Artificial Intelligence : డిజిటల్ యుగంలో అన్ని రంగాలకు విస్తరిస్తున్న కృత్రిమ మేథ.. భవిష్యత్‌లో భారీగా కొలువులు!
ఇటీవల కాలంలో ఉత్పత్తులు, సేవలు వేగంగా అందించడంలో కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్ తోడ్పాటు ఎంతో ఉంది. అందుకే ఏఐ, ఎంఎల్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఏఐ–ఎంఎల్ స్కిల్స్ సొంతం చేసుకుంటే భవిష్యత్‌లో భారీగా కొలువులు లభిస్తాయని తాజా నివేదికల అంచనా.
ఈ నేపథ్యంలో.. ఏఐ–ఎంఎల్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం, ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలు పెంచుకునేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం..
ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ డిజిటల్ టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఏఐ, ఎంఎల్ వినియోగం పెరుగుతోంది. ఐటీ నుంచి బ్యాంకింగ్ వరకు.. ఈ–కామర్స్ మొదలు ఎడ్యుకేషన్ సెక్టార్ దాకా.. కృత్రిమ మేథ కీలకంగా మారుతోంది. ఇదే ధోరణి బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్ తదితర రంగాల్లోనూ కనిపిస్తోంది. గతేడాది నియామకాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందే ఉద్యోగంగా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ప్రొఫైల్ గుర్తింపు పొందింది. వరల్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా ప్రకారం–2025 చివరికి మొత్తంగా 97 మిలియన్‌ల ఉద్యోగాలు ఏఐ–ఎంఎల్‌లో లభించనున్నాయి. ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2023 ప్రకారం–2027 నాటికి ఏఐ–ఎంఎల్ స్పెషలిస్ట్‌ల సంఖ్య ఏకంగా 40 శాతం పెరనుంది.
☛Follow our YouTube Channel (Click Here)
ఏఐ–ఎంఎల్ పనిచేస్తుందిలా
ఏఐ అంటే మానవ ప్రమేయం లేకుండా యంత్రాలే స్వయంగా పనిచేసేలా చూడటం. ఇటీవల కాలంలో చర్చనీయాంశమైన డ్రైవర్ లెస్ కార్లనే తీసుకుంటే.. వీటిల్లో ఏఐ సాంకేతికత, సెన్సార్లు, కెమెరాలు వంటివి పొందుపరుస్తారు. ఇందుకోసం అవసరమైన కోడింగ్, ప్రోగ్రామింగ్‌లను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ కోడింగ్, ప్రోగ్రామింగ్ రూపొందించే వారినే ఏఐ–ఎంఎల్ నిపుణులుగా పేర్కొంటున్నారు. అదే విధంగా అమెజాన్ అసిస్టెంట్, అలెక్సా సర్వీసెస్ వంటివి కూడా ఏఐ పరిజ్ఞానంతోనే సాధ్యమవుతున్నాయి.
మెషీన్ లెర్నింగ్
మెషీన్ లెర్నింగ్ అనేది ఏఐకు అనుసంధాన విభాగం. డేటాను విశ్లేషించడం, ప్రోగ్రామింగ్‌లు రూపొందించడం మెషీన్ లెర్నింగ్ ప్రత్యేకతగా పేర్కొనొచ్చు. డేటాసైన్స్, డేటా మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్‌ల సమ్మిళితంగా మెషిన్ లెర్నింగ్ కార్యకలాపాలు ఉంటాయి. వీటిని నిర్వహించే నిపుణులకు డిమాండ్ నెలకొంది. మెషిన్ లెర్నింగ్ అభ్యర్థులు కంప్యూటర్ బేసిక్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ నైపుణ్యాలను పెంచుకోవాలి. మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యుటేషనల్ స్కిల్స్, డేటా మోడలింగ్, సాఫ్ట్‌వేర్ డిజైన్, డెవలప్‌మెంట్ వంటి అంశాలపై పట్టు సాధిస్తే.. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్ పరంగా మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుంది.
ఎన్‌ఎల్‌పీ.. ఎమర్జింగ్ స్కిల్
ఏఐ–ఎంఎల్‌లో.. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పీ)అత్యంత కీలకమైన స్కిల్‌గా నిలుస్తోంది. ఏఐ యంత్రాలకు,సాంకేతిక సిబ్బందికి, వినియో గదారులకు మధ్య ఇంటరాక్టివ్ టూల్ ఎన్‌ఎల్‌పీ. ఉదాహరణకు గూగుల్ ట్రాన్స్‌లేట్, ఓకే గూగుల్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానంలో ఆన్‌లైన్ ద్వారానే మనకు సమాచారం లభిస్తోంది. ఇందుకు ఎన్‌ఎల్‌పీ దోహదపడుతోంది. దీంతో సంస్థలు ఎన్‌ఎల్‌పీ వినియోగంపై ఆసక్తి చూపుతున్నాయి. దాన్ని తమ కార్యకలాపాల్లో వినియోగిస్తున్నారు.
☛ Follow our Instagram Page (Click Here)
డీప్ లెర్నింగ్
మానవ మేధస్సుకు అనుగుణంగా కంప్యూటర్స్‌లో నిర్దిష్టంగా ఒక డేటా ప్రక్రియను పూర్తి చేసే విధానమే.. డీప్ లెర్నింగ్. ఫలితంగా చిత్రాలు, టెక్స్›్ట, సౌండ్స్, ఇతర డేటాలను గుర్తించి కచ్చితమైన అంచనాలు రూపొందించే అవకాశం లభిస్తుంది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరమైన విభాగాల్లో సైతం డీప్ లెర్నింగ్ ద్వారా ఆయా పనులు ఆటోమేటిక్ టాస్క్ రూపంలో పూర్తి చేయొచ్చు. డిజిటల్ అసిస్టెన్స్, ఫ్రాడ్ డిటెక్షన్, ఆటోమేటిక్ ఫేషియల్ రికగ్నిషన్ వంటి కార్యకలాపాలలో డీప్ లెర్నింగ్ మెథడ్స్ ఉపయోగపడుతున్నాయి. డీప్ లెర్నింగ్ మోడల్స్ అనేవి డేటా సైంటిస్ట్‌లు ఒక అల్గారిథమ్, లేదా అప్పటికే నిర్దేశించిన నమూనాలో ఆయా టాస్క్‌లను పూర్తి చేయడానికి ఉపయోగించే కంప్యూటర్స్ ఫైల్స్‌గానూ పేర్కొనొచ్చు.
జావా లాంగ్వేజ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో జావా ప్రధానమైన కంప్యూటర్ లాంగ్వేజ్‌గా ఉంది. ఈ సాఫ్ట్‌వేర్ లాంగ్వేజ్ ద్వారా న్యూరల్ నెట్‌వర్క్స్, ఎన్‌ఎల్‌పీ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్‌ను సమర్థవంతంగా పూర్తి చేయొచ్చు. ముఖ్యంగా ఏఐ అల్గారిథమ్‌కు అనుగుణంగా కోడింగ్ రాయడానికి జావా ఎంతో కీలకం. ప్రస్తుతం ఏఐలో డేటా ప్రాసెస్, డెసిషన్ మేకింగ్, ఇంటెలిజెంట్ చాట్‌బోట్స్ రూపకల్పనలో ఎక్కువగా జావా లాంగ్వేజ్‌పైనే ఆధారపడుతున్నారు. దీంతో.. ఈ లాంగ్వేజ్ నైపుణ్యాలున్న వారికి ఏఐ–ఎంఎల్ విభాగంలో కొలువులు లభిస్తున్నాయి.
పైథాన్
కంప్యూటర్ లాంగ్వేజెస్‌లో జావా స్క్రిప్ట్, సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్‌ల ప్రాధాన్యం తెలిసిందే. వీటితోపాటు జనరల్ పర్పస్ కోడింగ్ లాంగ్వేజ్‌గా పేర్కొనే పైథాన్ లాంగ్వేజ్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం.. కోడింగ్‌తోపాటు ఇతర ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కోణంలో ఇది అత్యంత సులభంగా ఉండడమే. ముఖ్యంగా బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, సిస్టమ్ స్క్రిప్ట్ రైటింగ్‌లో పైథాన్ ఉపయోగపడుతోంది. ఈ స్కిల్స్ పెంచుకుంటే అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు.
☛ Join our WhatsApp Channel (Click Here)
టెన్సార్స్ ఫ్లో
ఏఐ టూల్స్‌లో భాగంగా కంపెనీలు వినియోగిస్తున్న మరో స్కిల్‌గా.. టెన్సార్స్ ఫ్లో నిలుస్తోంది. పైథాన్ కోడింగ్ ద్వారా రూపొందించిన ప్రోగ్రామ్స్, సాఫ్ట్‌వేర్స్‌కు సంబంధించి న్యూమరికల్ కంప్యూటేషన్‌ను సులభంగా పూర్తి చేసి, మెషీన్ లెర్నింగ్ ప్రక్రియను పైథాన్–ఫ్రెండ్లీగా మార్చేందుకు గూగుల్ రూపొందించిన టెన్సార్‌ఫ్లో వైపు కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.
డేటా సైన్స్.. భారీ డిమాండ్
ఏఐ–ఎంఎల్‌లో మరో డిమాండింగ్ స్కిల్.. డేటా సైన్స్. సంస్థలు మార్కెట్ ట్రెండ్స్ విశ్లేషణకు, సేవలు, ఉత్పత్తులు అందించేందుకు డేటా సైన్స్‌పైనే ఆధారపడుతున్నాయి. కోర్ నుంచి మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టార్‌లో సైతం డేటా సైన్స్ నిపుణుల ఏర్పడుతోంది. గణాంకాల ఆధారంగా తక్కువ వ్యయంతో, నాణ్యమైన ఉత్పత్తిని రూపొందించే విధానాలు, కస్టమర్లు కోరుకుంటున్న ఫీచర్స్ తదితర అంశాలతో నివేదిక ఇవ్వడం డేటా సైన్స్ విభాగంలో ప్రధానంగా నిలుస్తోంది.
డేటా సైన్స్ విభాగంలో విధులు నిర్వహించే అభ్యర్థులు స్టాటిస్టిక్స్, అల్గారిథమ్స్, డేటా అనాలిసిస్, మెషీన్ లెర్నింగ్, కోడింగ్, ప్రోగ్రామింగ్ బృందాలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఇలా అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ఒక ఉత్పత్తి లేదా సేవకు సంబంధించి.. కంపెనీలు వినియోగదారులకు చేరువయ్యే ప్రణాళిక రూపొందించడం డేటాసైన్స్ నిపుణుల విధులుగా ఉంటున్నాయి.
నైపుణ్యార్జనకు మార్గాలు
దేశంలోని ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు బీటెక్ స్థాయిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌తో పూర్తి స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. దీంతో పాటు పీజీ స్థాయిలో కూడా ఏఐ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఐబీఎం, ఇంటెల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఏఐలో స్వల్పకాలిక ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. వీటి కాల వ్యవధి నెల రోజుల నుంచి నాలుగు నెలల వరకు ఉంటోంది. వీటిని పూర్తి చేసుకుని సంబంధిత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఇండస్ట్రీ వర్గాల్లోనూ గుర్తింపు లభిస్తోంది. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వల్పకాలిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏఐ–ఎంఎల్ విభాగంలో స్థిరపడడానికి పైన పేర్కొన్న నైపుణ్యాలతోపాటు కంప్యూటింగ్ స్కిల్స్, స్టాటిస్టికల్ స్కిల్స్, డేటా సైన్స్ స్కిల్స్ కీలకంగా నిలుస్తున్నాయి.
☛ Join our Telegram Channel (Click Here)
జాబ్ ప్రొఫైల్స్.. వేతనాలు
ఏఐ–ఎంఎల్‌లో సంబంధిత నైపుణ్యాలు పొందిన వారికి ఏఐ/ఎంఎల్ ఇంజనీర్, ఏఐ అసోసియేట్, ప్రాజెక్ట్ మేనేజర్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రారంభంలోనే సగటు వార్షిక వేతనం రూ.6 లక్షలుగా ఉంటోంది. ఐటీ సంస్థలే కాకుండా..బ్యాంకింగ్, హెల్త్‌కేర్, ఎడ్‌టెక్, ఈ–కామర్స్ వంటి పలు రంగాల్లోనూ ఉద్యోగాలు దక్కించుకునే అవకాశముంది.
Tags
- artificial intelligence
- Job Opportunity
- digital era
- AI-ML
- Technology Development
- technology skills
- ai jobs
- data science
- huge demand
- Flow of tensors
- AI Demand in Job Field
- digital field demand for jobs
- Education News
- Sakshi Education News
- ArtificialIntelligence jobs
- AITraining
- AICareer
- JobOpportunities in AI