Medical College Admissions: మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం
సిరిసిల్ల: జిల్లా చరిత్రలో వైద్యరంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. సిరిసిల్లలోని మెడికల్ కాలేజీలో ప్రవేశాలు మొదలయ్యాయి. ఈ కాలేజీ కి వంద ఎంబీబీఎస్ సీట్లను కేటాయించగా.. ఇప్పటికే ఆరుగురు అడ్మిషన్లు పొందారు. పెద్దూ రు బైపాస్ రోడ్డులో పదెకరాలలో రూ.40కోట్లతో నిర్మిస్తున్న భవనం తుది దశకు చేరింది. కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ నిర్వహిస్తున్నారు.
సిరిసిల్లకు సీఎం కానుక
సీఎం కేసీఆర్ 2021 జూలై 4న సిరిసిల్లకు మెడికల్ కాలేజీని ప్రకటించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు చొరవతో మెడికల్ కాలేజీ మంజూరైంది. ఈ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు సెప్టెంబరు మొదటివారంలో ప్రారంభంకానున్నాయి. కాలేజీలోని వంద సీట్లలో 15 ఆలిండియా కోటాలో కేటాయించారు. మరో 85 సీట్లు మన రాష్ట్రస్థాయి విద్యార్థులకు దక్కుతాయి. 40 సీట్లు అబ్బాయిలకు, 60 అమ్మాయిలకు కేటాయించారు. అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరు ప్రైవేటు భవనాల్లో హాస్టళ్లను సిద్ధం చేశారు.
సీఎంతో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
మెడికల్ కాలేజీని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని జిల్లా ఆస్పత్రిని పూర్తిస్థాయిలో మాతాశిశు సంరక్షణ, నవజాత శిశువుల కేంద్రంగా మార్చనున్నారు. 340 బెడ్లతో ప్రసూతి విభాగం సిద్ధమవుతుండగా, ఇప్పటికే ప్రతి నెలా 360 ప్రసవాలు జరుగుతున్నాయి. జనరల్ ఆస్పత్రిని మొత్తంగా మెడికల్ కాలేజీకి మార్చనున్నారు. జిల్లా ప్రజలకు ఉచిత వైద్యసేవలు 24 గంటల బోధనాస్పత్రిలో అందుతాయి. సిరిసిల్ల జిల్లాలో ఏ ప్రైవేటు ఆస్పత్రిలో లేని విధంగా అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉండనున్నారు.
నెలాఖరులోగా అందరూ వస్తారు
మెడికల్ కాలేజీలో కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. ఇప్పటికే ఆరుగురు వచ్చారు. నెలాఖరులోగా వంద మంది చేరుతారు. సెప్టెంబరు మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయి. కాలేజీ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఎంబీబీఎస్ మొదటి ఏడాది వైద్యపాఠాలు బోధించేందుకు మౌలిక వసతులు సమకూరాయి. – డాక్టర్ ఎస్.చంద్రశేఖర్