Yogi Vemana University: నేటి నుంచి డిగ్రీ పరీక్షలు
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల సెమిస్టర్ పరీక్షలు ఈనెల 23వ తేదీ శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి వైఎస్‌ఆర్ జిల్లా పరిధిలో 57 పరీక్షా కేంద్రాల్లో 42,300 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. 2వ, 4వ, 5వ సెమిస్టర్‌ల విద్యార్థులు, 6వ సెమిస్టర్ (బ్యాక్‌లాగ్స్) విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈనెల 23 నుంచి జూలై 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు వైవీయూ అధికారులు తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు..
వైవీయూ పరిధిలోని 57 పరీక్షా కేంద్రాల్లో 14 పరీక్షా కేంద్రాలు సెల్ఫ్‌సెంటర్‌లుగా ఏర్పాటయ్యాయి. అయితే స్వీయ కేంద్రాల్లో మాస్‌కాపీయింగ్ నిరోధించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వైవీయూ అధికారులు సంబంధిత కళాశాలల యాజమాన్యాలను కోరారు. దీంతో స్వీయ పరీక్షాకేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించనున్నారు. అదే విధంగా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు బాగా వెలుతురు వచ్చేలా చర్యలు చేపట్టడంతో పాటు తాగునీరు అందుబాటులో ఉంచడం, టాయిలెట్లను శుభ్రంగా ఉంచి, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని కళాశాలల యాజమాన్యాలను వైవీయూ అధికారులు కోరారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు కళాశాలల ఐడెంటిటీ కార్డును వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు.
పరిశీలకులు, స్క్యాడ్ బృందాలు ఏర్పాటు..
పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రానికి ఒక పరిశీలకున్ని నియమించారు. మొత్తం 57 పరీక్షా కేంద్రాల్లో 57 గురు అబ్జర్వర్లను, వీరితో పాటు ఒక్కో బృందంలో ఇద్దరు సభ్యులు గల 5 స్క్వాడ్ బృందాలను వివిధ రూట్లలో పరీక్షల తనిఖీ కోసం నియమించారు.
మూడు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహణ
ప్రధాన పరీక్షలన్నీ ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే తొలుత నిర్వహించే క్లస్టర్ పరీక్షలు ప్రతిరోజూ మూడుదశల్లో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 వరకు ఒక బ్యాచ్, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మరో బ్యాచ్, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఇంకో బ్యాచ్ చొప్పున మూడుదశలుగా పరీక్షలు నిర్వహించనున్నారు.
సమస్య తలెత్తితే పరీక్షల విభాగాన్ని సంప్రదించవచ్చు
పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాం. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. పరీక్షా కేంద్రంలో ఏవైనా సమస్య తలెత్తితే ఆయా పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా యోగి వేమన విశ్వవిద్యాలయం పరీక్షల విభాగాన్ని సంప్రదిస్తే వెంటనే సమస్యను పరిష్కరిస్తాం.
– ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి,
పరీక్షల నియంత్రణాధికారి, వైవీయూ