర్దూ విభాగంలో ప్రభుత్వంలో ఒకటి, లోకల్‌బాడి విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి. గత ప్రభు త్వంలో స్కూల్‌అసిస్టెంట్ పోస్టులు 96, ఎస్జీటీలు 183, లాంగ్వేజ్ పండిట్‌లు 21 ఉన్నాయి. కానీ పీఈటీ పోస్టులు గతంలో తొమ్మిది ఉండగా ప్రస్తుతం అంతే ఉన్నాయి.
జిల్లాలో పెరిగిన టీఆర్‌టీ పోస్టులు ఈసారి కొత్తగా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 42 మంజూరు
త్వరలో మెగా డీఎస్సీ ప్రకటించే అవకాశం:
గతంలో కంటే పోస్టులు పెంచినా వివిధ విభాగాల్లో పోటీ తీవ్రంగానే ఉండనుంది. 2017 నుంచి డీఎస్సీ నిర్వహించపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఇటీవల గురుకుల పోస్టులు భర్తీ అయినా చాలామంది డీఎస్సీపైనే దృష్టి సారిస్తారు.
కాగా కొన్నేళ్లుగా టెట్ ఉత్తీర్ణులైన వారు డీఎస్సీ కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలో టెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు పేపర్–1లో 4,880 మంది, పేపర్–2లో 5,383 మంది ఉన్నారు. అంతేగాక గతేడాది సెప్టెంబర్‌లో కూడా మరోసారి టెట్ నిర్వహించారు.
ఇందులో ఉత్తీర్ణులైన వారు సైతం ఈ పరీక్షకు హాజరుకానున్నారు. 601 పోస్టులకు గాను సుమారు 25వేల మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. సబ్జెక్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే ఒక్కొక్క పోస్టుకు తీవ్ర పోటీ ఉండనుంది.