Mega Job Mela: 26న దర్శిలో మెగా జాబ్‌ మేళా.. రూ.25 వేల వరకు వేతనం

ఒంగోలు సెంట్రల్‌: మెగా జాబ్‌ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిర పడాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, సీడాప్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26న దర్శిలో నిర్వహించనున్న మెగా జాబ్‌ మేళా వాల్‌ పోస్టర్‌ను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా పలు దఫాలుగా జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నారని, సరైన అవగాహనతో వినియోగించుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం యువతకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్‌.లోకనాథం మాట్లాడుతూ.. ఈనెల 26న దర్శి ప్రభుత్వ కాలేజీలో జాబ్‌ మేళాకు 15 కంపెనీలు హాజరవుతున్నట్లు వెల్లడించారు. 18 నుంచి 35 ఏళ్లలోపు యువత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. వేతనం రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు పొందే అవకాశం ఉందని తెలిపారు. వివరాలకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 9988853335 లేదా 9100566581, 7013950097ను సంప్రదించాలని సూచించారు.
అసిస్టెంట్‌ కలెక్టర్‌ శౌర్య, నగర మేయర్‌ గంగాడ సుజాత, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌, డీఈఓ వీఎస్‌ సుబ్బారావ, సీడాప్‌ జెడీఎం రజనీకాంత్‌, కార్పొరేటర్‌ శాండిల్య, రజనీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: Group 2 Preparation Plan: గ్రూప్‌–2పై గురిపెట్టండిలా!

#Tags