Education: చదువుతోనే భవిష్యత్
పాన్‌గల్: రామాయణం రచించిన వాల్మీకిని స్ఫూర్తిగా తీసుకొని చదువుకు ప్రాధాన్యమిస్తూ పిల్లలను బాగా చదివించాలని రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్, వాల్మీకి సంఘం నాయకుడు గట్టు తిమ్మప్ప అన్నారు. ఆదివారం మండలంలోని బండపల్లిలో సర్పంచ్ రాజేశ్వరమ్మ, జెడ్పీటీసీ మాజీ రామ్మూర్తినాయుడు అధ్యక్షతన నిర్వహించిన వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పార్టీలు వేరైనా వాల్మీకులందరూ సంఘటితంగా ఉంటూ తమ హక్కుల సాధనకు పోరాడాలన్నారు. ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చెల్లప్ప కమిటీని నియమించిందని.. ఆ కమిటీ కేంద్రానికి నివేదిక అందించిందని, త్వరలోనే అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని
వివరించారు. చదువుతోనే సమాజంలో మార్పు, భవిష్యత్ ఉంటుందని.. వాల్మీకులందరూ తమ పిల్లలను మంచిగా చదివించి ప్రయోజకులను చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఆయనను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నాయకులు వేణుగోపాల్‌నాయుడు, టీకే కురమన్న, నీలస్వామినాయుడు, హరిశంకర్‌నాయుడు, తిరుమలేష్‌నాయుడు, అయ్యన్న, రమణ, బీజేపీ రాష్ట్ర మోర్చా అధికార ప్రతినిధి రోజారమణి, బాలమణెమ్మ, మధుబాబు పాల్గొన్నారు.