CTET: సజావుగా సీటెట్
గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్) ఆదివారం సజావుగా జరిగింది. గుంటూరు నగర పరిధిలోని తొమ్మిది పరీక్ష కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగిన పరీక్షలకు జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సీబీఎస్‌ఈ బోర్డుకు చెందిన ప్రతినిధులు స్వయంగా పరీక్ష కేంద్రాలను సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పేపర్–1 పరీక్షకు దరఖాస్తు చేసిన 3,728 మంది అభ్యర్థుల్లో 2,195 మంది హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్–2 పరీక్షకు దరఖాస్తు చేసిన 2,430 మంది అభ్యర్థుల్లో 1,379 మంది చొప్పున హాజరయ్యారు. నగరంలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచి అభ్యర్థుల కోలాహలం మొదలైంది. ఆయా పరీక్షా కేంద్రాల ప్రధాన ద్వారం వద్ద అభ్యర్థుల హాల్ టికెట్ల నంబర్లతో రూమ్ నంబర్లు జాబితాను ప్రదర్శించారు. పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించే ముందు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.