Exams: ఒత్తిడి తగ్గేదెలా..? ముందుకు సాగేదెలా..?
వార్షిక పరీక్షల విధానానికి స్వస్తి పలికి.. 2021–22 విద్యా సంవత్సరాన్ని రెండు టర్మ్‌లుగా విభజించింది. ఫస్ట్ టర్మ్ పరీక్షలు 2021 నవంబర్/డిసెంబర్‌లో నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. సీబీఎస్‌ఈ రెండు టర్మ్‌ల పరీక్ష విధానం.. విద్యార్థులకు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం...
సీబీఎస్‌ఈ బోర్డ్ విద్యా విధానం అంటేనే ఒక ప్రత్యేక గుర్తింపు. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, కేస్ స్టడీ ఆధారిత బోధన.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు. వీటితో విద్యార్థులకు లభించే క్షేత్ర స్థాయి నైపుణ్యాలు కూడా ఎక్కువే. కానీ.. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పదో తరగతి, +2ల విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో 2021–22 విద్యా సంవత్సరంలో బోధన, పరీక్షలు, మూల్యాంకన పరంగా సీబీఎస్‌ఈ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది.
సిలబస్ విభజన :
సీబీఎస్‌ఈ.. 2021–22 విద్యా సంవత్సరాన్ని రెండు టర్మ్‌లు.. టర్మ్–1, టర్మ్–2గా విభజించింది. మొత్తం సిలబస్‌లో.. టర్మ్–1లో యాభై శాతం సిలబస్‌ను, మిగతా యాభై శాతం సిలబస్‌ను టర్మ్–2లో బోధించాలని నిర్ణయించింది. నిపుణుల కమిటీ మొత్తం సిలబస్‌ను పరిశీలించి.. రెండు టర్మ్‌లలో నిర్దిష్టంగా ఉండాల్సిన సిలబస్ అంశాలను స్పష్టంగా పేర్కొంది.
టర్మ్–1 పరీక్షలు :
➤ సీబీఎస్‌ఈ.. టర్మ్–1 పరీక్షలను నవంబర్/డిసెంబర్ నెలల్లో నిర్వహించనుంది.
➤ పరీక్ష సమయం ఒక్కో పేపర్‌కు 90 నిమిషాలు.
➤ పరీక్షలో బహుళైచ్ఛిక ప్రశ్నలు(ఎంసీక్యూస్), కేస్ ఆధారిత ఎంసీక్యూలు, అసెర్షన్–రీజనింగ్ ఎంసీక్యూలు ఉంటాయి. అంటే.. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే టర్మ్–1 పరీక్ష జరుగుతుంది.
➤ టర్మ్–1కు పేర్కొన్న సిలబస్ నుంచే ప్రశ్నలు అడుగుతారు.
➤ విద్యార్థులు ఓఎంఆర్ షీట్‌లో సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది.
➤ ఒకవేళ టర్మ్–1 పరీక్షల(నవంబర్/డిసెంబర్) నాటికి కరోనా ప్రతికూలంగానే ఉండి.. అప్పటికీ పాఠశాలలు తెరుచుకోకపోతే.. విద్యార్థులు ఇంటి నుంచే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తారు.
టర్మ్–2 పరీక్షలు :
➤ సీబీఎస్‌ఈ.. టర్మ్–2 పరీక్షలను వార్షిక(ఇయర్ ఎండ్) పరీక్షలుగా పేర్కొంది.
➤ టర్మ్–1కు నిర్దేశించిన సిలబస్‌ను మినహాయించి.. మిగతా యాభై శాతం సిలబస్‌తోనే టర్మ్–2 పరీక్షలు జరుగుతాయి. అంటే.. టర్మ్–1కు కేటాయించిన సిలబస్ నుంచి టర్మ్–2 పరీక్షల్లో ప్రశ్నలు ఉండవు.
➤ 2022 మార్చి/ఏప్రిల్ నెలల్లో టర్మ్–2 పరీక్షలు నిర్వహిస్తారు.
➤ ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండు గంటలు ఉంటుంది.
➤ టర్మ్–2 పరీక్షలు డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతాయి. ఈ పరీక్షల్లో కేస్ ఆధారిత, సిట్యుయేషన్ ఆధారిత ప్రశ్నలు, షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ కొశ్చన్స్‌కు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
➤ ఒకవేళ డిస్క్రిప్టివ్ పరీక్షలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలించకపోతే.. టర్మ్–2 పరీక్షలను కూడా ఆబ్జెక్టివ్ విధానంలో ఒక్కో పేపర్‌ను 90 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు.
తుది ఫలితాలు.. ఇలా
➤ విద్యార్థులు టర్మ్–1, టర్మ్–2 పరీక్షల్లో పొందిన మార్కులను క్రోడీకరించి తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఇందుకు నాలుగు రకాల విధానాలను అనుసరించనున్నారు.
➤ మొదటి విధానం ప్రకారం– టర్మ్–1, టర్మ్–2 రెండు పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలు ప్రకటించడం.
➤ రెండో విధానం ప్రకారం–టర్మ్–1 పరీక్షల నాటికి పాఠశాలలు తెరుచుకోక.. విద్యార్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఇంటి నుంచే పరీక్షలు రాస్తే.. ఇందులో పొందిన మార్కులకు తక్కువ వెయిటేజి ఇచ్చి; టర్మ్–2 పరీక్షల్లో సాధించిన మార్కులకు ఎక్కువ వెయిటేజి కల్పించి.. తుది ఫలితాలను, మార్కులను విడుదల చేయడం.
➤ మూడో విధానం ప్రకారం– ఒకవేళ టర్మ్–1 పరీక్షల సమయానికి పాఠశాలలు తెరుచుకొని... టర్మ్–2 పరీక్షలు జరిగే సమయానికి మళ్లీ కరోనా పరిస్థితులు ఏర్పడి మూతపడితే.. టర్మ్–1 పరీక్షల మార్కులకు ఎక్కువ వెయిటేజీ ఇచ్చి ఫలితాలు వెల్లడించడం.
➤ నాలుగో విధానం ప్రకారం–టర్మ్–1, టర్మ్–2 పరీక్షలు జరిగే సమయానికి కరోనా పరిస్థితులు కొనసాగి.. పాఠశాలలు తెరుచుకోకుండా.. ఆన్‌లైన్ తరగతులే అనివార్యమైన పరిస్థితులు ఏర్పడితే.. విద్యార్థులు ఇంటర్నల్ అసెస్‌మెంట్ లేదా ప్రాక్టికల్, ప్రాజెక్ట్ వర్క్‌ల్లో పొందిన మార్కులు.. ఆన్‌లైన్ విధానంలో ఇంటి నుంచే హాజరైన టర్మ్–1, టర్మ్–2 పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను ప్రకటించడం.
➤ ఫలితాల విడుదల సమయం లేదా టర్మ్–1, టర్మ్–2 పరీక్షల సమయానికి కరోనా పరిస్థితులను పరిశీలించి.. ఈ నాలుగు విధానాల్లో ఏదో ఒకటి అనుసరించనున్నారు.
కారణం ఇదేనా..?
2020–21లో +2 వార్షిక పరీక్షలు నిర్వహించలేదు. దాంతో తుది ఫలితాల వెల్లడికి విద్యార్థులు పది, పదకొండు(+1) తరగతుల్లో పొందిన మార్కులకు 30 శాతం చొప్పున, +2 మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా పదకొండో తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకోవడంపై ప్రతికూలత వ్యక్తమైంది. విద్యార్థులు పదకొండో తరగతిలో ప్రాక్టికల్స్, ఇతర ఇంటర్నల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం తక్కువనే వాదన వినిపించింది. అదే విధంగా పదో తరగతి స్టేట్ బోర్డ్‌లో చదివి.. ఇంటర్‌లో సీబీఎస్‌ఈకి మారే విద్యార్థులు కూడా ఉంటారని.. ఇలాంటి విద్యార్థులు పదో తరగతిలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమైంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సీబీఎస్‌ఈ.. 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి ముందుగానే నిర్దిష్ట విధి విధానాలు ప్రకటించింది.
ఇంటర్నల్స్.. ప్రాక్టికల్స్ :
ప్రస్తుత విద్యా సంవత్సరంలో.. యూనిట్ టెస్ట్‌లు, ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్స్ వర్క్స్‌ను ఇంటర్నల్ అసెస్‌మెంట్ కోణంలో నిర్వహించాలని పేర్కొంది. అయితే ఆన్‌లైన్ తరగతుల కారణంగా ప్రాజెక్ట్ వర్క్స్, కేస్ వర్క్స్ సరిగా చేయలేకపోతున్నామని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు.
ఒత్తిడి తగ్గుతుందా..?
➤ సీబీఎస్‌ఈ విడుదల చేసిన టర్మ్–1, టర్మ్–2 పరీక్షలు, మూల్యాంకన విధానంపై సానుకూల, ప్రతికూల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
➤ ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్‌లో కేవలం టర్మ్–2 సిలబస్ నుంచే ప్రశ్నలు అడుగుతారని స్పష్టం చేయడంపై సానుకూల అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు వార్షిక పరీక్షల కోసం మొత్తం సిలబస్ చదవాల్సిన పరిస్థితి ఉండదు. దాంతో విద్యార్థులపై కొంత ఒత్తిడి తగ్గుతుంది.
➤ టర్మ్ వారీగా నిర్దిష్టంగా సిలబస్‌ను పేర్కొని.. అందులోంచే ప్రశ్నలు అడుగుతుండటంతో.. విద్యార్థులు ప్రతి టర్మ్‌లో మంచి మార్కులు సాధించేందుకు వీలుంటుంది.
➤ మరోవైపు.. కొందరు విద్యార్థులు కొన్ని అంశాల్లో ముందంజలో, మరికొన్ని అంశాల్లో వెనుకంజలో ఉంటారని.. ఇలా వెనుకంజలో ఉన్న అంశాలు టర్మ్–2 సిలబస్‌లో ఎక్కువగా ఉంటే సదరు విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే ఆస్కారం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
➤ మొత్తంగా చూస్తే సీబీఎస్‌ఈ తాజాగా విడుదల చేసిన పరీక్షల విధి విధానాలు.. విద్యార్థులు బోర్డ్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు దోహదపడేలా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అన్ని అంశాలపై అవగాహన..
సీబీఎస్‌ఈ తాజా విధానం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. సిలబస్‌ను టర్మ్‌ల వారీగా విభజించడంతో విద్యార్థులు సిలబస్‌లోని అన్ని టాపిక్స్‌పై అవగాహన పొందే అవకాశం లభిస్తుంది. ప్రతి టర్మ్‌కు నిర్దిష్టంగా పేర్కొన్న సిలబస్‌పై పట్టు సాధించి.. మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. ఫలితంగా భవిష్యత్తులో పోటీ పరీక్షల్లోనూ రాణించే నేర్పు లభిస్తుంది. ఇంటర్నల్ మార్కుల కేటాయింపులో∙పాఠశాలలు పారదర్శకంగా వ్యవహరించేలా సీబీఎస్‌ఈ నిరంతర పర్యవేక్షణ సాగిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– డా‘‘ సాన్యమ్ భరద్వాజ్, సీబీఎస్‌ఈ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
సీబీఎస్‌ఈ పరీక్షల కొత్త విధానం..ముఖ్యాంశాలు :
➤ 2021–22 విద్యాసంవత్సరంలో రెండుసార్లు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు.
➤ టర్మ్–1, టర్మ్–2గా పది, పన్నెండో తరగతుల పరీక్షలు.
➤ ప్రతి టర్మ్‌కు నిర్దిష్టంగా పేర్కొన్న సిలబస్ నుంచే ప్రశ్నలు.
➤ ఫలితాల ప్రకటనలో రెండు టర్మ్‌లలో పొందిన మార్కుల క్రోడీకరణ.