ఉజ్వల భవిష్యత్తుకు ‘నవోదయం’
జేఎన్‌వీలో 2024–2025 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో 1986 జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు 1986లో నల్లగొండ జిల్లాకు సంబంధించి అప్పటి శాసనసభ నియోజకవర్గమైన చలకుర్తి గ్రామంలో 45 ఎకరాల విస్తీర్ణంలో జేఎన్‌వీని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష ద్వారా 6వ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. 6 నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి సౌకర్యం కల్పిస్తారు. 6 నుంచి 8వ తరగతి వరకు ప్రాంతీయ భాష లేదా మాతృ భాషలో విద్యాబోధన జరుగుతుంది. ఆ తరువాత తరగతులలో గణితం, సైన్స్ సబ్జెక్టులు ఆంగ్ల భాషలోనూ, సామాజిక శాస్త్రములు హిందీ భాషలోనూ బోధిస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో తరగతిలో 80 మంది విద్యార్థులు, 11, 12 తరగతులలో 40 మంది చొప్పున విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు.
దరఖాస్తు చేసుకునే విధానం..
2024–25 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో ప్రవేశానికి ఽఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారంపై ప్రస్తుతం విద్యార్థి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం చేయించిన తర్వాతే వెబ్‌సైట్ నందు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 5వ తరగతి ఏ పాఠశాలలో చదువుతున్నారో అక్కడి నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ఫారంపై విద్యార్థి, తండ్రి సంతకాలు తప్పకుండా ఉండాలి. ఫొటో కూడా అప్‌లోడ్ చేయాలి. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జేఎన్‌వీనల్గొండ.ఇన్ ద్వారా లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నవోదయ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 10వ తేదీ ఆఖరు.
ఎవరు అర్హులు..?
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతూ 01.05.2012 నుంచి 31.07.2014 మధ్య జన్మించిన వారు అర్హులు. ప్రవేశ పరీక్ష 2024 జనవరి 20వ తేదీన ఉదయం 11.30 నుంచి 1.30 వరకు రెండు గంటల పాటు నిర్వహిస్తారు.
రిజర్వేషన్ విధానం
6వ తరగతిలో మొత్తం 80 సీట్లు ఉండగా అందులో 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. గ్రామీణ ప్రాంత రిజర్వేషన్ వర్తించాలంటే 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంతాలలో చదివి ఉండాలి. ఏ ఒక్క రోజు పట్టణ ప్రాంతాలలోనూ, మున్సిపాలిటీలలో చదివినా గ్రామీణ ప్రాంత రిజర్వేషన్ వర్తించదు. ఎట్టి పరిస్థితులలోనూ ఒకసారి పరీక్షకు హాజరైన విద్యార్థి రెండోసారి హాజరయ్యేందుకు వీల్లేదు. ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 7.5శాతం, బాలికలకు మొత్తం సీట్లలో 1/3వ వంతు రిజర్వేషన్ ఉంటుంది. అభ్యర్థి ఐదో తరగతిలో ఏ మాధ్యమంలో విద్యాభ్యాసం చేస్తారో.. ఆ భాషలోనే పరీక్ష ఉంటుంది. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న ఫారం, ప్రవేశ పత్రంలో పేర్కొన్న భాషలోనే టెస్టు బుక్‌లెట్ ఇస్తారు. దరఖాస్తు ఫారంలోనూ, ప్రవేశ పత్రంలో పరీక్షా మాధ్యమం ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ప్రవేశ పరీక్ష మూడు విభాగాలలో కలిపి 80 ప్రశ్నలు ఆబ్టెక్టివ్ రూపంలో ఉంటాయి. రీజనింగ్ 40 ప్రశ్నలు, గణితంపై 20 ప్రశ్నలు, భాషా పరిజ్ఞానంపై 20 ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు సమాధానాలను ఓఎంఆర్ పత్రంలో పూరించాలి.