Good News Ap To Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌.. రెండు డీఏలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారికి రెండు డీఏలను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ శుక్రవా­రం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జనవరి 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం, అలాగే గతేడాది జూలై 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మరో డీఏ 3.64 శాతం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గతేడాది జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లించనున్నారు.

అలాగే గతేడాది జూలై 1 నుంచి ఇవ్వాల్సిన డీఏను ఈ ఏడాది జూలై నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లిస్తారు. డీఏ బకాయిలను సమాన వాయిదాల్లో జనరల్‌ ప్రావి­డెంట్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌)కు జమ చేయనున్నారు. డీఏ పెంపు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్‌ కార్పొరేషన్, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితి, సవ­రించిన రెగ్యులర్‌ స్కేళ్లు పొందుతున్న వర్క్‌ చార్జ్‌డ్‌ ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు.

సవరించిన రెగ్యులర్‌ స్కేళ్లు పొందుతున్న ఎయిడెడ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్, యూనివర్సిటీ సిబ్బంది, ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన యూనివర్సిటీ టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి డీఏ పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సీఎం జగన్‌కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు
చెప్పిన మాట మేరకు ఉద్యోగులకు రెండు డీఏలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య తరఫున చైర్మన్‌ కె.వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలి­పారు. అలాగే పలు ఉద్యోగ సంఘాల నాయకులు సైతం సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు.

#Tags