Telangana Mega Job Mela: మెగా జాబ్‌మేళా.. 1563 jobs

Telangana Mega Job Fair News

కొత్తగూడెంటౌన్‌: కొత్తగూడెం క్లబ్‌లో జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా శిశు సంక్షేమశాఖ, ఉపాధి కల్పన అధికారిణి వేల్పుల విజేత, కొత్తగూడెం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కాపు సీతాలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Latest Anganwadi news: ఇకపై అంగన్‌వాడీలకు ఇవి తప్పనిసరి

జిల్లా నలుమూలల నుంచి దాదాపుగా 2,450 మందికి పైగా నిరుద్యోగులు మేళాకు తరలివచ్చారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ తదితర విద్యార్హతలు కలిగినవారు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. నిరుద్యోగులు కొందరు క్యూఆర్‌ కోడ్‌తో స్కాన్‌ చేసి వివరాలు నమోదు చేసుకోగా, మరికొందరు కంపెనీల ప్రతినిధుల వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

మొత్తం 60 కంపెనీల్లో 1,531 మంది ఉద్యోగాలకు ఎంపికై నట్లు జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి కె. సంజీవరావు తెలిపారు. వీరిలో 928 మందికి అక్కడే నియామక పత్రాలు అందజేశారు. మరో 603 మందికి త్వరలోనే నియామక పత్రాలు ఇస్తామని ఆయా కంపెనీల ప్రతినిధులు తెలిపారు.
 

నా తొలి జీతం అమ్మకు ఇచ్చా : కలెక్టర్‌ జితేష్‌
నా తొలి జీతం ఇచ్చి అమ్మకళ్లలో ఆనందం చూశానని, మీరు కూడా మీ మొదటి జీతం మీ అమ్మనాన్నలకు ఇవ్వండని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ పేర్కొన్నారు. మెగా జాబ్‌మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ఉద్యోగం చిన్నదా, పెద్దదా అని సందేహించకుండా ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

నైపుణ్యం పెంచుకుంటే వేతనాలు పెరుగుతాయన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ జాబ్‌మేళాతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని అన్నారు. ఇంకా జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి కె.సంజీవరావు, జిల్లా సంక్షేమ శాఖ, ఉపాధికల్పన శాఖ అధికారి వేల్పుల విజేత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్‌ కార్యాలయం సూపరింటెండెంట్‌ ఉదయ్‌కుమార్‌, లక్ష్మణ్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రజా ప్రతి నిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 

ఉద్యోగానికి ఎంపికయ్యాను
కొత్తగూడెంలో జాబ్‌ మేళాకు రావడం ఆనందంగా ఉంది. డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. జాబ్‌మేళాలో ఇంటర్వ్యూలకు హాజరుకాగా హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాను. కాల్‌ లెటర్‌ త్వరలో పంపిస్తామని చెప్పారు. ఆనందంగా ఉంది.
– వి.ఇందుప్రియ, పాల్వంచ

మాకు కూడా మంచి వేదిక
మేము ఓలా, జొమాటో మాదిరిగా సేవలను అందిస్తున్నాం. మా సంస్థలో పని చేసేందుకు ఉత్సాహం ఉన్న యువత కోసం జాబ్‌మేళాల్లో ఇంటర్వ్యూలు చేశాం. ఇక్కడ ఏర్పాట్లు భాగున్నాయి. మేళా నిరుద్యోగులతో పాటు మాకు కూడా మంచి వేదికగా మారింది.
–జె.జీవన్‌ రైడాన్‌ సంస్థ ప్రతినిధి, కొత్తగూడెం

ఉద్యోగులను ఎంపిక చేసుకునే అవకాశం
మా సంస్థకు కావాల్సిన ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు మెగా జాబ్‌మేళాకు వచ్చాం. మాతో పాటు నిరుద్యోగులకు ఈ వేదిక చాలా ఉపయోగకరంగా మారింది. ఉత్సాహంగా ఉన్న యువతను ఎంపిక చేశాం.
–శ్రీను దగ్గుబాటి,స్పందన స్ఫూర్తి ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధి

#Tags