Chinese Unhappy Leave: సంతోషంగా ఉంటేనే విధులు.. లేకుంటే 10 రోజులు సెలవులు!

వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో చర్చనీయాంశంగా మారిన అంశం. దీని ప్రాముఖ్యత గత దశాబ్ద కాలంలో విపరీతంగా పెరిగింది. పనితోపాటు కుటుంబంతో గడపడం, అభిరుచులు మొదలైనవాటికి ఒక రోజులో కొంత సమయం కేటాయించడం మధ్య సమతౌల్యాన్ని ఈ పదం సూచిస్తుంది.

దీని గురించి బాగా ఆలోచించిన ఒక చైనీస్ రిటైల్ వ్యాపారవేత్త తన సంస్థలో "అన్‌హ్యపీ లీవ్‌" అనే భావనను ప్రవేశపెట్టారు.  దీని ప్రకారం ఉద్యోగులు సంతోషంగా లేకుంటే విధులకు రాకుండా సెలవు తీసుకోవచ్చని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక పేర్కొంది.

చైనాలోని రిటైల్ చైన్ అయిన పాంగ్ డాంగ్ లై వ్యవస్థాపకుడు, ఛైర్మన్ యూ డాంగ్లాయ్ ఈ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. ఇది సిబ్బంది తమ అభీష్టానుసారం 10 రోజుల అదనపు సెలవులు తీసుకుకోవడానికి అనుమతిస్తుంది. "ప్రతి సిబ్బందికి స్వేచ్ఛ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికీ వారు సంతోషంగా లేని సమయాలు ఉంటాయి, కాబట్టి మీరు సంతోషంగా లేకుంటే, పనికి రావద్దు" అని ఆయన చెప్పారు.

సెలవులు తీసుకోవాలనుకునే ఏ ఉద్యోగికీ యాజమాన్యం నో చెప్పదని డోంగ్లాయ్ స్పష్టం చేశారు. "ఈ సెలవును యాజమాన్యం తిరస్కరించలేదు. తిరస్కరణ అనేది ఉల్లంఘన" అని ఆయన స్పష్టం చేశారు.

#Tags