Skip to main content

Jayathi Murthy : ఏఐ రంగంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయంటే..?

కృత్రిమ మేధ రంగంలో ఉద్యోగం కావాలని చూస్తున్నారా..? అయితే మీరు ఎప్పటికప్పుడు ఆ రంగంలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా ఉండాల్సిందే అంటున్నారు జయతి మూర్తి. ఒరెగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ ప్రెసిడెంట్‌గా ఉన్న ఈ తెలుగింటి ఆడపడుచు యూనివర్శిటీ వ్యవహారాలు, పరిశోధనల వివరాలను ‘సాక్షి ఎడ్యుకేష‌న్’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.
Jayathi Murthy

అప్‌-టు-డేట్‌గా ఉండటమే కృత్రిమ మేధ రంగంలో ఉపాధి అవకాశాల కోసం చూస్తున్న వారు ఎదుర్కోబోయే అతిపెద్ద సమస్య అని అంటున్నారు జయతి మూర్తి. కృత్రిమ మేధ రంగంలో ఉద్యోగావకాశాలు మొదలుకొని పలు ఇతర అంశాలపై జయతి మూర్తి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : కృత్రిమ మేధతో ఉద్యోగాల అవకాశాలు దెబ్బతినవు అని చాలా మంది చెబుతున్నారు. మీరేమంటారు?
జయతి : కొన్ని రకాల ఉద్యోగాల్లో కోత పడుతుంది.. అదే సమయంలో కొన్ని కొత్త రకాలు ఉద్యోగాలు పట్టుకొస్తాయి కూడా. ఏఐ విసృ‍్తత వాడకం తరువాత కూడా అన్ని రకాల ఉద్యోగాలు భద్రంగా ఉంటాయని చెప్పలేము. కొంత మార్పు అనివార్యం. కొందరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కూడా. కొందరికి ఏఐ వల్ల లాభం చేకూరితే మరికొందరికి నష్టమూ, బాధ జరగొచ్చు. నష్టపోయే వారికి కొత్త నైపుణ్యాలను అందించేందుకు ప్రయత్నాలు జరగాలి. మార్పు తాలూకూ దుష్ప్రభావం తక్కువగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చినప్పుడు గతంలోనూ కొందరు సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడూ అదే జరుగుతుంది.

సాక్షి ఎడ్యుకేష‌న్ : రీస్కిల్లింగ్‌ అనేది అందరికీ సాధ్యమవుతుందా? కృత్రిమ మేధతో ఉద్యోగాలు కోల్పోయే వారికి కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి?
జయతి : స్పష్టమైన ఆర్థిక విధానాల అవసరం ఏర్పడవచ్చు. సమాజంలో అట్టడుగున ఉన్న వారికి కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తాలూకూ ఫలితాలు అందాలి. లేదంటే అంతరాలు పెరిగిపోతాయి. ఇంకోలా చెప్పాలంటే ఇప్పటికే ఆ అంతరం ఉంది. మనలో చాలామంది కంప్యూటర్లతో పని చేస్తూ సంపాదించుకుంటున్నాం. పేదలకు ఆ అవకాశం లేదు. కొన్ని పాఠశాలల్లో కంప్యూటర్‌ స్క్రీన్లు, ల్యాప్‌టాప్‌లూ ఉంటే కొన్నింటిలో కనీస వసతులు కూడా లేకపోవడం వాస్తవం. ఈ అంతరాన్ని తగ్గించేలా కొత్త ఆర్థిక విధానాలు రూపొందితే ప్రయోజనం ఉంటుంది. 

సాక్షి ఎడ్యుకేష‌న్ : డిజిటల్‌ అంతరాలను తగ్గించేందుకు ఒరెగాన్‌ యూనివర్శిటీ ఏం చేస్తోంది?
జయతి : మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ మా యూనివర్శిటీలో మూడొంతుల మంది విద్యార్థులు మొట్ట మొదటిసారి కాలేజీలోకి అడుగుపెడుతున్న వారు. వీరందరికీ కూడా కృత్రిమ మేధ వంటి అత్యాధునిక టెక్నాలజీలపై బోధన జరుగుతోంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతులు రెండింటిలోనూ కోర్సులు అందిస్తున్నాం. 

సాక్షి ఎడ్యుకేష‌న్ : కృత్రిమ మేధ రంగంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉండబోతున్నాయి?
జయతి : ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం చెప్పడం కూడా తొందరపాటు అవుతుందని అనుకుంటున్నాను. ఎల్‌ఎల్‌ఎంలు, ప్రాంప్ట్‌ ఇంజినీరింగ్‌ వంటివి ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ మేధ టెక్నాలజీల్లో ఉద్యోగాలకు ఉపయోగపడవచ్చు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. సమీప భవిష్యత్తులో కృత్రిమ మేధ అనేది కేవలం కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌కు మాత్రమే పరిమితం కాదు. మెకానికల్‌ వంటి ఇతర బ్రాంచ్‌లకూ విస్తరిస్తుంది. వ్యవసాయంతోపాటు అన్ని రంగాల్లోనూ దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఏం జరగబోతుంది అని ఇప్పుడే చెప్పడం కష్టం. అవకాశాలు బోలెడు వస్తాయని మాత్రం చెప్పవచ్చు. 

సాక్షి ఎడ్యుకేష‌న్ : మరి... కృత్రిమ మేధ రంగంలో ఉపాధి పొందాలని అనుకునే వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది?
జయతి: మొట్టమొదటి సవాలు. అప్‌-టు-డేట్‌గా ఉండటం. ఎందుకంటే ఈ టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతూంటుంది. ఈ రోజు ఉన్న ఛాట్‌జీపీటీ రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదు. బహుశా సమీప భవిష్యత్తులో ఏఐ కోర్సులు ఏడాదికోసారి మార్చాల్సి వస్తుందేమో. అటువంటి పరిస్థితుల్లో ఏఐలో ఉపాధి వెతుక్కునే వాళ్లు.. అప్‌-టు-డేట్‌గా ఉండటం చాలా కీలకం అవుతుంది. 

సాక్షి ఎడ్యుకేష‌న్ : మీరు స్వతహాగా మెకానికల్‌ ఇంజినీర్‌. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకునేందుకు మెకానికల్‌ ఇంజినీరంగ్‌ పరిష్కారాలు సాధ్యమని భావిస్తున్నారా?
జయతి : ఇంజినీరింగ్‌ రంగం ఒక్కదానితోనే వాతావరణ మార్పుల సమస్యను అధిగమించలేము. ఇంజినీరింగ్‌ కొన్ని రకాల సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిష్కారాలను అందివ్వవచ్చు. కానీ.. అసలు సమస్యలు సామాజిక, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నవి. వాతావరణం నుంచి కర్బన ఉద్గారాలను నేరుగా పీల్చేసే టెక్నాలజీలపై కొంతవరకూ ఏకాభిప్రాయం కుదిరినా.. ఆయా దేశాల స్థాయిలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలు కూడా ప్రభావం చూపుతాయి. దేశాలన్నీ కలిసికట్టుగా ముందకు కదిలినప్పుడే వాతావరణ మార్పుల వంటి సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుందని నేను భావిస్తున్నాను. 

సాక్షి ఎడ్యుకేష‌న్ : రోబోలు మనకు దశాబ్దాలుగా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వస్తున్న కృత్రిమ మేధ ఈ రోబోటిక్స్‌తో ఎప్పుడు కలసిపోతాయి?
జయతి: ఇప్పటికే కలిసిపోయాయని చెప్పాలి. ఎలాన్‌ మస్క్‌ లాంటి వాళ్లు ప్రతిపాదించిన న్యూరల్‌ లింక్‌ వంటివి ఇప్పటికే మొదలయ్యాయి. నిజానికి రొబోటిక్స్‌, కృత్రిమ మేధ రెండూ వేర్వేరు కాదు. ఒక్కటే అని చెప్పాలి. చూపు మొదలుకొని, ఇతర అన్ని మానవ సంబంధిత ఇంద్రియ జ్ఞానాలను రోబోట్లకు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంప్యూటర్‌ విజన్‌ వంటివాటిని రొబోటిక్స్‌, డ్రైవర్ల అవసరం లేని కార్లలో ఇప్పటికే ఏఐతో కలిపి వాడుతున్నారు. ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్లూ అందుబాటులోకి వస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ రొబోటిక్స్‌, ఏఐ రెండూ కీలకం. ఇందుకు తగ్గట్టుగా ఒరెగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ వాతావరణం, సుస్థిరాభివృద్ధి, కాలుష్య రహిత ఇంధన ఉత్పత్తి, రొబోటిక్స్‌, బయాలజీ, ఆరోగ్యం వంటి రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఒరెగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీలో విద్యార్థులు ఎంతమంది? ఏ ఏ దేశాల వారు ఉన్నారు?
జయతి : విదేశీ విద్యార్థులు రెండు వేల మంది వరకూ ఉన్నారు. భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 400. ఒరెగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీ అబ్రహాం లింకన్‌ కాలంలో ఏర్పాటైన లాండ్‌ గ్రాంట్‌ యూనివర్శిటీ. రైతులు, పశు పోషకుల వంటివారికి సాయం చేసే లక్ష్యంతో ఏర్పాటైన వర్శిటీలు లాండ్‌ గ్రాంట్‌ యూనివర్శిటీలంటారు. అందుకే మా యూనివర్శిటీ అటవీ, వ్యవసాయ, ఇంజినీరింగ్‌ రంగాల్లో బలంగా ఉంది. ర్యాంకింగ్‌ల విషయానికి వస్తే సముద్ర శాస్త్రం, వాతావరణ శాస్త్రాల్లో వర్శిటీకి మంచి పేరుంది. అంతేకాకుండా... కంప్యూటర్స్‌ సైన్స్‌ రంగలో దేశంలోనే అతిపెద్ద అండర్‌గ్రాడ్యుయేట్‌ సంస్థ మాది.

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఒరెగాన్‌ యూనివర్శిటీలో కృత్రిమ మేధ సాయంతో వ్యవసాయ రంగంపై ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి?
జయతి: రెండేళ్ల క్రితం ఓఎస్‌యూ పూర్వ విద్యార్థి, ఎన్‌విడియా అధిపతి జెన్‌సెంగ్‌ హువాంగ్‌ ఒరెగాన్‌ స్టేట్‌ యూనివర్శిటీకి భారీ విరాళం అందించారు. ఇందులో అత్యాధునిక ఎన్‌విడియా జీపీయూ సూపర్‌ కంప్యూటర్‌ కూడా ఉంది. దీని సాయంతో ప్రస్తుతం మేము కృత్రిమ మేధను వాడుకుని వ్యవసాయంపై పలు పరిశోధనలు చేస్తున్నాం. యూనివర్శిటీ పరిధిలోని అటవీ ప్రాంతం, వ్యవసాయ క్షేత్రాల ద్వారా సమాచారం సేకరించి ఈ సూపర్‌ కంప్యూటర్‌ ద్వారా పెద్ద ఎత్తున కంప్యూటేషన్‌ చేస్తున్నాం. విసృ‍్తత సమాచారాన్ని కంప్యూటర్‌ మోడళ్లుగా మలచడంలో కృత్రిమ మేధ చాలా ఉపయోగకరమైంది. ఎన్‌విడియా వద్ద ఉన్న అతిపెద్ద గ్లోబల్‌ ఎర్త్‌ సిములేటర్‌ను కూడా ఉపయోగించుకుంటున్నాం. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రపంచస్థాయి మోడళ్ల ఆధారంగా.. స్థానిక వాతావరణంపై వాటి ప్రభావం ఎలా ఉంటుందన్నది అర్థం చేసుకుంటున్నాము. రానున్న వందేళ్లలో వాతావరణ మార్పులను తట్టుకుని మనగలిగే పంటలు ఏవి? పంటల నీటి అవసరాలు, నేల సారం, చీడపీడల బెడద వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాం. ఒరెగాన్‌ యూనివర్శిటీ సముద్రతీరంలో ఉన్న నేపథ్యంలో మత్స్య, ఇతర జలచరాలపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాం. వ్యవసాయ సమస్యలు తీర్చేందుకు ఇంజినీరింగ్‌ సెన్సర్ల రూపంలో కొంతవరకూ సాయపడవచ్చు కానీ.. జీవ, రసాయన శాస్త్రాల అవసరమూ ఉంటుంది. 

సాక్షి ఎడ్యుకేష‌న్ : యూనివర్శిటీలో సుమారు 130 ఏళ్లుగా వ్యవసాయ పరిశోధన ఒకటి కొనసాగుతోందని విన్నాము. దాని వివరాలు?
జయతి : ఒరేగాన్‌ రాష్ట్రం తూర్పు ప్రాంతంలో సీబార్క్‌ అనే వ్యవసాయ పరిశోధన క్షేత్రం ఉంది. అక్కడ గోధుమ, బార్లీ, చిక్కుళ్లు, కాయధాన్యాలపై, నేల, చీడపీడలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఏఐ సాయంతో ఈ సమాచారాన్ని విశ్లేషించేందుకు తద్వారా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాము. అలాగే వర్శిటీలోని ఒక ప్రాంతంలో ఉన్న చెట్లు అన్నింటికీ సెన్సర్లు ఏర్పాటు చేశాము. అవి పంపే సమాచారాన్ని... వాతావరణ వివరాలతో సరిచూసుకుని భవిష్యత్తులో ఏ పరిస్థితిలో ఏమవుతుందనే విషయాలను అంచనా కట్టగలుగుతున్నాము. 

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఛాట్‌జీపీటీ వంటి ప్రస్తుత జనరేటివ్‌ ఏఐ మోడళ్లు ట్యూరింగ్‌ టెస్ట్‌ను పాస్‌ అయ్యాయా?
జయతి: నాకు తెలిసి ఏవీ పాస్‌ కాలేదు. వాస్తవం చెప్పాలంటే ట్యూరింగ్‌ టెస్ట్‌ అంటే ఏదో ఒక్కటి మాత్రమే కాదు. చాలా రకాలు ఉన్నాయి. ప్రస్తుత జనరేటివ్‌ ఏఐ మోడళ్లు ఏదో ఒక టెస్ట్‌ పాస్‌ అయ్యే ఉంటాయి. అయితే వీటి పరిధి చాలా పరిమితమైంది. ఛాట్‌బోట్లను సేల్స్‌, మార్కెటింగ్‌ వంటి పరిమిత ప్రయోజనాలకు వాడుకునేలా టెస్ట్‌లు ఉంటాయి. సంక్లిష్టమైన, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ దిశగా ఉండవు. అయితే మనం మాట్లాడుతున్నది కృత్రిమ మేధతో అన్న విషయాన్ని సమర్థంగా కప్పిపుచ్చగల ట్యూరింగ్‌ టెస్ట్‌తో పరీక్షలు చేశారా లేదా అన్నది అస్పష్టం. 

సాక్షి ఎడ్యుకేష‌న్ : కృత్రిమ మేధ మానవజాతిపై పెత్తనం చెలాయించే రోజు వస్తుందా?
జయతి: లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడళ్ల వంటి కృత్రిమ మేధ టెక్నాలజీలు చాలా బాగున్నాయి. కానీ ఇవేవీ ఆర్టిఫిషల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏజీఐ)కు చాలా చాలా దూరం. అయితే ఒక్క విషయం. ఐదేళ్ల క్రితం ఛాట్‌జీపీటీ వంటిది సాధ్యమవుతుందని ఎవరూ అనుకోలేదు. ఈ రంగంలో మార్పులు చాలా వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదకరమా? కాదా? అన్నది ఇప్పుడిప్పుడే చెప్పలేము. కాకపోతే మానవజాతిపై పెత్తనం చెలాయిస్తుందా? వంటి ప్రశ్నలు రావడం మంచిదే. ప్రజల్లో కృత్రిమ మేధపై అవగాహన మరింత పెరుగుతుంది. తద్వారా జాగ్రత్తగా ఉండేందుకు అవకాశమూ ఏర్పడుతుంది.

Published date : 05 Jul 2024 03:35PM

Photo Stories