Israel-Hamas war: కాల్పుల విరమణకు హమాస్ ఆమోదం!
Sakshi Education
ఈజిప్టు–ఖతార్ ప్రతిపాదించిన యుద్ధ విరమణ ప్రతిపాదనను తాము ఆమోదించామని హమాస్ మే 6వ తేదీ ప్రకటించింది.
గాజాలో ఏడు నెలలుగా హమాస్– ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. తమ అగ్రనేత ఇస్మాయిల్ హనియే కాల్పుల విరమణకు తాము అంగీకరిస్తున్నామనే విషయాన్ని ఖతారు ప్రధాని, ఈజిప్టు ఇంటలిజెన్స్ మినిస్టర్‌లకు తెలియజేశారని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది.
పూర్తి యుద్ధ విరమణ, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి మళ్లడం లాంటివి ఈ శాంతి ప్రతిపాదనలో ఉన్నాయో, లేదోననే విషయంపై స్పష్టత లేదు. లక్ష మంది పాలస్తీనియన్లు రఫా నగరం నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హకుం జారీచేసిన కొద్ది గంటల్లోనే హమాస్ ప్రకటన వెలువడటం గమనార్హం. హమాస్ నుంచి ఈ ప్రకటన వెలువడగానే రఫాలోని శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్లు ఆనందోత్సాహాన్ని వెలిబుచ్చారు. రఫాపై ఇజ్రాయెల్ దాడి ముప్పు తప్పినట్లేనని వారు భావిస్తున్నారు. అయితే హమాస్ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
Published date : 08 May 2024 10:30AM