Good News for Teachers: 30 వేల మంది ఎస్‌జీటీలకు పదోన్నతుల వెల్లువ.. ప్రయోజనాలు ఇవే..
రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలు, కార్యక్రమాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మొత్తంగా పాఠశాల వ్యవస్థకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరనుందని ఆ నోట్‌లో పేర్కొంది.
ఉపయోగాలు ఇవే..
☛ 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయడం వల్ల వచ్చే జూన్‌లోగా 30 వేల మంది ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు వస్తాయి.
☛ రాష్ట్రంలో కొత్తగా 833 జూనియర్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. తద్వారా పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్ స్థాయి పదోన్నతులు లభించనున్నాయి. ప్రస్తుతం 41 మండలాల్లో మహిళా కళాశాలలు ఉన్నాయి. 202 మండలాల్లో అసలు కళాశాలలే లేవు. ఈ మండలాల్లో ఒక కో ఎడ్యుకేషన్, ఒక బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అంటే.. ఈ 202 మండలాల్లో కొత్తగా 404 జూనియర్ కాలేజీలు రానున్నాయి. మరో 429 మండలాల్లో ఒక్కో బాలికల కళాశాల ఏర్పాటు కానుంది. మొత్తంగా 833 కొత్త కళాశాలలు రానున్నాయి.
☛ మండల విద్యా శాఖ అధికారులు (ఎంఈవోలు) ఇక నుంచి పూర్తి స్థాయిలో విద్యా శాఖ బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా సెల్ఫ్ డ్రాయింగ్ అధికారాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం దీనిపై విధాన నిర్ణయం తీసుకుంది. మండల వనరుల కేంద్రంగా ఉన్న కార్యాలయాన్ని ఇక నుంచి మండల విద్యాశాఖ కార్యాలయంగా మార్చనున్నారు. ఎంఈవోలు దశాబ్దాలుగా ఈ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యాలయంలో అవసరమైన సిబ్బందిని కూడా ప్రభుత్వం నియమించనుంది.
☛ మండల స్థాయిలో ఇద్దరు ఎంఈవోలను నియమిస్తారు. డివిజన్, జిల్లా స్థాయిలోనూ పోస్టులు పెరగనున్నాయని నోట్‌లో విద్యా శాఖ పేర్కొంది.
గడచిన రెండున్నరేళ్ల కాలంలో 22,240 మందికి..
గడచిన రెండున్నరేళ్ల కాలంలో 22,240 మందికి పదోన్నతులు కల్పించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనని మంత్రి సురేష్ గుర్తు చేశారు. 2019లో 975 మంది స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి ఇచ్చారన్నారు. అదే ఏడాది 5,540 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, తత్సమాన క్యాడర్ వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించిందన్నారు. 2020లో 516 మంది స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించారని తెలిపారు. అదే ఏడాది 2,732 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, తత్సమాన క్యాడర్ వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించిందని గుర్తు చేశారు. 2021లో 280 మంది స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్ హెడ్మాస్టర్లుగా పదోన్నతి వచ్చిందన్నారు. 1,351 మంది ఎస్జీటీలు, ఇతర టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పదోన్నతులపై దక్కాయని వివరించారు. ఎంతోకాలంగా బదిలీల కోసం ఎదురుచూసిన ఉపాధ్యాయులకు ఆన్ లైన్ ద్వారా ఎవరికీ ఇబ్బంది కలగకుండా బదిలీలు పూర్తి చేశామన్నారు. బదిలీ దరఖాస్తు చేసిన 1,72,083 మంది హెచ్‌ఎంలు, టీచర్లకు గాను 75,882 మందికి వారు కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చినట్లు వివరించారు.
వీరి కల నెరవేరిందిలా..
లాంగ్వేజ్ పండిట్లు (ఎల్‌పీ), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (పీఈటీ) తమ పోస్టుల అప్‌గ్రెడేషన్ కోసం దశాబ్దానికి పైగా కాళ్లరిగేలా తిరిగినా వారి సమస్యను నాటి పాలకులు పరిష్కరించలేదని మంత్రి సురేష్ వివరించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక 10,224 పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసి వారి కలను నెరవేర్చామని చెప్పారు. అప్‌గ్రేడ్ చేయడమే కాకుండా వాటిలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు కల్పించామన్నారు. ఇలా 2,603 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు స్కూల్ అసిస్టెంటు (ఫిజికల్ ఎడ్యుకేషన్)గా పదోన్నతులు పొందారని వివరించారు.
చరిత్రాత్మకం..
ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండల విద్యాశాఖాధికారుల సమస్యలను పరిష్కరించడం చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర ఎంఈవోల సంఘం అధ్యక్షుడు ఆదూరి వెంకటరత్నం, కోశాధికారి సబ్బితి నర్సింహమూర్తి పేర్కొన్నారు. ఎంఈవోల సమస్యల్ని పరిష్కరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. అమరావతిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఈవోల ఆత్మగౌరవ సమస్య అయిన సెల్ఫ్ డ్రాయింగ్ పవర్‌ను కల్పించడం, మండల స్థాయిలో విద్యా సంబంధిత కార్యక్రమాలన్నీ ఎంఈవోల ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం తమకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నామన్నారు.