JNTU Students: 27 మంది జేఎన్‌టీయూ విద్యార్థులకు ఉద్యోగాలు.. రూ.6.25 లక్షల వార్షిక వేతనం
విజయనగరం అర్బన్: జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ)వర్సిటీలో 2023–24 విద్యా సంవత్సరానికి నవంబర్ 15 బుధవారం నిర్వహించిన ప్లేస్‌మెంట్ ప్రక్రియలో 27 మంది మంచి వేతనంతో ఉద్యోగాలు సాధించారు. ఈ మేరకు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.వెంకటసుబ్బయ్య విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి. ప్లేస్‌మెంట్‌లో అత్యధికంగా 27 మంది విద్యార్థులు మంచి వేతనంతో ఉద్యోగాలు పొందారు. మల్టీ నేషనల్ కంపెనీల్లో ఒకటైన ఎల్‌అండ్‌టీ సంస్థ ఇంటర్వ్యూలో అధికంగా 26 మంది ఎంపికయ్యారు. వారిలో మెకానికల్ 22 మంది, సివిల్ ఇంజినీరింగ్ నుంచి నలుగురు రూ.6.25 లక్షల వార్షిక వేతనంలో ఉద్యోగాలు సాధించారు. అలాగే ఈసీఈ విభాగం నుంచి రూ.6 లక్షల వార్షిక వేతనంతో మోసిప్ టెక్నాలజీస్ సంస్థలో ఒకరు ఉద్యోగం సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను వీసీ ప్రొఫెసర్ కె.వెంకటసుబ్బయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.శ్రీకుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గురునాథ్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ టీఎస్‌ఎన్‌మూర్తి, వివిధ విభాగాల అధిపతులు అభినందించారు.
చదవండి: Nadu Nedu Scheme: రూ.310 కోట్లతో 447 జూనియర్ కళాశాలల అభివృద్ధి