Free Training for organic farming: సేంద్రియ సేద్యంపై 21 రోజుల ఉచిత శిక్షణ

Free Training organic farming

సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో ఇమిడి ఉండే అన్ని అంశాలతో పాటు పిజిఎస్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ విషయాలపై పూర్తిస్థాయి శిక్షణ పొందాలనుకునే తెలుగు వారికి ఇదొక గొప్ప అవకాశం. సేంద్రియ/ప్రకృతి సేద్యంలో అన్ని విషయాలతో పాటు పిజిఎస్‌ సర్టిఫికేషన్‌పై లోతైన అవగాహన కల్పించేందుకు 21 రోజుల పాటు తెలుగులో ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణా శిబిరం జరగనుంది.

Mega job mela: 25న మెగాజాబ్‌ మేళా: Click Here

కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌/నేచురల్‌ ఫార్మింగ్‌ (ఎన్‌సిఓఎన్‌ఎఫ్‌) తోడ్పాటుతో సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్‌ఎ),  కృష్ణ సుధ అకాడమీ ఆఫ్‌ ఆగ్రోఎకాలజీ (కెఎస్‌ఎ)  సెప్టెంబర్‌ 5 నుంచి ఉమ్మడిగా ఈ శిబిరాన్ని నిర్వహించనున్నాయి. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, సిఎస్‌ఎ, కెఎస్‌ఎల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా. జీవీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం జరగనుండటం విశేషం.

విజయవాడకు 50 కిమీ దూరంలో ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట సమీపంలో శ్రీపద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్‌ నెలకొల్పిన కృష్ణ సుధ అకాడమీ ఆఫ్‌ ఆగ్రోఎకాలజీ ఆవరణలో ఈ శిబిరం జరగనుంది. 38 ఎకరాలలో అత్యాధునిక సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేస్తూ ఆచణాత్మక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటైన కెఎస్‌ఎకు సుస్థిర వ్యవసాయ కేంద్రం నాలెడ్జ్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఈ 21 రోజుల శిబిరంలో బోధన పూర్తిగా తెలుగులో ఉంటుంది. శిక్షణ, భోజన వసతులు ఉచితం. అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్‌ చదివి ఉండాలి. 30 మందికి అవకాశం.

సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలోను, సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపారంలోను స్థానికంగా కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి, నిబద్ధత కలిగిన వారికి సంపూర్ణ అవగాహన కలిగించేందుకే ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు డా. రామాంజనేయులు వివరించారు. స్థానిక స్వయం సహాయక బృందాలు/ ఎఫ్‌పిఓలు / ఐసిఎస్‌/ ఆత్మ, పికెవివై, నామని గంగే లేదా ఏదైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సేంద్రియ వ్యవసాయ పథకాలలో నమోదైన వారికి ్రపాధాన్యం ఉంటుందన్నారు. ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి.. గూగుల్‌ ఫామ్‌లో వివరాలు పొందుపరచటం ద్వారా ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 85002 83300. 

ముచ్చింతల్‌లో ‘సిరిధాన్యాలతో జీవన సిరి’ శిబిరం..
రైతునేస్తం ఫౌండేషన్, స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ సహకారంతో.. కర్షక సేవా కేంద్రం నిర్వహణలో హైదరాబాద్‌ సమీపంలో ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆవరణలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో సిరిధాన్యాలతో జీవన సిరి అనే అంశంపై ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్‌వలి, డా. సరళా ఖాదర్‌లచే ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్‌ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. 3 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ముందుగా రిజిస్ట్రేషన్  చేయించుకోవాలి. ఇతర వివరాలకు.. 97053 83666, 70939 73999.

#Tags