IIIT Hyderabad: 77 ఏళ్ల వయసులో పీజీ పూర్తి..లేటు వయసులో.. కాలేజీ బాట!

సాక్షి, సిటీబ్యూరో: నేర్చుకోవాలనే తపన.. సంకల్ప బలం.. సాధిస్తామనే ధీమా ఉంటే చాలు.. ఎన్ని అద్భుతాలైన సృష్టించవచ్చు. ఇదే విషయాన్ని 77 ఏళ్ల వయసులో నిరూపించారు లక్ష్మీనారాయణ శాస్త్రి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్ అయిన ఎస్‌ఎల్‌ఎన్ శాస్త్రి.. తాజాగా అదే వర్సిటీలోని ఎర్త్‌క్వేక్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ నుంచి పీజీ పట్టా పొందారు. వయసుతో సంబంధం లేకుండా నిత్య విద్యార్థిగా కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలని ఆయన నిరూపించారు.
1947లో జన్మించిన ఎస్‌ఎల్‌ఎన్ శాస్త్రి.. ఏఈఈగా తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీ నిర్మాణంలో మొదటి నుంచీ కీలకపాత్ర పోషించారు. క్యాంపస్ నిర్మాణం, ప్రణాళిక రూపకల్పనలో ఆయన ముందుండి నడిపించారు. ఇక, ప్రొఫెసర్ రామంచర్ల ప్రదీప్‌కుమార్, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు మందాడి ప్రోత్సాహంతో పీజీ చేయాలనే ఆలోచన వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
Also read: The Inspiring Journey of Tanisha: 12 సంవత్సరాలు వైకల్యాన్ని దాచిపెట్టిన బంగారు పతక విజేత!
క్లాస్‌రూం అనుభూతే వేరు..
ఈ వయసులో క్లాసురూమ్‌కు వెళ్లి పాఠాలు వినడం చాలా సంతోషం అనిపించింది. కాలేజీ రోజులు గుర్తొచ్చాయి. విజయవాడలోని 20 పాత భవనాల్లో భద్రత అంశంపై నా కోర్సులో భాగంగా పరిశోధన చేశాను. ప్రొఫెసర్ ప్రదీప్ నన్ను అడుగడుగునా ప్రోత్సహించారు. పీహెచ్‌డీ కోసం పాత భవనాలకు ఇంజినీరింగ్ పరిష్కారాలపై పరిశోధన చేస్తాను.
– ఎస్‌ఎల్‌ఎన్ శాస్త్రి