Job Mela: మహిళా డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా

వనపర్తిటౌన్‌: జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీస్‌ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించినట్లు జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీస్‌ అధికారి మహమ్మద్‌ జాన్‌ పాషా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ జాబ్‌ మేళాకు ‘సాక్షి’ న్యూస్‌ పేపర్‌, కేఎల్‌ గ్రూప్‌ అమెజాన్‌, కేఎల్‌ గ్రూప్‌ విగార్డ్‌ ప్రిమియర్‌ సోలార్‌ కంపెనీ, ధరణి ఇన్‌ఫాస్ట్రక్చర్‌, శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, స్నాడర్‌ ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చర్‌ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. 10వ, తరగతి, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, డిప్లమా చదివిన వారికి మంచి వేతనాలతో 700 ఖాళీలు ఉన్నాయని, జాబ్‌ మేళాతో మంచి ఉద్యోగాన్ని సాధించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సురేష్‌ మాట్లాడాతూ.. జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీస్‌ సహకారంతో కళాశాలలో రెండో సారి జాబ్‌ మేళా నిర్వహించడం సంతోషకరమన్నారు. ఉద్యోగ స్థాయిని బట్టి రూ.10 వేలు నుంచి రూ.25 వేల వరకు కంపెనీలు వేతనాలు ఇస్తున్నాయని, వాటిని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్‌ మేళాకు 80 మంది నిరుద్యోగులు హాజరయ్యారని, అందులో ‘సాక్షి’ న్యూస్‌ పేపర్‌కు ఆరుగురు, ఎనిమిది మంది ధరణి ఇన్‌ఫాస్ట్రక్చర్స్‌ కంపెనీ, శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి ఇద్దరు ఎంపికయ్యారని, మొత్తం 16 మంది జాబ్స్‌కు సెలెక్ట్‌ అయినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ కేసీ కో–ఆర్డినేటర్‌ రూప, లక్ష్మీ, నాగేంద్రా చారి తదితరులు పాల్గొన్నారు.

#Tags